పలు ఆంగ్ల మరియు హిందీ చిత్రాల్లో నటిస్తూ తన క్రేజ్ ను దశదిసలా వ్యాపిస్తున్న మోస్ట్ పాపులర్ హాలీవుడ్ లేడీ సన్నీలియోన్ మొట్టమొదటిసారిగా తెలుగులో హీరోయిన్ గా ఒక సినిమా సైన్ చేసింది. కమర్షియల్ చిత్రాలకు పెట్టింది పేరైన వి.సి.వడివుడయన్ దర్శకత్వంలో స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్స్ స్టిఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సౌత్ ఇండియన్ కల్ఛర్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందున్న ఈ చారిత్రాత్మక యుద్ధ నేపధ్య చిత్రంలో సన్నీలియోన్ కథానాయికగా నటించనుంది. నవదీప్, నాజర్ లు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు.
ఇందుకోసం సన్నీలియోన్ కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ మరియు కొన్ని యుద్ధ కళలను నేర్చుకొనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక ప్రముఖ ట్రైనర్ ఈ కళలను ముంబైలో సన్నీలియోన్ కు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం సన్నీలియోన్ ఏకంగా 150 రోజుల కాల్షీట్స్ ను దర్శకనిర్మాతలకు ఇవ్వడం బట్టి సినిమాపై ఆమెకున్న నమ్మకం తెలుస్తోంది. “బాహుబలి, 2.0” చిత్రాలకు గ్రాఫిక్స్ వర్క్ చేసిన సంస్థలు ఈ చిత్రానికి కూడా పనిచేయనున్నారు. సినిమాలో దాదాపు 70 నిమిషాల గ్రాఫిక్స్ ఉంటాయని చెబుతున్నారు. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో టైటిల్ ను త్వరలోనే వెల్లడించనున్నారు.
ఈ సినిమా గురించి సన్నీలియోన్ మాట్లాడుతూ.. “ఇప్పటివరకూ నాకున్న ఇమేజ్ ను పూర్తిస్థాయిలో మార్చే సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది. యాక్షన్ సీక్వెన్స్ లలో యాక్ట్ చేయాలన్నది నా కల, అది ఈ సినిమాతో నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి ఒక అద్భుతమైన కథ కోసం ఎన్నాళ్ల నుండో ఎదురుచూస్తున్నాను. దర్శకుడు వి.సి.వడివుడయన్ కథ చెప్పిన మరుక్షణం నుండే ఈ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఎప్పట్నుంచో ఒక స్ట్రయిట్ తెలుగు సినిమా చేయాలనుకొంటున్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడులో నాకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది” అన్నారు.
2018 ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభవ్వనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మరియు సెట్ వర్క్ ప్రస్తుతం వాయివేగంతో జరుగుతున్నాయి.