iDreamPost
iDreamPost
కెరీర్ ప్రారంభంలో సత్యం, గోదావరి, గౌరీ లాంటి మంచి హిట్లతో దూసుకుపోయేలా కనిపించిన సుమంత్ ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. వరుస ఫెయిల్యూర్స్, వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు వెరసి ఏళ్ళ తరబడి కనిపించకుండా పోయాడు. గౌతమ్ తిన్ననూరి తీసిన మళ్ళీ రావాతో ట్రాక్ లోకి వచ్చినా తిరిగి ఫ్లాపులు పలకరించడంతో మార్కెట్ ఇంకా తగ్గిపోయింది. ఆ మధ్య వచ్చిన కన్నడ హిట్ రీమేక్ కపటధారి మరీ అన్యాయం. దారుణంగా డిజాస్టర్ కొట్టింది. అయినా సుమంత్ చేస్తున్న సినిమాలు తగ్గలేదు. నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో ఒకటి మళ్ళీ మొదలైంది. ఇందాకే ట్రైలర్ ని విడుదల చేశారు.
వైవాహిక జీవితంలో భాగస్వామితో పొసగలేక విడాకులు తీసుకున్న యువకుడికి చుట్టుపక్కల నుంచి సూటిపోటి మాటలు మొదలవుతాయి. బామ్మ కూడా దెప్పి పొడుస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తన భార్య తరఫున వాదించిన లేడీ లాయర్ నే ప్రేమిస్తాడు హీరో. దీంతో అందరూ షాక్ తింటారు. జంటలను విడగొట్టే న్యాయవాద వృత్తిలో ఉన్న అమ్మాయిని పడేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ కథ సాఫీగా సాగదు. ఇక్కడా ట్రబుల్స్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ వ్యవహారం కోర్టు దాకా వెళ్తుంది. ఈసారి ఖంగు తినడం జడ్జ్ వంతు అవుతుంది. అసలు ఇతగాడి జీవితంలో ఏం జరిగిందనేదే ఫైనల్ స్టోరీ.
అరటిపండు ఒలిచినట్టు మొత్తం ట్రైలర్ లోనే చూపించేశారు. ఎంటర్ టైన్మెంట్ ని ప్రధానంగా ఉంచేసి బ్యాక్ గ్రౌండ్ లో ఎమోషన్స్ ని జొప్పించే ప్రయత్నం చేశారు దర్శకుడు టిజి కీర్తి కుమార్. టేకింగ్ ఫ్రెష్ గానే ఉంది. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చగా శివ ఛాయాగ్రహణం అందించారు. డీసెంట్ బడ్జెట్ లో ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసిన ఈ సినిమా థియేటర్ ఎక్స్ పీరియన్స్ ని డిమాండ్ చేస్తుందా లేదా అనేది ప్రెజెంటేషన్ ని బట్టి ఉంటుంది. సుమంత్, నైనా, కీర్తి కుమార్, పృథ్వి, అన్నపూర్ణ, వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన మళ్ళీ మొదలైంది త్వరలోనే రానుంది కానీ ఇంకా డేట్ ఫైనల్ చేయలేదు.
ALSO READ – 3 సినిమాల బిజినెస్ టార్గెట్