iDreamPost
android-app
ios-app

సోముకు పంటికింద రాయిలా సుజనా..!

సోముకు పంటికింద రాయిలా సుజనా..!

ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేసే ప్రభుత్వ నిర్ణయాలకు ప్రజల ఆమోదం ఉండదు. అలాంటి నిర్ణయాలు ఏ ప్రభుత్వం తీసుకున్నా.. సదరు ఆస్తి ఉన్న ప్రాంతంలోని ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొవాల్సిందే. వైజాగ్‌ స్టీల్‌ను ప్రైవేటుపరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై విశాఖ నగర వాసులే కాదు యావత్‌ ఏపీ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు కురిపిస్తున్నారు. పైగా స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు వెనుక గొప్ప చరిత్ర ఉంది. భూములు, ప్రాణ త్యాగాలు ఉన్నాయి. అందుకే వైజాగ్‌ స్టీల్‌ కంపెనీపై తీసుకునే ఎలాంటి నిర్ణయాలైనా ప్రజల మనస్సులను కదిలిస్తాయి.

మొత్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. ఏపీలో బలపడాలనుకుంటున్న బీజేపీకి షరాఘాతంలా మారింది. బీజేపీ బలోపేతం చేసేందుకు, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే లక్ష్యాలతో పని చేస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఇది విషమ పరీక్షే. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఎలా సమర్థించాలో తెలియక తలలుపట్టుకుంటున్నారు. ప్రజల నాడి ఎలా ఉందో స్థానికంగా ఉన్న సోము వీర్రాజుకు తెలుసు. అందుకే ఆచితూచి మాట్లాడుతూ.. ప్రజల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రజల ఆందోళనను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళతానని చెబుతున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ కోసం పోరాటం చేస్తానని ప్రకటిస్తూ.. పుట్టిమునగకుండా జాగ్రత్తపడుతున్నారు.

అయితే సోము ప్రయత్నాలకు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి గండికొడుతున్నారు. కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ విక్రయం మంచిదేనంటున్నారు. పెట్టుబడులు పెంచేందుకు, షేర్‌ హోల్డర్లకు లాభాలు తెచ్చిపెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకోవడం సుభపరిణామమన్నారు. స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయ ప్రభావం.. ఏపీలో పార్టీపై పడకుండా సోము ప్రయత్నాలు చేస్తుండగా.. అందుకు భిన్నంగా సుజనా చౌదరి ప్రకటలను చేస్తూ సోముకు పంటికింద రాయిలా మారారు.

సోము వీర్రాజు అధ్యక్షుడుకాక ముందు సుజనా చౌదరి తరచూ మీడియాతో మాట్లాడేవారు. అమరావతి, రాష్ట్ర అంశాలపై బీజేపీ వైఖరికి భిన్నంగా సుజనా మాట్లాడుతూ హల్‌చల్‌ చేసేవారు. కన్నా లక్ష్మీనారాయణ సమయంలో సుజనా హవా సాగగా.. సోము వీర్రాజు హాయంలో చెక్‌ పడింది. రాష్ట్ర పార్టీకి వైఖరికి భిన్నంగా సుజనా మాట్లాడుతుండడంతో.. సోము వీర్రాజు తనకున్న పలుకుబడితో సుజనా నోటికి తాళం వేయించారు. మళ్లీ ఇన్నాళ్లకు సుజనా చౌదరికి మాట్లాడే అవకాశం లభించింది. కేంద్ర నిర్ణయాన్ని సమర్థించేలా ప్రకటనలు చేయడం వల్ల ఢిల్లీ నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు. అదే సమయంలో సోము వీర్రాజును ఇబ్బంది పెట్టే అవకాశాన్ని సుజనా ఏ మాత్రం వదులుకోలేదు. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఇతర రాజ్యసభ సభ్యులు ఈ విషయంపై మౌనంగా ఉన్నా.. సుజనా స్పందించడానికి గల కారణం మాత్రం గత చరిత్రనే.

Read Also : పెద్దిరెడ్డిపై నిమ్మగడ్డకు కక్ష ఎందుకు..?