విశాఖకు విద్యార్థులు.. ఊరిపిపీల్చుకున్న తల్లిదండ్రులు

మలేసియా, ఫిలిఫైన్స్‌ దేశాలలో విద్యనభ్యసించేందుకు వెళ్లిన భారత విద్యార్థులు సురక్షితంగా దేశానికి చేరుకున్నారు. కరోనా వైరస్‌ ప్రభావంతో ఆ దేశాల్లో విద్యా సంస్థలకు శెలవులు ప్రకటించడంతోపాటు విద్యార్థులు స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విమానయాన సేవలు నిలిచిపోవడంతో ఏపీతోపాటు, కర్ణాటక, తమిళనాడు, కేరళ విద్యార్థులు కౌలాలంపూర్‌ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు.

విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడం, ఏపీ ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో విదేశాంగశాఖ రంగంలోకి దిగింది. విద్యార్థులను దేశానికి తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేసింది. ప్రత్యేక విమానాన్ని పంపి భారత విద్యార్థులను విశాఖకు తీసుకువచ్చింది. మొత్తం 186 మంది విద్యార్థులు బుధవారం రాత్రి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు.

విద్యార్థులకు ఎయిర్‌పోర్టులోనే స్క్రీనింగ్ పరీక్ష చేసిన అధికారులు వారిని ఐసోలేషన్‌లో ఉంచారు. ఇందు కోసం విశాఖలోని ప్రముఖ ఆస్పత్రులలో ప్రత్యేక వార్డులు సిద్ధం చేశారు. పూర్తి అబ్జర్వేషన్‌ తర్వాత విద్యార్థులను వారి స్వస్థలాలకు పంపనున్నారు. తమ పిల్లలు సురక్షితంగా చేరుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

Show comments