లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. స్టాక్ మార్కెట్‌ మహా పతనం..

కరోనా వైరస్‌ భయంతో రోజు రోజుకు దిగజారుతున్న భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు మహా పతనం దిశగా సాగాయి. భారత్‌లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్‌ డౌన్‌ను ప్రకటించడంతో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్‌పై పడింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక రోజులో బాంబే స్టాక్‌ ఎక్సైంజ్‌ సూచి సెన్సెక్స్‌ 3,935 పాయింట్లు కోల్పోయి 25,981కు చేరింది. ఇక నేషనల్‌ స్టాక్‌ ఎక్సైంజ్‌ సూచి నిఫ్టి 1,135 పాయింట్లు నష్టపోయి 7,610 వద్ద ముగిసింది.

2008లో ప్రపంచ ఆర్థిక మాంధ్యం ప్రభావంతో బాంబే స్టాక్‌ఎక్సైంజ్‌ తీవ్రంగా పతనమైంది. అప్పట్లో సెన్సెక్స్‌ సూచి పాయింట్లు దాదాపు 17 వేలు ఉండగా రోజుల వ్యవధిలోనే 8 వేల పాయింట్లకు దిగజారింది. ఆ తరహాలోనే ఇప్పుడు కరోనా వైరస్‌ కారణంగా భారత మార్కెట్లు పతనమవుతున్నాయి.

ఈ ఏడాది జనవరిలో సెన్సెక్స్‌ ఆల్‌టైం రికార్డు 42,059 పాయింట్లను తాకింది. ఆ తర్వాత కూడా కొంచెం అటు ఇటుగా ట్రేడ్‌ అయింది. అయితే చైనాలో మొదలైన కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను చుట్టడంతో మార్కెట్‌ పతనం ప్రారంభమైంది. ఆ మహమ్మరి భారత్‌కు రావడంతో మార్కెట్‌ పతనం ఏ దశలోనూ ఆగలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పలు చర్యలు తీసుకున్నా ఫలితం లేకపోయింది. రోజుల వ్యవధిలో 42,069 పాయింట్లుగా ఉన్న సెన్సెక్స్‌ మొత్తం మీద 16 వేల పాయింట్లు కోల్పోయి ప్రస్తుతం 25,981 వద్ద కొనసాగుతోంది. ఇది భవిష్యత్‌లో మరింతగా దిగజారే అవకాశం ఉంది.

సెన్సెక్స్‌ బాటలో నిఫ్టి కూడా పయనిస్తోంది. నిఫ్టి ఆల్‌టైం రికార్డు 12,430 పాయింట్ల నుంచి ప్రస్తుతం 7,610 పాయింట్లకు దిగజారింది. మొత్తం మీద కరోనా ఎఫెక్ట్‌తో నిఫ్టి 4,820 పాయింట్లు నష్టపోయింది. లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద ఆవిరైంది. ఓ వైపు మార్కెట్లు పతనం అవుతున్నా.. మదుపరులు తమ వాటాలను అయినకాడికి తెగనమ్ముకుంటున్నారు.

Show comments