iDreamPost
iDreamPost
మొన్న శుక్రవారం వచ్చిన మీడియం రేంజ్ సినిమాలు ఏవీ ఆకట్టుకోకపోవడంతో ఇప్పుడు ట్రేడ్ తో పాటు మూవీ లవర్స్ చూపు రాబోయే ఫ్రైడే మీద ఉంది. అయితే ఈసారి పెద్ద స్టార్లు లేకుండా కుర్ర హీరోలు కుస్తీ పడబోతున్నారు. సెప్టెంబర్ 23 దానికి వేదిక కానుంది. మొదటిది ‘అల్లూరి’. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా శ్రీవిష్ణు మొదటిసారి నటించిన క్యారెక్టర్ ఇది. నిన్న అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల జనానికి ఇదొకటుందనే విషయం తెలిసింది. బజ్ విషయంలో కొంత వెనుకబడే ఉన్నా ట్రైలర్ గట్రాలు మాస్ ని టార్గెట్ చేసినట్టు స్పష్టం చేశాయి. టీమ్ మాత్రం మంచి మెసేజ్ తో పాటు అన్ని అంశాలు గట్టి ఉంటాయని హామీ ఇస్తోంది
ఈ సినిమా అయిపోయాక ఆడియన్స్ లేచి నిలబడి చప్పట్లు కొట్టాలనిపించకపోతే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతానని గీత రచయిత రాంబాబు గోసాల చెప్పడం ఇప్పటికే వైరల్ అయ్యింది. రెండోది ‘కృష్ణ వృందా విహారి’. ఛలో తర్వాత సరైన హిట్టు లేక వరస వైఫల్యాలు చూస్తున్న నాగ శౌర్య దీని ప్రమోషన్ కోసం ఏకంగా వందల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా రాజకీయాల్లో ఇలా చేస్తారు కానీ సినిమా పబ్లిసిటీ కోసం మొదటిసారని పరిశీలకుల అభిప్రాయం. మూడోది శ్రీసింహ ‘దొంగలున్నారు జాగ్రత్త’. సురేష్ సంస్థ పార్ట్ నర్ షిప్ కావడంతో చెప్పుకోదగ్గ రిలీజ్ దక్కుతోంది. మౌత్ టాక్ వస్తేనే ఇలాంటివి నిలబడగలుగుతాయి.
ఇవి కాకుండా బెడ్ లైట్, ఇక్షు, పగ పగ పగ అనే మరో మూడు చిన్న చిత్రాలు రేస్ లో ఉన్నాయి. అవతార్ 1కి ప్రత్యేకంగా ఫుటేజ్, ఎఫెక్ట్స్ జోడించి అదే రోజు రిలీజ్ చేయనుండటం ఇక్కడ చెప్పిన వాటి మీద ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. దుల్కర్ సల్మాన్ హిందీ మూవీ ‘చుప్’ సైతం 23కే వస్తోంది. సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం కూడా రావాల్సింది కానీ మళ్ళీ వాయిదా వేశారు. ఇవి కాకుండా ఇంకొన్ని బాలీవుడ్ సంత వస్తున్నాయి కానీ వాటిమీదేం హైప్ లేదు. ఇన్ని వస్తున్నా స్క్రీన్ కౌంట్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే 30న రాబోయే పొన్నియన్ సెల్వన్, దసరాకు వచ్చే గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ లు దిగే లోపు వీలైనంత రాబట్టుకుని సేఫ్ అవ్వాలి. లేదంటే కష్టమే.