iDreamPost
iDreamPost
అదేంటి ఎప్పుడో వచ్చిన మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా ఇప్పుడు వంద కొట్టడం ఏమిటా అని ఆశ్చర్యపడకండి. ఈ రికార్డు వేరే. యుట్యూబ్ లో వంద మిలియన్ల వ్యూస్ సాధించిన మొదటి తెలుగు స్ట్రెయిట్ మూవీగా శ్రీమంతుడు ఖాతాలో కొత్త ఘనత వచ్చి చేరింది. ఇప్పటిదాకా ఏ టాలీవుడ్ సినిమాకు ఈ ఫీట్ సాధ్యం కాలేదు. గతంలో పాటలు, లిరికల్ వీడియోస్, వీడియో సాంగ్స్ కు ఇంత కన్నా ఎక్కువ వీక్షణలు వచ్చాయి కాని రెండున్నర గంటల చిత్రానికి రావడం ఇదే మొదటిసారి. అందుకే మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టేశారు.
శ్రీమంతుడుని సరిగ్గా రెండేళ్ల క్రితం 2018లో అప్లోడ్ చేశారు. అప్పటిదాకా అది ఏ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లోనూ అందుబాటులో లేదు. టీవీలో లెక్కలేనన్ని సార్లు టెలికాస్ట్ చేసినా ఆన్ లైన్ లో ఈ స్థాయిలో శ్రీమంతుడుకి స్పందన రావడం విశేషం. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి సంస్థ నిర్మించిన ఈ సినిమా మహేష్ కెరీర్ లో అర్జెంటుగా బ్లాక్ బస్టర్ కావాల్సిన టైంలో వచ్చింది. అప్పటిదాకా ఉన్న పాత రికార్డులను సవరించింది. శృతిహాసన్ హీరొయిన్ గా ఊరిని దత్తత తీసుకోవడమనే పాయింట్ కు ప్రేక్షకులు బ్రహ్మాండంగా కనెక్ట్ అయ్యారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, తిరిగిచ్చేయాలి లేదంటే లావైపోతారు లాంటి డైలాగులు ఓ రేంజ్ లో పేలాయి. ఒకవేళ శ్రీమంతుడు ఇప్పుడు కనక వచ్చి ఉంటే యుట్యూబ్ లో పెట్టేవాళ్ళు కాదు. ఏ అమెజాన్ కో లేదా నెట్ ఫ్లిక్స్ కో ఇచ్చేసి వేరే ఆప్షన్ లేకుండా పోయేది. మైత్రి సంస్థ ఎన్ని సినిమాలు నిర్మించినా కేవలం జనతా గ్యారేజ్, శ్రీమంతుడులు మాత్రమే యుట్యూబ్ లో ఫ్రీగా ఉంచడం గమనార్హం. ఈ రెండూ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందినవి కావడం మరో విశేషం. ఇటీవలే సరిలేరు నీకెవ్వరుతో టీవీ రేటింగ్స్ లో బాహుబలిని క్రాస్ చేసి ఫాన్స్ కి కిక్ ఇచ్చిన ప్రిన్స్ ఇప్పుడు శ్రీమంతుడు రికార్డుతో దాన్ని రెట్టింపు చేసేశాడు.