iDreamPost
android-app
ios-app

చీమ‌ల‌కి కూడా కోపమొస్తుంది

చీమ‌ల‌కి కూడా కోపమొస్తుంది

కాలానికి లెక్క‌లు తెలియ‌వు. తేదీలు, సంవ‌త్స‌రాలు మ‌నం కౌంట్ చేయాల్సిందే. అల‌ల్లా కాలం క‌దులుతూనే వుంటుంది. కొత్త ఏడాది వ‌చ్చి రెండు రోజులైంది. ఏమీ జ‌ర‌గ‌దు, ఏదీ అంత సుల‌భంగా మార‌దు, కానీ ఏదో ఆశ‌.

నా చిన్న‌త‌నంలో అన్ని రోజుల్లానే జ‌న‌వ‌రి ఫ‌స్ట్ కూడా. మామూలు జ‌నం ప‌ట్టించుకునే వాళ్లు కాదు. 1971 జ‌న‌వ‌రి ఫ‌స్ట్ నాటికి నేను ఐదో త‌ర‌గతి. న్యూ ఇయ‌ర్ అని మా చిన్నాన్న కొంచెం హ‌డావుడి చేశాడు. అప్ప‌టికి ఆయ‌న డిగ్రీ. మా తాత అమాయ‌కంగా “అయితే ఏంద‌బ్బో” అని ఎద్దుల్ని తోలుకుని చేనికాడికి పోయాడు. కొత్త సంవ‌త్స‌రాల వ‌ల్ల రైతుల‌కి ఏమీ జ‌ర‌గ‌ద‌ని ఆయ‌నికి 50 ఏళ్ల క్రిత‌మే తెలుసు. ఎన్నో క‌రువుల్ని చూసిన వాడు. మా వూరి ప‌క్క‌న కాలువ వ‌స్తాద‌ని, భూముల‌కి నీళ్లు వ‌స్తాయ‌ని జీవిత‌మంతా ఎదురు చూశాడు. ఆ నీళ్ల‌ను ఇంత వ‌ర‌కూ ఎవ‌రూ చూడ‌లేదు.

రైతులు మూగెద్దులాంటోళ్లు. ఎపుడో త‌ప్ప కొమ్ము విద‌ల్చ‌రు. జ‌ర్న‌లిస్టుగా 25 ఏళ్ల కెరీర్‌లో ఒక్క రైతు ఉద్య‌మం కూడా చూడ‌లేదు. మ‌ద‌న‌ప‌ల్లె ట‌మోటా రైతులు క‌డుపు మండి రోడ్డు మీద పారేశారు కానీ, ద‌ళారుల్ని ఒక్క‌రోజు కూడా చొక్కా ప‌ట్టుకుని త‌న్న‌లేదు. చెర‌కు రైతులు బ‌కాయిల కోసం ఫ్యాక్ట‌రీ చుట్టూ తిరిగారే కానీ, చైర్మ‌న్‌ని చొక్కా ప‌ట్టుకుని ఈడ్చ‌లేదు. అన్ని పార్టీల‌కీ రైతు విభాగాలు ఉంటాయి కానీ ప‌నిచేయ‌వు. క‌ల్తీ మందులు, విత్త‌నాలు న‌డుస్తూనే వుంటాయి. రైతు తర‌పున ఎవ‌రూ రోడ్డెక్క‌రు. రైతులు సంఘ‌టిత ఓటు బ్యాంక్ కాక‌పోవ‌డ‌మే కార‌ణం.

ప్ర‌శ్నించే గొంతుని ప్ర‌భుత్వాలు ఎప్పుడూ ఇష్ట‌ప‌డ‌వు. అది వాటి స్వాభావిక ల‌క్ష‌ణం. రైతులు ఇప్పుడు గ‌ట్టిగా ప్ర‌శ్నిస్తున్నారు. అది మింగుడు ప‌డ‌క ఖ‌లిస్తాన్ అన్నారు. ప‌ప్పులుడ‌క‌లేదు. కాంగ్రెస్ న‌డిపిస్తోంద‌న్నారు. ఇంత పెద్ద రైతు ఉద్య‌మం నిర్మించే శ‌క్తే ఉంటే కాంగ్రెస్ ఇంకా బ‌తికే వుండేది. దేశంలోని ఏ రాజ‌కీయ పార్టీకి వేల మంది రైతుల్ని నెల‌రోజులు రోడ్డు మీద‌కి తెచ్చే దీక్ష లేదు. అంత క‌మిట్‌మెంట్ లేదు.

అటూఇటూ పోయి మండీ వ‌ర్త‌కులు ఈ ఉద్య‌మాన్ని న‌డిపిస్తున్నార‌ని అన్నారు. ఒక నిర‌స‌న మొద‌లైన‌ప్పుడు అనేక అనుకూల‌, ప్ర‌తికూల శ‌క్తులు వ‌చ్చి చేరుతాయి. ఈ శ‌క్తుల సంఘ‌ర్ష‌ణ వ‌ల్ల ఒక్కోసారి ఉద్య‌మాలు నీరుగారిపోతాయి కూడా. నెల‌రోజులు గ‌డిచే స‌రికి అంద‌రూ నోరు మూసుకున్నారు. వ్యాపారుల్ని న‌మ్మి చ‌లిలో వేల మంది ఉన్నార‌ని అర్థం చేసుకోడానికి తెలివి అక్క‌ర్లేదు.

ఇదంతా కాద‌ని పంజాబ్ రైతులు ధ‌నికులు, ఎక‌రా కోటి రూపాయ‌ల‌ని కొంత మంది వ్యాసాలు కూడా రాశారు. అంబానీ ఇంటి ఫొటోలు చూసి మ‌నం ఆనందిస్తాం. ఒక రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి గ‌జం రూ.5 ల‌క్ష‌ల‌కి అమ్మినా సంతోష‌మే. ఒక రైతు షావుకారంటే మ‌న‌కి బాధ‌. రైతు అంటే మాసిపోయిన గ‌డ్డం, బ‌ట్ట‌ల‌తో క‌న‌ప‌డాలి. మార్కెట్‌లో ఒక స‌బ్బు ధ‌ర పెరిగితే ఫీల్ కాము. కూర‌గాయ‌లు రూపాయి పెరిగితే ధ‌ర‌లు మండిపోతున్నాయ‌ని న్యూస్‌. నిజానికి ఈ మండే ధ‌ర‌లో రైతుకి చేరేది చాలా త‌క్కువ‌. అందుక‌ని రైతుకి ఫ్రీ మార్కెట్ ఉండాలి, దేశంలో ఎక్క‌డైనా అమ్ముకునే విధంగా కొత్త చ‌ట్టాల్లో ఇదో పాయింట్‌.

అనంత‌పురంలో రెండెక‌రాల్లో పంట తీసిన రైతు, అన‌కాప‌ల్లిలో అమ్ముకుంటాడా? పొలం నుంచి అనంత‌పురం చేర్చ‌డానికే ఆటోవాడికి అప్పు పెట్టే రైతుకి ఫ్రీ మార్కెట్ ఉప‌యోగ‌ప‌డుతుందా? వ‌్యాపారుల‌కి లాభాలు తెస్తుందా?

విష‌యం ఏమంటే కార్పొరేట్ బ్రాండెడ్ కంపెనీలన్నీ క‌లిసి చిన్న‌చిన్న వ్యాపారుల్ని , ద‌ళారుల్ని ఫినిష్ చేసి మార్కెట్‌ని గుప్పెట్లో పెట్టుకుంటాయి. రైతుకి న్యాయ‌మైన ధ‌ర వ‌స్తే ఈ ప్ర‌యోగం మంచిదే. అయితే అది అసంభ‌వం. ఎందుకంటే లాభం మాత్ర‌మే ఈ కంపెనీల అంతిమ ల‌క్ష్యం కాబ‌ట్టి. ఒక బైక్ కొంటే చీమ త‌ల‌కాయింత ష‌ర‌తుల్ని చ‌దివే ఓపిక లేక 100కి 99 మంది గుడ్డిగా సంత‌కాలు పెడ‌తారు. మ‌రి అగ్రిమెంట్ పేప‌ర్ల‌ని చ‌దివి రైతులు సంత‌కాలు పెడ‌తారా? జియో కంపెనీ ఉచితంగా క‌నెక్ష‌న్లు ఇచ్చిన‌ట్టు , ఓలాలో 50 రూపాయ‌ల‌కి కూడా షేర్ జ‌ర్నీ చేసిన‌ట్టు మొద‌ట్లో రైతుల‌కి లాభాలు క‌ళ్లు చెదిరేలా వ‌స్తాయి. ఊబిలోకి దిగిన త‌ర్వాత లోతు తెలుస్తుంది. డ్రైవ‌ర్లు కార్లు అమ్ముకుని రోడ్డు మీద ప‌డిన‌ట్టు , రైతులు భూముల‌మ్ముకుంటారు. లేదా కూలీలుగా మారిపోతారు.

ఇక చ‌ట్టాలంటారా? అవి కాగితాల మీద ఉంటాయి. చైనా వాడు యాప్స్ పెట్టి జ‌నాల‌కి అప్పులిచ్చి (అదీ ఫోన్‌లో) 20 వేల కోట్లు దోచేస్తేనే దిక్కులేదు. ఇక రైతుకి దిక్కుంటుందా?

జ‌నం హ‌క్కుల గురించి వ్యాసాలు రాసే జ‌ర్న‌లిస్టుల‌కే వేజ్‌బోర్డులు అమ‌లు కాని స్థితి ఉంది. 1991లో బ‌చావ‌త్ వేజ్‌బోర్డు జీతం త‌ప్ప నా పాతికేళ్ల స‌ర్వీసులో వేజ్‌బోర్డు ప‌ద‌మే విన‌లేదు. మేధావులే మూసుకుని కూర్చున్న‌ప్పుడు అన్యాయం జ‌రిగితే రైతు పొంద‌గ‌లడా?

వేటకి గురైన జంతువులు నోరు విప్పే వ‌ర‌కు వేట‌గాడి క‌థ‌లే చ‌రిత్ర‌. చీమ‌లు కూడా ఒక్కోసారి చ‌రిత్ర‌ని మారుస్తాయి.

కోపం వ‌స్తే తేనెటీగ‌లు వెంట‌ప‌డి వేటాడి మ‌రీ కుడతాయి.