Idream media
Idream media
సినిమా ఓపెనింగ్ సీన్‌లో కొంత మంది అన్నదమ్ములు నరుక్కుంటారు. వాళ్లెవరో తెలియాలంటే సెకండాఫ్ వరకూ Wait చేయాలి. తర్వాత విలన్ తండ్రిని పంచాయితీలో హత్య చేస్తారు. మిగిలిన కథ కోసం వెయిట్ చేయక్కర్లేదు. సుమారుగా అర్థమైపోతుంది.
ఊరు, నాజర్‌లాంటి పెద్ద మనిషి, అతని కొడుకు నానీ హీరో. ఒక విలన్, హీరోకి పెద్ద కుటుంబం, క్షత్రియపుత్రుడేమోనని అనుమానం వస్తుంది. తర్వాత పెద్ద కొడుకు జగపతిబాబు వాలకం చూసి మణిరత్నం ఘర్షణ అని సందేహం. తర్వాత ఇంకే Doubt రాదు. పాత సినిమాల్ని అతుకులేసి డైరెక్టర్ శివనిర్వాణ నానీతో టక్ జగదీష్ అనిపించాడని.
టైటిల్‌కి సినిమాకి సంబంధం లేనట్టు, సినిమాలో వచ్చే ఎమోషన్స్‌కి ప్రేక్షకులకేం సంబంధం వుండదు. ఒక అధికారిని చూసి టక్ చేసుకోవాలని, గవర్నమెంట్ అధికారి కావాలని నిర్ణయించుకున్నానని నానీ ఒక సీన్‌లో అంటాడు. అదే టైటిల్ జస్టిఫికేషన్.
నాజర్‌కి ఇద్దరు భార్యలు. చిన్న భార్యకి ఇద్దరు కొడుకులు. జగపతిబాబు, నాని. పెద్ద భార్యకి ఇద్దరు కూతుళ్లు, రోహిణి, దేవదర్శిని. అల్లుళ్లు రావు రమేష్, నరేష్. ముగ్గురు మనుమరాళ్లు. కృష్ణవంశీ సినిమాలోలా స్క్రీన్ నిండుగా వుంటారు కానీ, ఎవరేంటో అర్థంకారు. OTT కాబట్టి వెనక్కి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.
భూదేవిపురంలో భూమి తగాదాలు. వచ్చిన MRO ని విలన్ బెదిరిస్తూ వుంటాడు. మాట వినకపోతే చంపేస్తాడు.
తన కారుకి తగిలి పుంజు గాయపడితే , దానికి కట్టు కట్టి కాపాడేంత మంచి వాడు నాని. ఈ సీన్ చూస్తే నానికి హింస అంటే ఇష్టముండదని అనుకుంటే తప్పు. కోడితో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాడట అందుకు.
సినిమాలో హీరోయిన్ రీతూవర్మ కూడా వుంటుంది. MRO ఫైల్స్ మోయడానికి, సలహాలు ఇవ్వడానికి, హీరోకి ధైర్యం చెప్పడానికి , రెండుసార్లు భోజనం చేయడానికి. ఇంతకు మించి ఏమీ వుండదు. చాలా కాలం తర్వాత రీతూవర్మ కనిపించింది. కనిపించిందంతే, నటించడానికేం లేదు.
అన్నగా జగపతిబాబు కనిపించినప్పుడే మనలో ఏదో అనుమానం. అనుకున్నట్టు గానే అడ్డం తిరుగుతాడు. చివరికి ఎలాగో మారుతాడు. ఆ మార్పు కూడా పాత సినిమాలో నాగభూషణంలా కనిపించే మార్పే.
వెనుకటికి విజయా చక్రపాణికి ఎవరో సలహా ఇచ్చారట, కొత్త విలన్‌ని పెడదామని.
రాజనాలని పెడితే ఫస్ట్ సీన్‌లోనే విలన్ అని తెలిసిపోతుంది. కొత్త వాన్ని పెడితే విలన్ అని ఎస్టాబ్లిష్ చేయడానికి రెండు రీళ్లు వేస్ట్ అన్నాడట. దీనికి జగపతిబాబే కరెక్ట్.
హీరోకి మేనకోడలు ఐశ్వర్య రాజేష్. హీరోని పెళ్లి చేసుకోవాలని ఇష్టం. హీరోకి ఆ దృష్టి లేదు. అతనికి చిన్న పిల్లే. కాదన్నాడని కోపంతో జగపతిబాబు తెచ్చిన సంబంధం చేసుకుంటుంది. అతను విలన్ తమ్ముడు, శాడిస్ట్.
Also Read: టక్ జగదీష్ రివ్యూ
మన సినిమాల్లో బోలెడు లిబర్టీస్ వుంటాయి. ప్రశ్నించకూడదు. కుటుంబాన్ని అంతగా ప్రేమించే నాని , మేనకోడలు పెళ్లి కుదిరి, జరిగే వరకూ ఎవరూ అతనికి ఫోన్ చేయరు. అతనూ చేయడు. జగపతిబాబు లైన్ కలవలేదని చెబితే అది నమ్మి నాని లేకుండానే పెళ్లి జరిపిస్తారు. హీరోకి నిరంతరం తోడుగా వుండే ప్రవీణ్ కూడా హీరోకి విషయం చెప్పడు. కథ నడవాలి కదా!
మేనకోడలి భర్త తిరువీర్ వేధిస్తున్నాడని తెలిసి, ఆమె ఇంటి మీద ఒక బల్బ్ ఏర్పాటు చేసి, స్విచ్‌ని మేనకోడలికి ఇస్తాడు. సాయం కావాల్సినపుడు స్విచ్ నొక్కి బల్బ్ వెలిగించమంటాడు. అది వెలుగుతుందో లేదో తెలుసుకోవడానికి హీరో ఒక మైదానంలో అర్ధరాత్రిళ్లు ఎదురు చూస్తూ వుంటాడు. క్లైమాక్స్‌లో ఎలాగూ బల్బ్ వెలుగుతుంది. హీరో ఫైట్ చేస్తాడని మనకు తెలుసు. దీనికి బదులు సెల్‌ఫోన్ ఇచ్చి ఒక మిస్‌డ్ కాల్ ఇమ్మంటే పోతుంది కదా!
నాజర్ చనిపోతాడు. జగపతిబాబులోంచి అసలు మనిషి బయటికొస్తాడు. అక్కాచెల్లెళ్లను తరిమేస్తాడు. అతనికి ఆస్తి ముఖ్యం. నానికి కుటుంబం ముఖ్యం. అసలు నాని ఎవరన్నది ఇంటర్వెల్ ట్విస్ట్.
మధ్యలో విండ్‌మిల్ ప్రాజెక్ట్ గొడవ. వరినాట్లు వేసే భూముల్లో ఎక్కడా విండ్‌మిల్ ప్రాజెక్టులు కట్టరు. దాని లెక్కలు, పర్మిషన్లు వేరే వుంటాయి. అయినా విలన్‌కి 5 కోట్లు లంచం ఇవ్వగలిగిన వాళ్లు , MRO చుట్టూ తిరగరు. మంత్రుల ఛాంబర్లలో కూర్చొని పనులు చేయించుకుంటారు.
Also Read: సీటిమార్ రివ్యూ
సినిమాల్లో హీరో ఎస్ఐ అయితే అతనో సూపర్ పవర్, MRO అయినా అంతే. నాని అంటేనే కామెడీ కోరుకుంటారు. విలన్లని గాల్లోకి ఎగిరిస్తూ తంతే జనానికి పెద్ద నచ్చదు. కృష్ణార్జునయుద్ధంలో ఫస్టాఫ్ అంతా కామెడీనే ఉన్నా సెకెండాఫ్ యాక్షన్‌నే భరించలేకపోయారు. నాని యాక్షన్ ఎలివేషన్ కోసం చాలా ప్రయత్నమే జరిగింది. ఒక ఫైట్‌లో అలవైకుంఠపురం స్టైల్‌లో పాట కూడా పెట్టారు. నాని నుంచి ఏం కావాలో ప్రేక్షకులకి తెలుసు. నానీకే తెలియదు.
ఇవన్నీ పక్కన పెడితే నాని చాలా సీన్స్‌లో అద్భుతంగా నటించాడు. జగపతిబాబు అంతే. అయితే రోహిణి, దేవదర్శిని, రావు రమేష్, నరేష్ , రఘుబాబు లాంటి హేమాహేమీలున్నా ఎలాంటి స్కోపు లేదు. రావు రమేష్ లాంటి నటుడు కూడా కొన్ని సీన్స్‌లో ఏం నటించాలో తెలియక బ్లాంక్‌గా వుండాల్సిన స్థితి.
జీవితమంతా జనం కోసం బతికిన మనిషి నాజర్ అని ఆయన లాయర్ అంటాడు. సినిమాలో అదెక్కడా కనపడదు. రైతులకి భూములివ్వడం కాదు లీగల్‌గా రిజిస్ట్రేషన్ చేయించాలని ఆయనకు తెలియక పోతే , లాయర్‌కైనా తెలియదా?
నాని కుటుంబం కోసం సినిమా అంతా భారంగా , బాధగా మోస్తూ వుంటాడు. ఆ ఫ్యామిలీ ఎవరంటే ఆస్తి స్వాధీనం చేసుకునే వరకూ ఏళ్లపాటు అభిమానం నటించిన జగపతిబాబు, ఆస్తి కోసం పాకులాడే అక్క. తన కొడుకుని ప్రత్యేకంగా చూసే తల్లి. అందుకే మనం ఎక్కడా ఎమోషన్ కనెక్ట్ కాం.
థియేటర్‌లో వస్తే పరిస్థితి తెలీదు కానీ, OTTలో వచ్చి బతికిపోయింది. రెండుమూడు ఇంటర్వెల్స్ తీసుకుని ఓపిగ్గా చూడొచ్చు. ఎమోషన్స్ అందరికీ ఇష్టమే కానీ, స్లో మోషన్‌లో వుంటనే కష్టం.
విలన్‌గా డేనియల్ బాలాజీ, తమ్ముడుగా తిరువీర్ అద్భుతంగా నటించారు.
డైరెక్టర్ శివనిర్వాణ పాత బట్టలు తెప్పించి నానికి తొడిగించి అదనంగా టక్ చేయించాడంతే!
శివ నిర్వాణ క్రియేటివ్ డైరెక్టరే. పాత రీళ్లు తెచ్చి బయస్కోప్ మానేయాలి.
Also Read: శ్రీదేవి సోడా సెంటర్ రివ్యూ