సీటిమార్ రివ్యూ

By Ravindra Siraj Sep. 10, 2021, 03:49 pm IST
సీటిమార్ రివ్యూ

జూలై ఆఖరులో థియేటర్ల రీ ఓపెనింగ్ జరిగిన తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో వచ్చిన మొదటి భారీ సినిమాగా సీటిమార్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలే రేపింది. స్పోర్ట్స్ డ్రామానే అయినప్పటికీ దర్శకుడు సంపత్ నంది మార్క్ కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉన్నట్టు ట్రైలర్లో చూపించేశారు కాబట్టి మాస్ ఆడియన్స్ సైతం దీని మీద ఆసక్తి చూపించారు. చాలా కాలంగా సక్సెస్ లేక సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్న గోపిచంద్ ఈ సినిమా మీద గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. ఇతర పెద్ద చిత్రాల నిర్మాతలు సైతం దీనికొచ్చే వసూళ్లు ఎలా ఉంటాయనే పరిశీలనలో ఉన్నారు. మరి నిజంగా సీటిమార్ అనిపించేలా ఉందా లేదా రివ్యూలో చూద్దాం

కథ

ఆత్రేయపురంలో తన చిన్ననాటి స్కూల్ ని కాపాడుకునే లక్ష్యంతో బ్యాంకు ఉద్యోగం వదిలేసి మరీ ఆ ఊరి అమ్మాయిలకు కబడ్డీ కోచ్ గా ఉంటాడు కార్తీ(గోపీచంద్). అక్క(భూమిక)ఢిల్లీలో ఉంటుంది. బావ అరవింద్(రెహమాన్)పోలీస్ ఆఫీసర్. ఘజియాబాద్ లో ఉండే పేరు మోసిన పోలీస్ గూండా మక్కన్ సింగ్(తరుణ్ అరోరా)తో అరవింద్ శత్రుత్వం పెట్టుకుంటాడు. కట్ చేస్తే నేషనల్ గేమ్స్ ట్రైనింగ్ కోసం టీమ్ మొత్తాన్ని దేశ రాజధానికి తీసుకొచ్చిన కార్తీకి ఇక్కడ కొత్త ప్రమాదాలు ఎదురవుతాయి.టీమ్ కిడ్నాప్ కు గురవుతుంది. అతనికి తెలంగాణ కోచ్ జ్వాలా రెడ్డి(తమన్నా)తోడవుతుంది. తర్వాత ఏం జరిగిందన్నది తెరమీద చూడాలి

నటీనటులు

కథ ఎలాంటిదైనా దర్శకుడు ఎవరైనా పెర్ఫార్మన్స్ పరంగా గోపీచంద్ ఎప్పుడూ తన మీద కంప్లయింట్ వచ్చేలా చేసుకోడు. ఇందులోనూ అంతే. రెగ్యులర్ మీటర్ లో సాగినా కూడా తన క్యారెక్టర్ డిమాండ్ చేసినంత మేరకు ఏది ఇవ్వాలో అది పూర్తిగా కానిచ్చేశాడు. కొన్ని సీన్లలో ఎందుకో డల్ గా అనిపించినా కూడా ఓవరాల్ గా ఇంత గ్యాప్ తర్వాత ఇలాంటి మాస్ అవతారంలో చూడటం ఫ్యాన్స్ కి పండగే. బిల్డప్ ఇచ్చినంతగా తమన్నా క్యారెక్టర్ లేదు. అతకని తెలంగాణ స్లాంగ్, ఓ బూతు మాటతో ఏదో నెట్టుకొచ్చింది. రావు రమేష్ కి హంగామా ఎక్కువ చేశారు కానీ గంటయ్యాక మళ్ళీ కనిపిస్తే ఒట్టు. పూర్తిగా పక్కకు తప్పించేశారు.

సెకండ్ హీరోయిన్ దిగంగనా సూర్యవంశీ లుక్స్ పరంగా బాగుంది. ఇక జీవితంలో మళ్ళీ ఇలాంటి ఆఫర్ రాదనుకున్నాడో ఏమో కానీ విలన్ గా చేసిన అరోరా పావలాకు రూపాయి అవుట్ ఫుట్ ఇచ్చేశాడు. పైగా తెలుగు అవసరం లేకుండా ఎక్కువ హిందీ డైలాగులు పెట్టేసరికి ఇంకాస్త రెచ్చిపోయాడు. భూమికది ఎక్స్ ప్రెషన్లు అవసరం లేని పాత్ర. కబడ్డీ టీమ్ కు సెట్ చేసుకున్న అమ్మాయిల సెలక్షన్ బాగుంది. ఒకరిద్దరు యాక్టింగ్ తోనూ ఆకట్టుకున్నారు. రెహమాన్, పోసాని, నాగమహేష్, అన్నపూర్ణ, ప్రగతి వీళ్ళు కాకుండా ఇంకా చిన్న పాత్రల్లో ఇతర ఆర్టిస్టులు చాలానే ఉన్నారు కానీ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకునే స్థాయి కాదు

డైరెక్టర్ అండ్ టీమ్

స్పోర్ట్స్ డ్రామాలో ఎమోషన్లు తప్ప కమర్షియల్ ఎలిమెంట్స్ కు చోటు ఉండదు. మాస్ మసాలా సినిమాల్లో క్రీడలను జొప్పించడం చాలా కష్టం. ఏదో విజయ్ లాంటి పెద్ద స్టార్ హీరో ఇమేజ్ పుణ్యమాని బిగిల్ తో అట్లీ గట్టెక్కాడు కానీ సంపత్ నంది కూడా అలాంటి సాహసానికి సిద్ధపడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. గోపీచంద్ కు గత కొన్నేళ్లుగా మొనాటనీగా మారిపోయిన మాస్ సబ్జెక్టులకు దూరంగా ఏదో కొత్తగా ప్రయత్నించాలని ఈ కబడ్డీ కోచ్ అవతారం ఎత్తించారు కానీ ఒకదశ దాటాక దీని కథనం కూడా అదే పాత రూట్ లోకి వెళ్లడం విచారకరం. గిరిగీసుకుని రాసుకునే ఇలాంటి ఫార్ములాలు ఇప్పుడు వర్కౌట్ కావని ఇంకా యూత్ లోనే ఉన్న సంపత్ గుర్తించకపోవడం వింతే.

సీటిమార్ లైన్ పరంగా చూసుకుంటే మంచి పాయింట్. కానీ దాన్ని ట్రీట్మెంట్ లో మార్చేసరికి సరైన దశదిశ లేకుండా సాగిపోయింది. ఉదాహరణకు కబడ్డీ టీమ్ అమ్మాయిలను విలన్ కిడ్నాప్ చేస్తాడు. తనను వాడు అనుక్షణం గమనిస్తూ ఉన్నాడని తెలిసి కూడా హీరో చాలా సిల్లీ మిస్టేక్స్ చేస్తాడు. ఇది చాలదన్నట్టు వాడు ఫోన్ చేసిన ప్రతిసారి టెన్షన్ పడుతూ భయపడతాడే తప్ప ఏం చేయాలని ఆలోచించడు. ఆఖరికి పోసాని పెద్ద క్లాసు తీసుకుని అందరి ముందు కార్తీ గొప్పదనం చెబితే కర్తవ్యం గుర్తుకు రాదు. ఇదంతా మరీ ఓవర్ సినిమాటిక్ అయిపోయింది. థ్రిల్ చేసేలా గోపీచంద్ ఏమైనా చేస్తాడేమో అని ఎదురు చూసే కొద్దీ నిరాశే మిగులుతుంది.

ఇలాంటి సినిమాల్లో లాజిక్స్ ఉండవు నిజమే. అలా అని వాటిని పూర్తిగా గాలికి వదిలేయడం కూడా సబబు కాదు. బోయపాటి శీను, సంపత్ నంది ఇద్దరూ ఇలాంటి పొరపాట్లు చేసే గతంలో మూల్యం చెల్లించుకున్నారు. ఇందులోనూ కొంత అదే తరహా డ్యామేజ్ జరిగింది. క్లైమాక్స్ లో అమ్మాయిలు చివర్లో గెలుస్తారని మనం ఈజీగా గెస్ చేసే అవకాశం ఉన్నప్పుడు దానికి ముందు కథనం పరుగులు పెట్టాలి. కానీ ఎక్కడిక్కడ ప్రతిదీ ఆడియన్స్ ఊహించినట్టు జరిగిపోతూ ఉండటం సీటిమార్ లోని ప్రధాన మైనస్. ఎక్కడా కూడా థ్రిల్ చేసేలాగానో అరె ఇది భలే తీశారో అనిపించేలా ఏ సన్నివేశం సాగదు. అక్కడక్కడా కొన్ని ఈల వేసే మూమెంట్స్ ఉన్నాయి.

ఇదంతా ఒక కోణమైతే సంపత్ నంది క్లియర్ గా పెట్టుకున్న మాస్ టార్గెట్ ఓ సగం దాకా చేరుకున్నాడని చెప్పొచ్చు. ఇంకాస్త మెరుగ్గా రాసుకుని హీరో విలన్ మధ్య కాంఫ్లిక్ట్ ని ధృవ స్టైల్ లోనో లేదా లెజెండ్ తరహాలో డిజైన్ చేసుకుని ఉంటే ఇది ఖచ్చితంగా ఫుల్ మీల్స్ క్యాటగిరిలోకి వచ్చేది. కాసేపు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో సీరియస్ గా, కాసేపు ఊర మాస్ రౌడీ సెటప్ తో రకరకాలుగా సాగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఓ ముద్ద బిర్యాని తిని పెరుగన్నం టేస్ట్ చేసి మళ్ళీ పులిహోర తింటే ఎలా ఉంటుందో సీటిమార్ అచ్చం అలాగే సాగుతుంది. రుచులు మారినా పర్లేదు మా ఆకలి తీరుతుంది కదా అనుకునే రెగ్యులర్ ఆడియన్స్ కి సీటిమార్ తో సమస్య ఉండకపోవచ్చు

మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గట్టిగానే ఇచ్చారు. ఆయన ఒకప్పటి స్థాయని చెప్పలేం కానీ మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లో చూస్తే సన్నివేశాలు ఎలివేట్ అవ్వడానికి ఇది ఎంత ఉపయోగపడిందో అర్థమవుతుంది. పాటలు యావరేజ్. రెండు మసాలా పాటలు ఓకే అనిపిస్తాయి. సౌందర్ రాజన్ ఛాయాగ్రహణం మంచి స్టాండర్డ్ లో సాగింది. యాక్షన్ సీన్స్ ని ఆట సన్నివేశాలను బాగా చూపించారు. తమ్మిరాజుఎడిటింగ్ మీద ఫిర్యాదు చేయడానికి పెద్దగా లేకపోయింది. పాటలు మార్కెట్ కోసం ఇరికించారు కాబట్టి తనను అనడానికి లేదు. శ్రీనివాస చిట్టూరి నిర్మాణం రిచ్ గా సాగింది. బడ్జెట్ ఎక్కువగానే కేటాయించారు.

ప్లస్ గా అనిపించేవి

గోపీచంద్
యాక్షన్ ఎపిసోడ్స్
ఛాయాగ్రహణం
క్యాస్టింగ్

మైనస్ గా తోచేవి

రొటీన్ మాస్ స్టోరీ
అతకని ఎమోషన్లు
సాగతీత స్క్రీన్ ప్లే
విలన్ ట్రాక్

కంక్లూజన్

మాస్ సినిమా అంటే తెరనిండా తారాగణం, ఓ మూడు ఫైట్లు, హీరో విలన్ మధ్య రెండు ఛాలెంజులు, డ్యూయెట్, మాస్ సాంగ్ అని గిరిగీసుకుని రాసుకున్న ఫార్ములాలో స్పోర్ట్స్ డ్రామాని ఇరికించిన ప్రయత్నమే సీటిమార్. కమర్షియల్ కథలు మరీ ప్రయోగాత్మకంగా ఉండాల్సిన అవసరం లేదు కానీ ఎవరి కోసం తీశామో వాళ్లకు గూస్ బంప్స్ అనిపించేలా సాగాలి. ఈ కోణంలో చూసుకుంటే సీటిమార్ అంచనాలకు తగ్గట్టు లేదు. థియేటర్ కు వెళ్లి కంటెంట్ ఎలా ఉన్నా పైన చెప్పిన అంశాలు ఉంటే చాలు ఇంకేమి అక్కర్లేదు అనుకుంటే ఓ లుక్ వేయొచ్చు. అలా కాకుండా రణం, యజ్ఞం రేంజ్ లో ఎక్కువ ఊహించుకుంటే మాత్రం దెబ్బే

ఒక్క మాటలో : ఓవర్ మాస్ కబడ్డీ కూత

Also Read: టక్ జగదీష్ రివ్యూ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp