బంగారంతో భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది. పసిడి అంటే మనకు కేవలం ఆభరణం మాత్రమే కాదు.. లక్ష్మి దేవి స్వరూపంగా భావిస్తాం. ఎంత బంగారం ఉంటే.. అంత ఐశ్వర్యవంతులు అన్నట్లు చూస్తారు. ఇక మన దగ్గర ఉన్న బంగారం కేవలం ఆభరణంగా మాత్రమే కాక.. అవసరాలకు ఆదుకునే ఆదాయ వనరుగా కూడా పనికి వస్తుంది. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా సరే.. బంగారం ఉంటే చాలు అని భావిస్తారు. అందుకే భారతీయులు.. మరీ ముఖ్యంగా మహిళలు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. సందర్భం దొరికిన ప్రతి సారి.. ఎంతో కొంత బంగారం కొంటారు. ఇక పండుగలు, వివాహాది శుభకార్యాల వేళ.. భారీ ఎత్తున బంగారం కొంటారు. ద్రవ్యోల్భణం, ఆర్థిక మాంద్యం వంటి కారణాలను దృష్టిలో పెట్టుకుని చాలా మంది బంగారం మీద పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.
మరి మీలో ఎవరైనా బంగారం మీద పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారా.. అయితే ఓ మూడు రోజులు ఆగితే.. తర్వాత మీకు బంగారం మీద భారీ తగ్గింపు లభిస్తుంది అంటున్నారు బులియన్ మార్కెట్ విశ్లేషకులు. బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు జూన్ 19 వరకు ఆగండి అంటున్నారు. మరో 72 గంటలు ఆగితే.. మీరు నేరుగా ప్రభుత్వం నుంచి బంగారాన్ని కొనుగోలు చేయవచ్చని.. అది కూడా మార్కెట్ ధర కంటే చాలా తక్కువకే పసిడి కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు.ఘిది ఎలా సాధ్యం అంటే.. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ద్వారా. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023-24 కోసం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. దాని మొదటి విడతలో పెట్టుబడి పెట్టే అవకాశం మరో మూడు రోజుల్లో రానుంది.
ఆర్బీఐ తెలిపిన దాని ప్రకారం.. మొదటి విడత సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ కొనుగోలు జూన్ 19-23 వరకు అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత రెండవ విడత సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ కొనుగోళ్లు ఈ సంవత్సరం సెప్టెంబర్ 11 నుంచి 15 వరకు అందుబాటులోకి వస్తుంది. ఈ గోల్డ్ బాండ్ల ద్వారా మీరు మార్కెట్ కంటే తక్కువ ధరకే బంగారంపై పెట్టుబడి పెట్టడానికి అవకాశం లభిస్తుంది. అంతేకాక ఈ గోల్డ్ బాండ్ స్కీమ్ మీద వచ్చే రాబడి కూడా అధికంగానే ఉంటుంది అంటున్నారు బులియన్ మార్కెట్ విశ్లేషకులు. మరి ఈ గోల్డ్ బాండ్లలో ఎవరు.. ఎంత మేర పెట్టుబడి పెట్టవచ్చు.. వీటిని ఎక్కడ కొనుగోలు చేయాలి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
సావరిన్ గోల్డ్ బాండ్లను ఆర్బీఐ జారీ చేస్తుంది. మార్కెట్ విలువ ఆధారంగా దీని ధర నిర్ణయిస్తారు. దీన్ని బాండ్ జారీ చేయడానికి కొన్ని రోజుల ముందు ఆర్బీఐ ప్రకటిస్తుంది. ఆన్‌లైన్ ద్వారా ఈ బాండ్లను కొనుగోలు చేస్తే.. మీకు మరింత లాభం చేకూరుతుంది. మీరు కనక డిజిటల్ మార్గాల ద్వారా బంగారు బాండ్లను కొనుగోలు చేస్తే.. మీకు గ్రాము మీద అదనంగా రూ.50 తగ్గింపు లభిస్తుంది. అంటే మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు.
ఎవరైన ఒకరు లేదా హిందూ అవిభాజ్య కుటుంబానికి చెందిన వారు ఎవరైనా సరే.. అత్యధికంగా 4 కిలోల విలువ వరకు బంగారు బాండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. ట్రస్ట్‌లు, ఇతర సంస్థలు 20 కిలోల విలువకు సమానమైన బంగారు బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఈ పెట్టుబడి పరిమితి మొత్తం ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది. ఇక ఈ సావరిన్ బంగారు బాండ్లను.. బ్యాంకులు, పోస్టాఫీసులు, పేమెంట్ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, స్టాక్ ఎక్స్ఛేంజీలు మొదలైన వాటి నుంచి కొనుగోలు చేయవచ్చు.
సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టడం చాలా లాభం కలుగుతుంది అంటున్నారు బులియన్ మార్కెట్ విశ్లేషకులు. ఈ గోల్డ్ బాండ్లు 5 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి, 8 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్‌ను కలిగి ఉంటాయి. అంటే 5 సంవత్సరాల తర్వాత మీరు ఈ బాండ్‌ను రీడీమ్ చేసుకోవచ్చు. రెండవది, మెచ్యూరిటీ తర్వాత,.. ఈ బాండ్ అప్పుడు ఉన్న మార్కెట్ విలువ ప్రకారం బంగారం రేటును బట్టి రాబడి లభిస్తుంది. అలాగే ఈ బాండ్ల మీద ప్రతి ఏడాది విడిగా 2.5 శాతం వడ్డీ కూడా లభిస్తుంది.