అలా.. ఇలా.. సోము ద్విముఖ వ్యూహం!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు యాక్ష‌న్ ఆఫ్ రాజ‌కీయాలు కొత్త పుంత‌లు తొక్కు‌తున్న‌ట్లు క‌నిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే భారీ వ‌ల‌స‌లు ఉంటాయ‌ని ప్ర‌క‌టించిన సోము ఆ దిశ‌గా అడుగులు వేస్తూనే.. ప్ర‌స్తుతానికి జిల్లాల వారీగా భార‌తీయ జ‌న‌తా పార్టీని ఉన్న నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తోనే బ‌లోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. టీడీపీ నుంచి వ‌చ్చిన వారితో.. ప్ర‌స్తుతం ఉన్న వారికి మ‌ధ్య ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఉండేందుకు ఇప్పటి నుంచే వ్యూహ ర‌చ‌న చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పుడు వ‌ల‌స‌లు ప్రారంభమైతే టీడీపీ తాజా, మాజీలే బీజేపీలోకి వ‌స్తారు. ప్ర‌జ‌ల్లో బ‌లంగా పాతుకుపోతున్న అధికార పార్టీ అయిన వైసీపీ ని వీడేందుకు ఎవ‌రూ ముందుకు రార‌న‌డంలో సందేహం లేదు. ఇక టీడీపీ నేత‌లే దిక్కు. మ‌ళ్లీ భారీ స్థాయిలో తెలుగుదేశానికి చెందిన వారు బీజేపీలోకి చేరితే క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ హ‌యాంలో జ‌రిగిన తోక పార్టీ అన్న ప్ర‌చారం మ‌ళ్లీ జ‌రిగే అవ‌కాశం ఉంటుంద‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్న‌ట్లు స‌మాచారం.

సోము దృష్టి అంతా ఇప్పుడు దీనిపైనే….

ప్ర‌స్తుతానికి జిల్లాల వారీగా భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎక్క‌డ బ‌లంగా ఉంది..? ఎక్క‌డ బ‌ల‌హీనంగా ఉంది..? అనే దానిపై సోము ఆరా తీస్తున్నారు. అలాగే ముందుగా అసలు పార్టీని నమ్ముకుని వున్నది ఎవరు? ఏయే జిల్లాల్లో ఎక్కడెక్కడ పార్టీ ఉనికి చెప్పుకోదగ్గదిగా వుంది. ఎక్కడ లేదు? ఎక్కడ నాయకులు అవసరం? ఎక్కడ అక్కరలేదు? ఇలాంటివి అన్నీ అంశాల‌పైనా విశ్లేషిస్తున్నారు. ముందుగా ప్రాంతాల వారీగా పార్టీలో ఉన్న లోటుపాట్ల‌ను స‌రిదిద్ది ఆ త‌ర్వాతే స్థానికంగా ఉన్న టీడీపీ నేత‌ల‌పై దృష్టి పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు పెద్దఎత్తున టీడీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారని ఆదివారం విశాఖ‌లో జ‌రిగిన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కేతినేని సురేంద్రమోహన్‌ పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా సోము చెప్పారు. అప్ప‌టి వ‌ర‌కూ వేచి చూడ‌కుండా ప్రస్తుతం వున్నవారితో పార్టీని కార్యోన్ముఖంగా నడిపించడం, ఆ పైన పార్టీకి ఎవరు, ఎక్కడ అవసరం అనేదానిపై దృష్టి పెట్టి, అక్కడ వలసలను స్వాగతించడం అనే ద్విముఖ వ్యూహాన్ని సోము వీర్రాజు అనుసరిస్తున్నారని తెలుస్తోంది.

Show comments