iDreamPost
android-app
ios-app

ఏపీలోనూ మేమే నెంబర్ టూ..!

ఏపీలోనూ మేమే నెంబర్ టూ..!

వరుస విజయాలతో తెలంగాణలో దూసుకుపోతున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ లోనూ పట్టుబిగించేందుకు ప్రయత్నిస్తోంది. గ్రేటర్ లో అనూహ్య విజయం సొంతం కావడంతో బీజేపీ శ్రేణల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. బల్దియాలో బీజేపీని రెండో స్థానానికి చేర్చిన తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అభినందనలు తెలియజేశారు. తెలంగాణలో కొత్త అధ్యాయం మొదలైందన్న ఆయన, కుటుంబ పాలనకు అంతం కూడా ఆరంభమైందన్నారు. పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ లోనూ కమలం వికసిస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు.

తెలంగాణ తరహా విజయాలను త్వరలోనే ఏపీలోనూ సొంతం చేసుకుంటామని సోము వీర్రాజు ప్రకటించారు. జనసేనతో కలిసి అధికారం చేపడతామనే విశ్వాసాన్ని ప్రకటించారు. తెలుగుదేశం హయాంలో కోట్ల రూపాయాల అవినీతి జరిగిందన్న ఆయన, కేంద్రం నుంచి 7,200 కోట్లు తీసుకుని తాత్కాలిక భవనాలు నిర్మించాడని విమర్శించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు గల్లంతవుతాయని, జనసేన, బీజేపీల కూటమే అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా మారుతుందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తామే పోటీ అని ప్రకటించుకున్నారు.

గ్రేటర్ ఫలితాల తరువాత తెలంగాణ బీజేపీ బలం పుంజుకున్న మాట నిజమే. కానీ… ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి అనుకూల వాతావరణం కనిపించడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ నిస్తేజంగా ఉండడం, టీడీపీ క్రమంగా బలహీన పడుతుండడంతో ఆ గ్యాప్ ని బీజేపీ భర్తీ చేయాలనుకుంటోంది. అందుకోసం… తెలంగాణను అనుకరించే ప్రయత్నం చేయవచ్చు కూడా. త్వరలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నికలో సత్తా చాటుకునేందుకు ప్రయత్నించవచ్చు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు సాధ్యమైతే వాటిలోనూ బలాన్ని నిరూపించుకోవచ్చనే ఆలోచనలో బీజేపీ ఉంది. కాంగ్రెస్, టీడీపీ పార్టీల వైఫల్యాలు తమకు కలిసొస్తాయని ఏపీ బీజేపీ భావిస్తోంది.

ఏపీలో బీజేపీ ఒంటరిగా పోరాడే పరిస్థితి లేదు. అందుకోసం జనసేన మద్దతు అవసరమని భావిస్తోంది. కానీ.. బీజేపీ ఊహించినంత సులభంగా అధికార పార్టీని తలపడలేకపోవచ్చు. జనసేన పార్టీ గత ఎన్నికల్లో సాధించిన ఫలితాలే అందుకు నిదర్శనం. సోము వీర్రాజు అంటున్నట్లు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలంటే ముందు ఏపీలో బీజేపీ బలపడాలి. బీజేపీని ఆ దిశలో నడిపించే నాయకత్వం రాష్ట్రంలో కనిపించడం లేదు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ లోనూ సత్తా చాటాలనుకుంటున్న బీజేపీ ఇప్పటినుంచే వ్యూహరచన చేస్తున్నట్లు అర్థమవుతోంది. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు రేపొద్దున మళ్లీ టీడీపీ స్నేహ హస్తాన్ని కోరినా ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదు.