iDreamPost
iDreamPost
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చిలక పలుకులు పలుకుతున్నారు. నిజాలను బయటికి చెప్పలేక, రాజకీయంగా ఎదుర్కోలేక పస లేని విమర్శలు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నింటిలోనూ అసమర్థుడంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రజలను స్వేచ్ఛగా ఓట్లు వేయనీయకుండా వాలంటీర్లను ఉపయోగించుకుని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.అంతేకాదు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను రాజకీయంగా వైసీపీ నేతలు ఎదుర్కోలేకపోతున్నారని కామెడీ కామెంట్లు చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీకి ప్రజలు బుద్ధి చెబుతారని, బీజేపీ, జనసేన కూటమిని చూసి వైసీపీ నాయకులు భయపడుతున్నారని, తమకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి వైసీపీ నేతలకు నిద్రపట్టట్లేదని.. ఇంకా ఏవేవో చెప్పుకొచ్చారు.
నిజంగా అంత సీనుందా?
ఏపీలో ప్రజలు ఎవరి వైపు ఉన్నారో 2019 ఎన్నికల్లోనే స్పష్టంగా రుజువైంది. కనీసం ఖాతా తెరవని పార్టీ ఏదో కూడా జనాలకు తెలుసు. నమ్మించి మోసం చేసినది ఎవరూ ఇంకా మరిచిపోలేదు. మొన్నటి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఎవరి ఖలేజా ఎంతో అందరికి తెలిసిపోయింది. అధికార వైఎస్సార్ సీపీకి ఉన్న జన బలం, అభిమానం ఇంకా ఇసుమంతైనా తగ్గలేదని అర్థమైంది. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని అడ్డదారులు తొక్కినా ప్రజా తీర్పు మారలేదు. మరి అలాంటప్పుడు బీజేపీ, జనసేన కూటమికి అంత సీనుందా అని వైసీపీ నేతలే కాదు సాధారణ జనం కూడా ప్రశ్నిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో ఓటర్లు ఎవరికి బుద్ధి చెబుతారో కూడా అందరికీ తెలుసని, ఏపీలో 2019 నుంచి వస్తున్న ఫలితాలే మరోసారి రిపీట్ అవుతాయని అంటున్నారు.
Also Read : ఆశయాల దారుల్లో నడిచి..అందరికీ ఆదర్శంగా నిలిచిన కుంజాబొజ్జి
ఈ ప్రశ్నలకు బదులుందా?
– అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్ ను విభజించి కాంగ్రెస్ ద్రోహం చేస్తే.. ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసింది. ఇది నిజం కాదా? సోకాల్డ్ రాష్ట్ర బీజేపీ నేతలు ప్రత్యేక హోదా విషయంలో ఏం చేశారు. కనీసం తమ పార్టీ పెద్దల దగ్గర ఈ విషయం లేవనెత్తారా? పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామన్న వాళ్లు, ఏపీకి ఎందుకు ఇవ్వరు? కేంద్రంలో తమ పార్టీనే అధికారంలో ఉన్నా.. ప్రత్యేక హోదా తీసుకురాలేదు. కనీసం ఆ ప్రస్తావన తెచ్చేందుకు కూడా భయపడుతున్నారు. మరి అసమర్థులు ఎవరు?
– ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ అన్న దశాబ్దాల నాటి నినాదం మరోసారి వినిపించడానికి కారణం ఎవరు? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తుంటే ఎందుకు అడ్డుకోలేదు. కనీసం హైకమాండ్ ను ఎందుకు ప్రశ్నించలేదు. మరి అసమర్థులు ఎవరు?
– 2019లో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 4 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశారు వైఎస్ జగన్. మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ ఏడేళ్లలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసింది. ఏడాదికి కోటి ఉద్యోగాల సంగతేంది? ప్రతి ఒక్కరి అకౌంట్లలో 15 లక్షలు పడ్డాయా? నల్లధనం వెలికి తీశారా? మరి అసమర్థులు ఎవరు?
– 2014 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగారు జగన్. అధికారం దక్కించుకోకున్నా ప్రజల మనసులు గెలిచారు. కానీ మీరు కూటమి కట్టి, ధన బలంతో గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ ఒంటరిగానే బరిలోకి దిగి.. 151 సీట్లు గెలిచారు జగన్. మరి మీరు గెలిచిన సీట్లు ఎన్ని? మీతో జట్టు కట్టిన జనసేన సాధించిన సీట్లు ఎన్ని? అధికారంలో ఉండి అడ్డగోలు పాలన సాగించిన టీడీపీ సాధించిన ఓట్లు, సీట్లు ఎన్ని? మరి అసమర్థులు ఎవరు?
– కరోనా కేసులు పెరుగుతుండటంతో తన తిరుపతి సభను రద్దు చేసుకున్నారు జగన్. గెలుపోటముల కన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యమని భావించారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో మీ బీజేపీ నేతలు ఎక్కడైనా సభలు ఇలా రద్దు చేసుకున్నారా? ‘రెండు గజాల దూరం పాటించండి’ అని ప్రజలకు చెబుతున్న ప్రధాని మోడీ.. వేలాది మంది హాజరయ్యే సభలకు వెళ్లి ప్రసంగిస్తున్నారు. మొన్న పవన్ కల్యాణ్ తో కలిసి రాష్ట్ర బీజేపీ నేతలు వేలాది మందితో సభ నిర్వహించారు. మరి ప్రజల గురించి ఆలోచించే పాలకుడు ఎవరు? అసమర్థులు ఎవరు?
– అసలైన అసమర్థులు ఎవరు? పాలకుడు ఎవరు? అనేది మే 2న తేలుతుంది సోముజీ. కాకపోతే కొంచెం టైం పడుతుంది. వెయిట్ అండ సీ!!
Also Read : జేడీ లక్ష్మీనారాయణ.. బ్యాక్ టూ పెవిలియన్