iDreamPost
iDreamPost
డార్లింగ్ ప్రభాస్ కోరుకున్నా కోరుకోకపోయినా బాహుబలి నుంచి ప్రతి సినిమాకు రెండేళ్లకు పైగా గ్యాప్ తప్పనిసరి అయిపోయింది. సాహో తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందే మూవీనైనా త్వరగా తీసుకొద్దాం అనుకుంటే కరోనా రూపంలో మరో పెద్ద బ్రేక్ పడిపోయింది. నిర్మాణ సంస్థ యువి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వకుండా మౌనంగా ఉండటం అభిమానులను బాగా హర్ట్ చేస్తోంది. నిన్నగాక మొన్న మొదలైన బాలకృష్ణ సినిమాకే వీడియో టీజర్ వదిలినప్పుడు ఏడాది నుంచి ప్రొడక్షన్ లో మా హీరో చిత్రానికి కనీసం ఫస్ట్ లుక్ అయినా ఇవ్వలేరా అని చేస్తున్న వాళ్ళ డిమాండ్ లో లాజిక్ ఉంది.
దీని సంగతలా ఉంచితే తాజాగా టైటిల్ లాక్ చేసినట్టుగా ఇన్ సైడ్ టాక్. ‘రాధే శ్యామ్’ని త్వరలో ప్రకటిస్తారట. ఇది ముందే లీకైపోయి ప్రచారంలో ఉన్నదే. దీంతో పాటు ‘జాన్’ అనే పేరు కూడా బలంగా వినిపించింది. కానీ దిల్ రాజు 96 రీమేక్ కోసం దాన్ని అడగడటంతో ఇచ్చేశారు. ఆయన జాను అని పెట్టుకున్నారు కానీ సౌండ్ ఒకలాగే అనిపిస్తుంది. ఇక రాధేశ్యామ్ కు ఫిక్స్ అవ్వడమే బెటరని నిర్ణయించున్నట్టు తెలిసింది. మరికొద్ది రోజుల్లో టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఈ టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. యూరోప్ బాక్ డ్రాప్ లో పీరియాడిక్ లవ్ స్టొరీగా రూపొందుతున్న ఈ సినిమాకు కృష్ణంరాజు గారి గోపికృష్ణ బ్యానర్ కూడా భాగస్వామిగా ఉంది.
బడ్జెట్ 200 కోట్లకు పైగా కేటాయించారని టాక్. అయితే కరోనా వల్ల అర్ధాంతరంగా ఆగిపోయిన ఫారిన్ షెడ్యూల్ ని ఇక్కడే హైదరాబాద్ లో పూర్తి చేస్తారా లేక అంతర్జాతీయ విమాన సర్వీసులు మొదలయ్యాక అక్కడే ప్లాన్ చేస్తారా తెలియాల్సి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా భారీగా ఉంటుంది కాబట్టి 2021 సంక్రాంతికి విడుదల చేయడం అనుమానమే. ఒకవేళ ఆర్ఆర్ఆర్ కనక సమ్మర్ కు వెళ్ళిపోతే రాధేశ్యామ్ కు వేసవిలో తీవ్రపోటీ తప్పదు. రెండూ పాన్ ఇండియా లెవెల్ సినిమాలే కాబట్టి అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ లో ఒకప్పటి హోమ్లీ అండ్ క్రేజీ హీరోయిన్ భాగ్యశ్రీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది కాని ఇప్పటిదాకా దీనికి సంగీతం అందించేదెవరో మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోవడం అన్నింటికంటే పెద్ద ట్విస్ట్.