iDreamPost
iDreamPost
సమస్య రావడమే తడువుగా దానిని ప్రచారానికి వినియోగించుకునే చంద్రబాబు స్టైల్ కి భిన్నంగా అత్యంత నిబ్బరంగా దానిని ఎదుర్కోవడంలో వైఎస్ జగన్ తీరు ఫలితాన్నిస్తోంది. ప్రతీ అంశాన్ని ప్రచారానికి అనువుగా మలుచుకుని, తాను పాలనాదక్షుడు అనిపించుకునే తపనలో ఉండే చంద్రబాబు తీరుకి పూర్తి విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారు. అందుకు ఏలూరు ఉదాహరణ మరోసారి చాటిచెప్పింది. ఒక్కసారిగా పలువురు అనుకోని సమస్య బారిన పడుతుండడంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమయ్యింది. అవసరమైన చర్యలు చేపట్టింది. పరీక్షల కోసం కేంద్ర బృందాల సహాయం తీసుకుంది. జాతీయ అంతర్జాతీయ సంస్థల దృష్టి పడడంతో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసింది.
అదే సమయంలో ఏలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆళ్ల నాని సారధ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ బృందాలు వేగవంతంగా కదిలాయి. పలువురు అధికారులు ఏలూరులో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని సీఎం స్వయంగా సమన్వయం చేశారు. తాను కూడారెండో రోజే నేరుగా ఆస్పత్రికి వెళ్లి అక్కడ బాధితులతో ఎక్కువ సేపు గడిపారు. సుమారుగా 20 మంది బాధితులు వారిలో చిన్నారులను కూడా ప్రేమ పూర్వకంగా కలిశారు. వారితో మాట కలిపారు. మనస్ఫూర్తిగా వారిలో మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. వారికి తానున్నాననే భరోసా కల్పించడంలో సీఎం ప్రయత్నం అందరి అభిమానానికి కారణమయ్యింది. ఆతర్వాత అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమస్యకు పూర్తి కారణాలు వెలికితీయాలని, అవసరమైనంత వరకూ డిశ్చార్జ్ అయిన వారి మీద కూడా పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.
ఆ తర్వాత కూడా ఎయిమ్స్, సీసీఎంబీ, ఎన్ఐఎన్ సహా వివిధ ఆరోగ్య, వైద్య నిపుణుల బృందాలతో సమన్వయం కోసం పలు సమావేశాలు నిర్వహించారు. వివిధ పరీక్షల వివరాలు తెలుసుకుంటూ వాటిని మరింత లోతుల్లో విశ్లేషణ చేసేందుకు ప్రయత్నించాలని సీఎం సూచించారు. తద్వారా ఏలూరులో వచ్చిన సమస్యకు మూలాలు కనుగోని, పరిష్కారాలు వెదికే ప్రయత్నం చురుగ్గా చేశారు. ఇలా ఓవైపు క్షేత్రస్థాయిలో డిప్యూటీ సీఎం, కేంద్ర, రాష్ట్ర అధికారులను సమన్వయం చేస్తూ ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నాలన్నీ ఫలించి చివరకు ప్రస్తుతం ఏలూరు సాధారణ స్థితికి వస్తోంది. గడిచిన 36 గంటల్లో కేవలం 20 లోపు మాత్రమే కొత్త కేసులు రావడంతో అంతా సర్థుకుంటుందని కేంద్ర, రాష్ట్ర బృందాలు చెబుతున్నాయి.
కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిరాజేష్ భూషణ్, ఉమ్మడి కార్యదర్శి లవ్ అగర్వాల్, ఇతర అధికారులు కూడా దానిని ధృవీకరించారు. ప్రస్తుతం ఏలూరులో పరిస్థితి గురించి తమ ప్రాథమిక నివేదిక అందిందని, తుది నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని వారు తెలిపారు. ప్రస్తుతం ఏలూరులో కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించిందని, 11వ తేదీన రెండు కేసులు మాత్రమే నమోదైన విషయాన్ని ఆరోగ్య శాఖ కార్యదర్శి ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు విపక్ష టీడీపీ, వారి అనుంగు పచ్చ మీడియా రాతలతో భయాందోళనలు పెంచే ప్రయత్నంచేస్తున్నా పరిస్థితి దానికి భిన్నంగా ఉన్నట్టు కేంద్ర నివేదికలు కూడా చెబుతున్న తీరు గమనార్హం.