Sitaramaraju : పగలు ప్రతీకారాల మాస్ మల్టీస్టారర్ – Nostalgia

రెండు పెద్ద సినిమా కుటుంబాల హీరోలు కలిసి నటించడం టాలీవుడ్ లో అరుదు. అందుకే ఆర్ఆర్ఆర్ మీద జనంలో అంత ఆసక్తి. రాజమౌళి తీస్తున్న గ్రాండియర్ అనే దానికన్నా అసలు చూడగలమాని ఆలోచించిన కొణిదెల నందమూరి కాంబినేషన్ సాధ్యమయ్యింది కాబట్టే అభిమానుల్లో అంత చర్చ జరిగింది. ఒకప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లు తమకు ఎంత కోట్లాది ఫాలోయింగ్ ఉన్నా ఎన్ని అంచనాలు మోస్తున్నా బ్లాక్ అండ్ వైట్ నుండి కలర్ జమానా దాకా 14 సినిమాల్లో కలిసి నటించడం ఎప్పటికీ చెదిరిపోలేని గొప్ప రికార్డు. చిరంజీవి బాలకృష్ణల తరం మొదలయ్యాక ఇలాంటి కలయికలు కేవలం కలలకే పరిమితమయ్యాయి. ఈ స్థాయిలో కాదు కానీ అలాంటి కాంబోకి మళ్ళీ శ్రీకారం చుట్టేలా చేసిన ఘనత దర్శకుడు వైవిఎస్ చౌదరికి దక్కుతుంది. ఆ విశేషాలు చూద్దాం

1998. శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి లాంటి చిన్న బడ్జెట్ సినిమాతో కొత్త ఆర్టిస్టులను పరిచయం చేసి నిర్మాతగా తనకు పెద్ద హిట్ ఇచ్చిన వైవిఎస్ చౌదరి మీద నాగార్జునకు మంచి గురి కుదిరింది. రెండో సినిమాకు తనతో చేయమని చెప్పారు. అప్పుడు తనదగ్గరున్న సీతారామరాజు కథను వినిపించారు చౌదరి. ఇద్దరు అన్నదమ్ములు, ఊళ్ళో ప్రత్యర్థి వర్గం, పగలు ప్రతీకారాలు ఇలా ఫ్యాక్షన్ టచ్ ఉన్న సబ్జెక్టు చెప్పగానే నాగ్ కు ఎగ్జైటింగ్ గా అనిపించి ఓకే చెప్పేశారు. కాకపోతే పవర్ ఫుల్ గా ఉండే అన్నయ్య పాత్రకు ఆర్టిస్టుగా చౌదరి మనసులో హరికృష్ణ తప్ప ఇంకెవరు లేరు. ఆయనేమో రాజకీయాల్లో పడి దశాబ్దాలుగా నటనకు దూరంగా ఉన్నారు. పరిటాల కథ కాబట్టి శ్రీరాములయ్య చేశారు కానీ అంతకు మించి పెద్ద ఆసక్తి లేదు. అయినా కూడా వెంటపడి ఒప్పించారు చౌదరి.

నిజానికి సీతారామరాజు మెయిన్ పాయింట్ 1993లో వచ్చిన క్షత్రియ పుత్రుడుకు దగ్గరగా ఉంటుంది. అందులో తండ్రికొడుకులు శివాజీ గణేశన్-కమల్ హాసన్ పాత్రలను ఇందులో అన్నదమ్ములు నాగార్జున హరికృష్ణలుగా మార్చారు. రేవతి క్యారెక్టర్ సంఘవికి, గౌతమి రోల్ ని సాక్షి శివానంద్ కి సెట్ చేశారు. ఇలా చాలా పోలికలు ఉంటాయి. రచయిత పోసాని కృష్ణమురళి మన ఆడియన్స్ కి తగ్గట్టుగా కొన్ని కీలక మార్పులు చేశారు. ఎంఎం కీరవాణి ఏడు పాటలతో అదిరిపోయే ఆల్బమ్ సిద్ధం చేశారు. చూసిన కథే అయినా పవర్ ఫుల్ సీన్లతో వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన విధానం మాస్ కు బాగా ఎక్కేసింది. ఫలితంగా 1999 ఫిబ్రవరి 5 విడుదలైన సీతారామరాజు కమర్షియల్ గా మంచి విజయం అందుకుంది. ఇందులో నాగార్జున మొదటిసారి పాట పాడటం విశేషం. అది కూడా సిగరెట్ మీద.

Also Read : Kobbari Bondam : ఆత్మవిశ్వాసమే గొప్పదన్న హాస్య చిత్రం – Nostalgia

Show comments