iDreamPost
android-app
ios-app

టీడీపీ నేత‌ల‌కు కొత్త గుబులు

టీడీపీ నేత‌ల‌కు కొత్త గుబులు

తెలుగుదేశం పార్టీని కుదిపేసేలా మ‌రిన్ని అక్ర‌మాలు వెలుగుచూసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అమ‌రావ‌తిలో జ‌రిగిన ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ వ్య‌వ‌హారంలో చిక్కుకుని విల‌విల‌లాడుతున్న నేత‌ల‌కు తోడు మ‌రి కొంద‌రికి కొత్త చిక్కులు ఎదుర‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున భూ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించాలని జ‌గ‌న్ ప్రభుత్వం ఇది వ‌ర‌కే నిర్ణయించింది. ఈ మేరకు రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి విజయ కుమార్‌ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారిణి వై.వి.అనూరాధ, రిటైర్డ్ జిల్లా సెషన్స్‌ జడ్జి టి.భాస్కర్‌రావులను సభ్యులుగా నియమించింది. ఆ బృందం త‌మ క‌స‌ర‌త్తును పూర్తి చేసిన‌ట్లు తెలుస్తోంది.

సిద్ధ‌మైన నివేదిక..

టీడీపీ హయాంలో రికార్డుల తారుమారు, ఎన్‌వోసీ జారీ, నిషేధిత భూముల్లో అక్రమాలపై పూర్తిస్థాయిలో సిట్ నివేదిక సిద్ధమయ్యింది. దీంతో తెలుగుదేశం పార్టీ నేత‌ల్లో గుబులు మొద‌లైంది. ఇప్ప‌టికే అమ‌రావ‌తి భూ కుంభ‌కోణం ఆ పార్టీ నేత‌ల‌ను కుదిపేస్తోంది. పార్టీ ప్ర‌తిష్ట మ‌స‌క‌బారేలా చేసింది. ఇప్పుడు ఇందులో ఎవ‌రి పేర్లు తెర‌పైకి వ‌స్తాయోన‌న్న చ‌ర్చ పార్టీ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులు/సంస్థలకు ప్రభుత్వ భూముల కేటాయింపు, భూరికార్డులను తారుమారు చేసిన వ్యక్తుల గుర్తింపు, దానివల్ల లబ్ధి పొందిన ప్రభుత్వ అధికారులు, అధికారేతరులెవరో సిట్ ద‌ర్యాప్తులో తేలిన‌ట్లు తెలిసింది.

అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములపై అక్రమార్కులు కన్నేసిన తీరు, ఒక వ్యూహం ప్రకారం వాటిని కబ్జా చేసిన తీరుపై సిట్ అధికారులు నివేదిక త‌యారు చేసిన‌ట్లు తెలుస్తోంది. తమ పార్టీలోని దొంగలే భూ కబ్జాలు చేశారంటూ విశాఖకు చెందిన టీడీపీ నేత‌లు గతంలో ఆరోప‌ణ‌లు చేశారు. ఈ క్ర‌మంలో సిట్ నివేదిక పార్టీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. విశాఖ భూ అక్రమాలపై సిట్ దర్యాప్తు ముగిసింద‌ని చైర్మన్ విజయ్‌కుమార్‌ తెలిపారు. సిట్‌ కార్యాలయానికి కేటాయించిన 19 మంది రెవెన్యూ సిబ్బందిని చైర్మన్ వెనక్కి పంపించారు. వచ్చే వారంలో చివరిరోజు ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని విజయ్‌కుమార్‌ తెలిపారు. గత ప్రభుత్వంలో వందలాది ఎకరాల్లో అక్రమాలు జరిగాయని, అన్ని విషయాలు నివేదికలో స్పష్టంగా పొందుపరుస్తామని ఆయన వెల్లడించారు.