iDreamPost
iDreamPost
తెలుగు సినిమా ప్రస్థానంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని లక్షలాది రచయితలకు గురువుగా మార్గదర్శిగా నిలిచిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు భౌతికంగా సెలవు తీసుకుని నెలలు గడుస్తున్నప్పటికీ ఆయన సరికొత్త సాహిత్యం సంగీత ప్రియులను పలకరిస్తూనే ఉంది. నిజానికి నాని శ్యామ్ సింగ రాయ్ శాస్త్రి గారి చివరి ఆల్బమని అందరూ అనుకున్నారు. అదే నిజం కూడా. వాస్తవానికి కెరీర్ లో ఆఖరిగా విడుదలైన సినిమానే అలా పరిగణనలోకి తీసుకుంటారు. కానీ సిరివెన్నెల కన్నుమూసే సమయానికి అప్పటికే రాసిచ్చిన కొన్ని పాటలు బయట ప్రపంచానికి తెలియలేదు. ఇప్పుడవి ఒక్కొక్కటిగా బయటికి వచ్చి ఆశ్చర్యానందాలను కలిగిస్తున్నాయి
అందులో మొదటిది రంగమార్తాండ. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ మరాఠి బ్లాక్ బస్టర్ నటసామ్రాట్ రీమేక్ పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఇళయరాజా సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో సిరివెన్నెలగారి పాటలు ఎక్కువగా ఉన్నాయి. కాసర్ల శ్యామ్ భాగమయ్యారు కాబట్టి సింగల్ కార్డు కాదు కానీ కీలకమైన గీతాలు శాస్త్రి గారే రాశారు. ఇంకా ఆడియో బయటికి రాలేదు. మ్యూజిక్ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ కాంబోలో వచ్చిన అంతఃపురం స్థాయిలో ఇది కూడా మేజిక్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇక మరో చిత్రం సీతా రామమ్. విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకుడు.
ఈ రెండు శ్యామ్ సింగ రాయ్ కంటే ముందు రాసినవి కాబట్టి ఏది చివరిది అనే కోణంలో చూస్తే సమాధానం చెప్పడం కష్టం. హరిహర వీరమల్లుకు సైతం ఓ గీతం రాయించుకోవాలని క్రిష్ ప్రయత్నించారు కానీ అది సాధ్యపడలేదని తెలిసింది. భార్య కోసం శాస్త్రి గారు ఓ పాట మొదలుపెట్టారు కానీ చరణాలు పూర్తి కాకుండానే సెలవు తీసుకోవడంతో ఆ లోటు ఆవిడతో పాటు కుటుంబానికి అలాగే ఉండిపోనుందని తెలిసింది. సిరివెన్నెల నుంచి శ్యామ్ సింగ రాయ్ దాకా వేలాది పాటలతో సీతారామశాస్త్రి చేసిన ప్రయాణం ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది. సౌండ్ తప్ప సాహిత్యం లేని ప్రస్తుత జెనరేషన్ రైటర్ వాటిని పాఠాలుగా తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది