iDreamPost
iDreamPost
నిండా మునుగుతున్న శివసేన, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి జంట వ్యూహాన్ని అమలు చేస్తోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు వెనక్కి వస్తే కూటమి ప్రభుత్వం MVAని విడిచిపెడతామని ప్రతిపాదించింది. ఒకవేళ తిరుగుబాటు కనుక కొనసాగితే, ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తామని బెదిరిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మీ మాట వింటాం, లేదంటే వేటు వేస్తాం. ఇదీ శివసేన వ్యూహం.
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి ముగింపు ఏంటో క్లియర్ గా తెలిసిపోతూనే ఉంది. శివసేన మాత్రం ఎమోషనల్ ఎండింగ్ కోరుకున్నట్లే కనిపిస్తోంది. ఇప్పుడు థాకరే ప్రభుత్వానికి ఉన్న అప్షన్స్ రెండు. ఒకటి తిరుగుబాటుదారులను లొంగదీసుకుకోవడం. ఇప్పటికే పరిస్థితి చేయిదాటిపోయినట్లే కనిపిస్తోంది. మిగిలిన మరో అప్షన్, అసెంబ్లీని రద్దుచేయడం.
శివసేనకు ఉన్నది 55 మంది ఎమ్మెల్యేలు. అందులో మూడొంతుల మంది తిరుగుబాటుదారులే. అందుకే 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కు శివసేన రెండు పిటిషన్లను పంపింది. ఎన్‌సిపికి చెందిన డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ ఈ పిటిషన్లపై విచారణ చేపట్టాల్సి ఉంది.
గువాహటిలో దాదాపు 40 మంది సేన ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండేతో కలసి తిరుగుబాటుచేయడంతో థాకరే ప్రభుత్వం అల్లల్లాడుతోంది. ఇప్పుడు థాకరే తక్షణ కర్తవ్యం ప్రభత్వాన్ని రక్షించుకోవడం. అందుకే తిరుగుబాటుదారుల విమర్శలకు సమాధానివ్వాలని ప్రయత్నిస్తోంది. కూటమిని విడిచి పెడతామన్నది మొదట ఆఫర్ చేసింది. ఈలోగా శివసేన కార్యర్తలు షిండే మీద కోపంతో రగిలిపోతున్నారు. మూడ్ మారుతోంది. అందుకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామని బెదిరించింది. ఇప్పుడు మొదటి ప్రతిపాదనకు చర్చించాలన్నా తిరుగుబాటు ఎమ్మెల్యేలు మహారాష్ట్రకు రావాల్సిందే. అప్పుడు థాకరేకి ఎడ్వాంటేజ్ రావచ్చునన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.
అదికాదంటే, అన్హతవేటంటే తిరుగుబాటుదారులకు టెన్షన్ తప్పదు. ఈ అసెంబ్లీకి ఇంకా రెండేళ్లకు పైగా పదవికాలముంది. మంత్రులవుదామనో, డబ్బుకోసమో ఎవరైనా తిరుగుబాటుచేస్తారుకాని ఎన్నికల కోసం కాదు కదా !
సోమవారం నాటికి మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక క్లారిటీ రావచ్చు. అప్పటిదాకా బీజేపీ వెయిట్ అండ్ వాచ్.