iDreamPost
iDreamPost
కోవిడ్ 19 విజృంభణ అంతూపొంతూ లేకుండా సాగిపోతోంది. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వాలు దానిని నియంత్రించి, మరణాల సంఖ్యను తగ్గించేందుకు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. తమకు వ్యాధి ఉందని బైటకు వచ్చి చెప్పుకునే వారు కొందరైతే, తమ ఆచూకీ తెలపకుండా సీక్రెట్‌ను పాటిస్తున్నవారు ఇంకొందరున్నారు. మరికిందరికైతే అసలు వ్యాధి లక్షణాలే లేకుండా వచ్చి వెళ్ళిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో జనాభాలో ఎంత శాతం మంది కోవిడ్ 19 భారిన పడి ఉంటారు అన్నది అంచనా వేసేందుకు సీరో సర్వైలెన్స్ కార్యక్రమాన్ని చేపట్టారు. దీని ద్వారా వ్యాధి విస్తరణ, ఉధృతి, ఏ స్థాయిలో ప్రజల్లో యాంటీబాడీలు ఉత్పన్నమయ్యాయి ఇంటి అంశాలను బేరీజు వేసేందుకు అవకాశం ఉంటుందని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వ్యాధి విజృంభణ ఎక్కువగా ఉన్న జిల్లాల్లోనే ఈ సర్వేను చేపడుతున్నారు. అందులో భాగంగా ఏపీలో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న కర్నూలు, గుంటూరు జిల్లాలతోపాటు ఉభయగోదావరి జిల్లాల్లోనూ సర్వైలెన్స్‌కు శ్రీకారం చుట్టారు. కేటగిరీల వారీగా ప్రజల నుంచి రక్తనమూనాలు సేకరించి, వాటిని పరీక్షించడం ద్వారా ప్రజల ఇమ్యూనిటీ, యాంటీబాడీల ఉత్పత్తి తదితర అంశాలను బేరీజు వేస్తారు.
ఇప్పటికే ఢిల్లీ, ముంబై తదితర నగరాల్లో చేసిన సర్వే ఫలితాలు అక్కడి వారిలో ఉధృతమైన అనారోగ్య ఇబ్బందుల్లేకుండానే యాంటీబాడీలు ఉత్పత్తయినట్లుగా తేలింది. మొత్తం అన్ని జిల్లాల్లోనూ ఈ సర్వే చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసారు. ఈ సీరో సర్వే ద్వారా భవిష్యత్తులో అనుసరించాల్సిన వైద్య వ్యూహం గురించి కూడా రోడ్‌మ్యాప్ సిద్ధం చేసుకుంటారు. ఇప్పటి వరకు అందిన అని నివేదికల ప్రకారం రోజుకు పదివేల కేసులతో వైరస్ వ్యాప్తి నిలకడగానే ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఆగష్ణు–సెప్టెంబరుల్లో ఇది తగ్గేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.