మండలిలో మళ్లీ మంటలు, టీడీపీ కి దక్కిన ఫలితం ఏమిటీ

ఏపీ శాసనమండలిలో మళ్లీ మంటలు చెలరేగాయి. ఆరు నెలల తర్వాత కూడా మంటలు చల్లారిన దాఖలాలు కనిపించలేదు. సరికదా ఇప్పడు సమస్య మరింత ముదిరే పరిస్థితి వచ్చింది. టీడీపీ తీరు మారకపోవడం బట్టబయలు అయ్యింది. ఇప్పుడు అసెంబ్లీలో అంతా ప్రశాంతంగా సాగిందని అంతా భావిస్తున్న సభలో మరోసారి పెద్దల సభ చిన్నబోవడం విస్మయకరంగా మారింది. జనవరిలో జరిగిన పరిణామాలు కొనసాగడమే కాకుండా ఈసారి ఏకంగా బడ్జెట్ కి సైతం మోక్షం కలగని స్థితి ఏర్పడడంతో రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు ఎదురుకాబోతున్నట్టు కనిపిస్తోంది.

ఏపీలో పాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను ఎలా అడ్డుకుంటామో చూడండి అంటూ మండలి విపక్ష నేత యనమల రామకృష్ణుడు ముందుగానే ప్రకటించారు. మా వ్యూహాలు మాకున్నాయని ఆయన చెప్పకనే చెప్పారు. దానికి అనుగుణంగానే వ్యవహరించి చివరకు ఆ రెండు బిల్లులతో పాటుగా ద్రవ్య వినిమయ బిల్లును కూడా అడ్డుకున్నారు. వాస్తవానికి ద్రవ్యబిల్లులను అడ్డుకునే హక్కు గానీ, అధికారం గానీ మండలికి లేదు. ఆ విషయం తెలిసి కూడా టీడీపీ ఎందుకు చేసిందన్నది అంతుబట్టకుండా ఉంది. గతంలో మండలి సమావేశాల్లో చేసిన హంగామా ఫలించలేదనే అసహనం ఆపార్టీలో ఉందా అనే అభిప్రాయం వినిపిస్తోంది. 14 రోజుల తర్వాత ద్రవ్యబిల్లులన్నీ మండలి అభిప్రాయంతో సంబంధం లేకుండానే అమలులోకి వస్తాయనే విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.

గత జనవరిలో జరిగిన మండలి సమావేశాల్లో నిబంధనల ప్రకారం లేనప్పటికీ టీడీపీ వాదనను తాను విచక్షణాధికారంతో బలపరుస్తున్నానని మండలి చైర్మన్ షరీఫ్‌ ప్రకటించారు. దాని మీద వాదోపవాదనలు జరిగినప్పటికీ చివరకు మళ్లీ ఇప్పుడు ప్రభుత్వం రెండోసారి అసెంబ్లీలో ఆ రెండు బిల్లులను ఆమోదింపజేసుకోగలిగింది. కానీ మండలికి వచ్చే సరికి మళ్లీ సీన్ వేడెక్కింది. హాట్ హాట్ గా మారింది. ఆఖరికి మండలి చైర్మన్ మరోసారి టీడీపీ వాదనను అంగీకరించడం, దానికి అనుగుణంగా రూల్ 90పై చర్చకు సిద్దం కావడం దానికి కారణం అయ్యింది. ఆ తర్వాత చైర్మన్ స్థానంలో వచ్చిన డిప్యూటీ చైర్మన్ కూడా సంప్రదాయాలను పక్కన పెట్టేశారు. పైగా నేరుగా మండలి నేత పిల్లి సుభాష్‌ చంద్రబోస్ తో వాగ్వాదానికి దిగారు. ఆ క్రమంలో పలుమార్లు సభ వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది.

అయినప్పటికీ రూల్ 90 ప్రకారం చర్చకు టీడీపీ పట్టుబట్టడం, దానిని మండలి చైర్మన్ అంగీకరించడం నిబంధనలకు విరుద్ధమని వైఎస్సార్సీపీ వాదించింది. రూల్ 90ని అంగీకిరంచాలంటే ముందు రోజు నోటీసు ఇవ్వాలని, మండలి నేత కు సమాచారం ఇవ్వాలని అలాంటివి లేకుండా ఎందుకు అంగీకరిస్తారని నిలదీశారు. అయినప్పటికీ ఛెయిర్ లో ఉన్న డిప్యూటీ చైర్మన్ అంగీకిరంచకపోవడం, టీడీపీ నేతలు పట్టుబట్టడంతో 13 బిల్లులకు గానూ కేవలం 9 బిల్లులు మాత్రమే ఆమోదం పొందాయి. చివరకు ద్రవ్య వినిమయ బిల్లుతో పాటుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు బిల్లులపై ఎటువంటి నిర్ణయం లేకుండానే సభను నిరవధికంగా వాయిదా వేశారు. అయితే మండలి చరిత్రలో ఇలాంటి పరిణామాలు అనూహ్యమే కాకుండా, మొట్ట మొదటి సారి జరిగినట్టుగా చెబుతున్నారు.

ఇక రాజధాని అంశంలోని రెండు బిల్లుల విషయంలో కూడా ఇప్పటికే అసెంబ్లీ రెండుమార్లు ఆమోదించిన నేపథ్యంలో ఇక మండలి నిర్ణయంతో సంబంధం లేదని కొందరు వాదిస్తున్నారు. శాసనమండలిని టీడీపీ దుర్వినియోగం చేస్తోందని మంత్రులు మండిపడుతున్నారు. బలం ఉందని చెప్పి , తాముకు తోచినట్టుగా వ్యవహరించే తీరుని మంత్రులు తప్పుబడుతున్నారు. లోకేశ్ నేరుగా మండలిలో ఫోటోలు తీస్తూ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన తీరు మీద, మంత్రి వెల్లంపల్లి మీద జరిగిన దాడికి సంబంధించి చట్టపరమైన చర్యలకు పూనుకుంటున్నట్టు ప్రకటించారు.

Show comments