iDreamPost
android-app
ios-app

అమరావతి.. ఇంకా తేలలేదు

అమరావతి.. ఇంకా తేలలేదు

అమరావతిలో జరిగిన భూ కుంభకోణంపై వివిధ దర్యాప్తు సంస్థలు చేస్తున్న విచారణ నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏప్రిల్‌ వరకూ అమలులో కొనసాగనున్నాయి. ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేలను ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రిం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను దేశ అత్యున్నత న్యాయస్థానం ఏప్రిల 7వ తేదీకి వాయిదా వేసింది. రాజ్యాంగ ధర్మాసనం కేసు విచారణ ఉన్నందున ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై మరో రోజు వాదనలు వింటామని జస్టిస్‌ అశోక్‌ భూషన్, జస్టిస్‌ సుభాష్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. దీంతో అప్పటి వరకు అమరావతి స్కాంపై సిట్, ఏసీబీ, సీఐడీ చేస్తున్న దర్యాప్తులు యథాతథ స్థితిలో ఉండబోతున్నాయి.

దేనికైనా సిద్ధమే..

అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందనే బలమైన ఆధారాలు లభించడంతో ఏపీ ప్రభుత్వం నిజానిజాలు తేల్చాలనే పట్టుదలతో ఉంది. పైగా ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయం కావడంతో విచారణ పూర్తి చేసి వాస్తవాలను చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సిట్, సీఐడీ, ఏసీబీలు చేస్తున్న దర్యాప్తులను కొనసాగించేలా హైకోర్టు స్టేలను ఎత్తివేయాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థలతో కాకపోయినా.. సీబీఐ విచారణకు కూడా సిద్ధమేనని కోర్టు దృష్టికి తెచ్చింది. కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపినా తమకు అభ్యంతరం లేదని విన్నవించడంతో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏమిటో తెలుస్తోంది.

విమర్శలకు చెక్‌ పెట్టేలా..

సీఎం వైఎస్‌ జగన్‌ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వారిని ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి కేసులు నమోదు చే యిస్తున్నారంటూ ప్రతివాదులైన టీడీపీ నేత వర్ల రామయ్య, మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌లు తమ కౌంటర్‌ అఫిడవిట్లలో పేర్కొన్నారు. ఇలాంటి వాదనను తెరపైకి తెచ్చిన ప్రతివాదులకు చెక్‌ పెట్టేలా ఏపీ ప్రభుత్వం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరపాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తే.. ఆ విచారణను రాష్ట్ర ప్రభుత్వం ప్రభావితం చేసే అవకాశం ఉంటుందనే భావన కూడా రాకుండా ఏపీ సర్కార్‌.. సుప్రిం కోర్టు ముందు ఉన్నతమైన ప్రతిపాదనను పెట్టింది. ఇప్పటికే అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖపై కేంద్ర హోం శాఖ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సీఎం వైఎస్‌ జగన్‌ పలుమార్లు తాను రాసిన లేఖపై కేంద్రానికి గుర్తు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏప్రిల్‌లో జరగబోయే విచారణలో సుప్రిం కోర్టు అమరావతి భూ కుంభకోణం విచారణపై ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందో వేచి చూడాలి.