iDreamPost
android-app
ios-app

పార్టీ ఏదైనా పదవులు,ప్రాజెక్టులు సాధించే సాధకురాలు సాధినేని యామినీ

  • Published May 06, 2020 | 4:31 AM Updated Updated May 06, 2020 | 4:31 AM
పార్టీ ఏదైనా పదవులు,ప్రాజెక్టులు సాధించే సాధకురాలు సాధినేని యామినీ

ప్రస్తుతం బీజేపీలో ఏపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సాధినేని యామినీ అమెరికాలోని భారతీయ యువ పారిశ్రామిక వేత్తల సంఘ గౌరవాధ్యక్షులుగా నియమితులయ్యారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ CIMSME , CEIIE గౌరవ అధ్యక్షురాలిగా ఎంపికైనట్లు తెలిపారు . ఈ సంఘం 4700 మంది పారిశ్రామిక వేత్తల జాతీయ నెట్ వర్క్ తోనూ , పలువురు యువ పారిశ్రామిక వేత్తలతోనూ అనుసంధానమై ఉన్నదని తెలిపారు.

సాధినేని యామినీ గతంలో తెలుగు దేశం మహిళా విభాగం అధికార ప్రతినిధిగా కూడా పని చేశారు . అప్పట్లో పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి మాట్లాడుతూ మల్లెపూలు నలుపుకోటానికి తప్ప ఎందుకూ పనికిరాడని వ్యాఖ్యానించి సంచలనం రేపిన యామినీ ఈ పరిణామంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి తీవ్రంగా ట్రోల్ చేయబడ్డారు . ఇందుకు సంబంధించి పలు స్టేషన్లలో కేసులు సైతం నమోదయ్యాయి . తొలుత 2014 లో శ్రీయం అనే కమ్యూనికేషన్ కంపెనీ స్థాపించిన యామినీ 2015 హుదూద్ తుఫాన్ సమయంలో వైర్లెస్ కమ్యూనికేషన్ సేవలు అందిస్తూ బాబు గారి దృష్టిలో పడింది.

అటు తర్వాత టీడీపీలో క్రియాశీలకంగా పని చేస్తూనే అచిర కాలంలో తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించిన యామినీ ప్రభుత్వం నుండి తన సంస్థకు పలు ప్రాజెక్టులు సాధించుకొంది . యామినీ తన కంపెనీలని ఎంత వేగంగా అభివృద్ధి చేసిందంటే 2014 లో అతి చిన్న మూలధనంతో ప్రారంభించిన తన కంపెనీ 2016 లో కేవలం ఎనిమిది నెలల్లో ఆరు కోట్ల టర్నోవర్ పొందింది . అంతేకాక బాబు గారి రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ వర్క్స్ లో పలు ప్రాజెక్టులు దక్కించుకొన్న యామినీ 75000 మీటర్ల కేబుల్ వర్క్ తో పాటు ఒక విద్యుత్ ప్లాంట్ వర్క్ సైతం చేజిక్కించుకొంది . అంతేకాక తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఐటీ , సోలార్ , సపోర్ట్ సర్వీసెస్ , ఫార్మా , కెమికల్ ట్రేడింగ్ రంగాలకు విస్తరించింది.

టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మోడీకి , జగన్ కి వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేసిన యామినీ , పవన్ కళ్యాణ్ పై తరుచూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ సంచలనం రేపిన ఆమె 2019 ఎన్నికలలో టీడీపీ ఓడిన వెంటనే బీజేపీలోకి ఫిరాయించింది . ఆ తర్వాత తన గత పార్టీ నేత బాబు విధానాల పై పలు విమర్శలు గుప్పించిన ఆమె ఓ పొలిటికల్ ఇంటర్వ్యూలో నారా లోకేష్ పనికిరాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుతం అమెరికా యువ పారిశ్రామికవేత్తల సంఘ గౌరవ అధ్యక్షురాలిగా బీజేపీ తరపున ఎంపికైన ఆమె వ్యాపార రంగంలో పలు సంచలనాలు నమోదు చేస్తుందనటంలో సందేహం లేదు . అయితే అవి ప్రజలకు ఉపయోగపడేవి , బీజేపీకి పేరు తెచ్చేవి అవుతాయో యామినీ వ్యాపార సామ్రాజ్య విస్తరణకు మాత్రమే ఉపయోగపడతాయో వేచి చూడాలి .