iDreamPost
iDreamPost
ఒక్కసారి అధికారంలోకి వచ్చేసాక అప్పటి వరకు తమ వెనుక అండగా ఉన్నవారు స్పురణకు రాకపోవడం సహజం. ఇందుకు కారణాలనేకం ఉంటుంటాయి. అయితే ప్రజాస్వామ్యంలో అయిదేళ్ళ కోసారి అధికారం మేరే అవకాశం ఉండడంతో ఇలా ‘స్ఫురణ’కు రాకపోవడం అయిదేళ్ళకు మాత్రమే పరిమితమైందని చెప్పుకోవాల్సి ఉంటుంది. లేక పోతే ఒక్కసారి అధికారంలోకొచ్చి నాయకులకు ఎప్పటికీ తమకు అండగా నిలిచిన వారి అవసరం ఉండకుండా పోయేది.
అధికారంలో ఉండగా అండగా ఉన్నవారిని ఏ మాత్రం పట్టించుకోకుండా, ఆ అధికారం పోయాక ‘నేను మారాను’ మిమ్మల్ని ఏదో చేసేస్తాను అని చెప్పే విషయంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడికి ఒక ప్రత్యేక రికార్డే ఉందని చెబుతుంటారు ఆయన సొంత పార్టీ నాయకులు. చంద్రబాబు సీయంగా రాజకీయ ప్రయాణం మొదలు పెట్టిన దగ్గర్నుంచి ఆయన్ను పరిశీలిస్తున్న వారు కూడా ఈ విషయాన్ని ఏకీభవించకుండా ఉండలేరు.
అయితే ఇప్పుడు ఏపీలో అధికార పక్షమైన వైఎస్సార్‌సీపీ అందుకు భిన్నంగా వ్యహరిస్తోంది. తాము అధికారంలోకి వచ్చేందుకు అండదండలందించిన అన్ని సమాజికవర్గాలకు వీలైనంత వేగంగా అండగా నిలబడుతోంది. అందులో భాగంగానే 56 బీసీ కార్పొరేషన్లు ఛైర్మన్లు, ఆరొందలకుపైగా డైరెక్టర్ల పదవులను ఏకకాలంలో ఇటీవలే ప్రకటించేసారు. ఏపీ రాజకీయాల్లో ఒక్క కుదుపుకుదిపే సంఘటనగానే విశ్లేషకులు ఈ అంశాన్ని పరిగణిస్తున్నారు. అప్పటి వరకు బీసీలు అంటే టీడీపీకి వెన్నెముక అన్నరీతిలో ఉండేవారు. అయితే ఆ పార్టీ అనుసరించిన విధానవైఖరుల కారణంగా వారంతా ఆ పార్టీకి క్రమక్రమంగా దూరమవుతూ వచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయా సామాజికవర్గాలకు ఒక్క నామినేటెడ్ పోస్టు కూడా దక్కలేదంటే టీడీపీలో బీసీలు ఎంతగా నిరాదరణకు గురయ్యారో అర్ధం చేసుకోవచ్చు. సరిగ్గా సీయం జగన్ ఇదే విషయంపై తన రాజకీయ చతురతను ప్రయోగించారు.
దీంతో ఇప్పుడు టీడీపీ నాయకులు గతంలో తాము చేసిన పొరపాట్లు ఏంటో ఒక్కసారిగా గుర్తుకు వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అంతర్గత చర్చల్లో సైతం ఇదే విషయంపై జోరుగానే చర్చ జరుగుతోందన్న టాక్ విన్పిస్తోంది. అధికారంలో ఉండగా మనం చేయలేని పనిని, కుర్రాడు చేస్తున్నాడని ఇది టీడీపీకి కోలుకోలేని దెబ్బేన్న నిశ్చితాభిప్రాయాన్ని పార్టీ సీనియర్‌లు సైతం ఒప్పుకుంటున్నట్టు వినికిడి. అయితే ఈ నష్టాన్ని పూడ్చుకునే క్రమంలోనే నిధులేని ఛైర్మన్‌లు గట్రా అంటూ.. ఏదో పసలేని విమర్శలతో నెట్టుకొస్తున్నారని చెబుతున్నారు.
సాధారణంగా పార్టీకోసం పనిచేసేవారి అంతిమ లక్ష్యం పదవే అయ్యుంటుంది. తమ స్థాయికి దగ్గ పదవి ద్వారా గౌరవం దక్కాలని కోరుకుంటుంటారు. ఇందుకోసం నిస్వార్ధంగా పార్టీ కోసమే అహర్నిశలు పనిచేసేవారు కూడా ఎందరో ఉంటుంటారు. అధికారంలోకొచ్చాక అటువంటి వారికి కనీస ప్రాధాన్యం కూడా ఇవ్వకపోవడం దారుణమనే చెప్పాలి. ఆ తరువాత వారిని ఎంతగా ఆకట్టుకునేందుకు సాంత్వన వచనాలు పలికినప్పటికీ పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. పదవులు ఇవ్వకపోవడానికి కారణాలు ఏమైనా చెప్పుకోవచ్చు. కానీ ఆయా కారణాలు ప్రజల ముందు, పార్టీకోసం పనిచేసిన నాయకుల ముందు తేలిపోకమానవు. ఇలా తేలిపోయినప్పుడు వారందరిలో ఉండే అసంతృప్తి ఫలితమే ఓటమిగా తేలుతుంది. 2019 ఎన్నికల్లో అదే జరిగిందని విశ్లేషిస్తున్నారు.
ఏది ఏమైనా అధికారంలో ఉన్నప్పుడు వెనుకబడిన సామాజికవర్గాలకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించకపోవడం తాము చేసిన అనేక పొరపాట్లలో ప్రాధాన్యమైనదిగానే టీడీపీ నేతలు ఇప్పుడు గుర్తిస్తున్నారంటున్నారు.