iDreamPost
iDreamPost
ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న విజయనగరం గజపతుల వారసుడు అశోక్ గజపతిరాజుకి షాక్ తగిలింది. జగన్ సర్కారు ఈ టీడీపీ నేతకు ఝలక్ ఇచ్చింది. మోడీ సర్కారులో కేంద్రమంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి స్థానంలో ప్రస్తుతం మోడీ పార్టీలో ఉన్న ఆయన సోదరుడి కుమార్తె సంచయిత గజపతికి ఛాన్సివ్వడం చర్చనీయాంశం అయ్యింది. సింహాచలం దేవస్థానంతో పాటు మాన్సస్ ట్రస్ట్ లో ఇది కీలక మలుపుగా కనిపిస్తోంది. సుదీర్ఘకాలంగా విజయనగరం రాజుల సారథ్యంలో ఈ ట్రస్ట్ నడుస్తోంది. ఏపీలోని పలు దేవాలయాలను ఆ ట్రస్ట్ పర్యవేక్షిస్తోంది. దానికి చైర్మన్ గా అశోక్ గజపతిరాజు కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన్ని తొలగించి సంచయితకు చోటు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
సింహాచలం ఆలయానికి గజపతిరాజు కుటుంబం అనువంశిక ధర్మకర్తలు.. వారి కుటుంబం నుంచి చైర్మన్ ని ఎన్నుకుంటారు. ఈసారి అశోక్ స్థానంలో సంచయితకు ఛాన్స్ దక్కడం విశేషం. ఆమె ట్రస్ట్ బోర్డ్ బాధ్యతలు స్వీకరించారు. దాంతో పాటుగా మాన్సస్ ట్రస్ట్ కూడా ఆమె సారథ్యంలోకి వెళ్లబోతోంది. కొద్ది రోజుల క్రితం సంచిత గజపతిరాజుని ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలిగా జగన్ సర్కారు నామినేట్ చేసింది. సింహాచలం ఆలయ పాలకమండలి సభ్యురాలిగా ఆమెకు అవకాశం కల్పించింది. విజయనగరం రాజకుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఆమెను పాలక మండలి సభ్యురాలిగా నియమించారని భావించారు.
అయితే అనూహ్యంగా ఆమెకు సభ్యురాలితో సరిపెట్టుకుండా ఏకంగా చైర్మన్ గిరీ అప్పగించడం సంచనలంగా మారింది. వాస్తవానికి ఇది అశోక్ గజపతిరాజు సహా ఆయన వర్గీయులు ఎవరూ ఊహించని పరిణామంగా భావిస్తున్నారు. అశోక్ ని తొలగించి సంచయితకు చోటు ఇవ్వడం విజయనగరం రాజకీయాల్లో కీలక మార్పులకు దోహదం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. జగన్ ఇచ్చిన ఝలక్ తో ఖంగుతిన్న అశోక్ కుటుంబం రగిలిపోతున్నట్టుగా చెబుతున్నారు. ఏం చేయాలన్న దానిపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్టు సమచారం.
సంచయిత నేపథ్యం ఏమిటి
ప్రస్తుతం హఠాత్తుగా హాట్ టాపిక్ అవుతున్న సంచయిత చాలాకాలంగా ప్రజా జీవితంలో ఉన్నారు. ఆమె తల్లిదండ్రులు కూడా రాజకీయ నేపథ్యం ఉంది. అశోక్ గజపతిరాజు సోదరుడు ఆనంద్ గజపతిరాజు మొదటి భార్య ఉమా గజపతిరాజుల ఇద్దరు సంతానంలో సంచయిత ఒకరు. ఆనంద్ గజపతిరాజు ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఉమా గజపతిరాజు రెండు సార్లు విశాఖ నుంచి పార్లమెంట్ కి పోటీచేశారు. 1989లో విజయం సాధించారు. ఆమె ఢిల్లీ యూనివర్సిటీలో విద్యనభ్యసించిన తర్వాత పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సొంతంగా సోషల్ అవేర్‌నెస్ న్యూయర్ ఆల్టర్నెటివ్స్ పేరిట ఎన్జీవో ఏర్పాటు చేశారు. సాన సంస్థ పేరుతో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత గత సాధారణ ఎన్నికలకు ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. విజయనగరంలో ప్రత్యక్షం కావడంతో అశోక్ గజపతిరాజు తన వారసురాలిని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న తరుణంలో అన్నదమ్ముల బిడ్డలిద్దరూ పోటీ పడే వాతావరణం కనిపించింది. కానీ అనూహ్యంగా అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదు. అదే సమయంలో సంచిత మాత్రం బీజేపీ వాణీ వినిపించేందుకు జాతీయ స్థాయిలో కొంత ప్రయత్నం చేశారు
బీజేపీలో చేరిన గజపతుల కుటుంబానికి చెందిన ఏకైక వ్యక్తి ఆమె. ప్రస్తుతం బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆమెను పిలిచి పెద్ద పీట వేయడంతో పరిణామాలు మారుతున్నట్టు భావిస్తున్నారు. ఆమె పార్టీ మారే అవకాశాలు కూడా లేకపోలేదని కొందరు చెబుతున్నప్పటికీ తాజా పరిణామాల తర్వాత రాజకీయంగా ఆమె మరింత క్రియాశీలకంగా మారడం తథ్యంగా ఉంది. దాంతో ఆమె ఏపార్టీ తరుపున ముందుకు సాగుతారన్నది చర్చనీయాంశం. అదే సమయంలో ఆలయ పాలకమండలి, ట్రస్ చైర్మన్ హోదాలు కట్టబెట్టిన వైఎస్సార్సీపీకి చేరువయితే విజయనగరంలో కొత్త పరిణామాలు అనివార్యం అవుతాయి.