iDreamPost
android-app
ios-app

వలంటీర్ల వ్య‌వ‌స్థ‌.. అస‌త్య వార్త..!

వలంటీర్ల వ్య‌వ‌స్థ‌.. అస‌త్య వార్త..!

ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠ‌త‌కు తొలి పునాది వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌. సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న‌కు దీపిక అది. ఆ వ్య‌వ‌స్థ అందుబాటులోకి వ‌చ్చాక ఏపీ ప్ర‌జ‌లు క‌నీవినీ ఎరుగ‌ని సేవ‌ల‌ను పొందుతున్నారు. ఈ వ్య‌వ‌స్థ ద్వారా ఏపీ ప్ర‌భుత్వం ఖ్యాతి దేశ‌వ్యాప్త‌మైంది. వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ ప‌నితీరును ప్ర‌ముఖులెంద‌రో మెచ్చుకుంటున్నారు. ఇదే ప్ర‌తిప‌క్షాల‌కు ఇబ్బందిగా మారుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇటీవ‌ల ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నారు. వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను తీసేస్తున్నారంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు.

అస‌లు విష‌యం ఏంటంటే…

2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా 2.60లక్షల మందిని గ్రామ, వార్డు వాలంటీర్లుగా నియమించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేసేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్లను నియమించారు. వలంటీర్ల సంఖ్య ప్రతి జిల్లాలో 20వేల నుంచి 30వేల మంది వరకు ఉన్నారు. గ్రామ వలంటీర్లుగా ఎంపికైన వారిలో చాలా మంది అధికార పార్టీ అనుచరులు, రికమండేషన్లతో వచ్చిన వారే ఉన్నారు. నాయకుల వెనుక తిరిగిన వారికీ ఏది ఒక పని కల్పించేందుకు వాలంటీర్ల పథకం బాగానే పనికి వచ్చింది. ఎన్నికల్లో తమ కోసం తిరిగిన వారికీ ఓ ఉద్యోగం వేయించామన్న ధీమా ఉండేది. వీరు సైతం క్షేత్రస్థాయిలో తిరుగుతూ దాదాపు ఏడాదిన్నరగా వీరంతా ఇంటింటికీ పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలను చేరవేస్తున్నారు. 2021 జనవరి నుంచి రేషన్ సరుకులు కూడా వీరే సరఫరా చేయనున్నారు. వచ్చే కాలం లో వీరు చేసే పనులు ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఉత్త‌ర్వుల్లో ఏముందంటే…

ప్రభుత్వం ఇచ్చిన తాజా ఉత్తర్వులతో నియామకాలు చేపట్టేనాటికి 18 ఏళ్ల లోపు, 35 ఏళ్లు వయసు పైబడిన వారిని తొల‌గించాల‌ని నిర్ణ‌యించింది. వాస్త‌వానికి ఆ నిబంధ‌న నియామ‌కాల‌కు ముందే ఉంది. అయిన‌ప్ప‌టికి కొంత మంది 35 ఏళ్లు నిండిన వారు వ‌లంటీర్లుగా నియ‌మించ‌బ‌డ్డారు. అది కూడా ఆరుగురు మాత్రమే. వారికి ఏడాదిగా జీతాలు కూడా రావ‌డం లేదు. సిస్టంలో ఎర్ర‌ర్ వ‌స్తోంది. దీనికి గ‌ల కార‌ణాల‌ను ప‌రిశీలిస్తే నియామ‌కాల‌లోనే పొర‌పొట్లు జ‌రిగిన‌ట్లు తేలింది. వారి నియామ‌కం నిబంధ‌న ప్ర‌కారం జ‌ర‌గ‌లేద‌ని తెలిసింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 35 ఏళ్లు నిండిన వలంటీర్ల నియామకం జరిగిన దృష్ట్యా వారిని విధుల నుంచి తొలగించాలని, ఆ ఖాళీల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వలంటీర్లు అంద‌రిలోనూ ఆందోళ‌న ఏర్ప‌డేలా ప‌లువురు ప్ర‌చారం చేప‌ట్టారు. తాజా ఉత్తర్వులతో ఉద్యోగం కోల్పోతున్నవారి సంఖ్య వేలల్లోనే ఉండనుంది అన్న‌ట్లుగా చెప్పుకొచ్చారు.

ఆరుగురు మాత్ర‌మే…

35 ఏళ్లు నిండిన వలంటీర్లను ప్రభుత్వం తొలగిస్తోందని కొన్ని పత్రికలు, సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. అలాంటి వాటిని ఎవరూ నమ్మవద్దని కమిషనర్‌ నవీన్‌కుమార్‌ పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంపికైన ఆరుగురిని మాత్రమే తొలగించడానికి చేపట్టిన చర్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారన్నారు. మిగిలిన వారెవరినీ తొలగించడం లేదని స్పష్టం చేశారు.

ప్ర‌తి నెలా పోస్టుల భ‌ర్తీ..

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు వలంటీర్ల ఖాళీలను ఎప్పటికప్పుడు ప్రతి నెలా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెలా 1 నుంచి 16వ తేదీల మధ్య జిల్లాల పరిధిలో ఉండే వలంటీర్ల ఖాళీల భర్తీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలంటూ అన్ని జిల్లాల జాయింట్‌ కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్‌ నవీన్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు ఎప్పటికప్పుడు తమ పరిధిలో ఏర్పడే ఖాళీల వివరాలను ఆయా జిల్లాల జాయింట్‌ కలెక్టర్ల దృష్టికి తీసుకురావాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.60 లక్షల మంది వలంటీర్లు ఉండగా.. ప్రస్తుతం 7,120 వలంటీర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అందులో 5,154 గ్రామ వలంటీర్‌ పోస్టులు, 1,966 వార్డు వలంటీర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు.