iDreamPost
iDreamPost
పాలకులు నిర్మించిన నగరాలు చరిత్రలో ఎక్కడా లేవు. ఉన్నాయనుకుంటే అది భ్రమ మాత్రమే. పాలకులు తమ నివాసాలను, తమ సిబ్బంది (ఉద్యోగుల) నివాసాలను, కొన్ని కార్యాలయాలను నిర్మించుకుంటారు. కొంత విలాసవంతంగా ఉండాలంటే విడిది ఇళ్ళు కొన్ని నిర్మించుకుంటారు. మిగతాది అంతా ప్రజలే నిర్మించుకుంటారు. పాలకుడికి ముందు చూపు ఉంటే ఆ ప్రాంతంలో ప్రజలు నిర్మించుకునే ఇళ్ళు, ఏర్పాటు చేసుకునే వ్యాపార కూడళ్ళకు నమూనాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. వ్యాపార కూడళ్ళు అక్కడ ఉండే డిమాండును బట్టి, ప్రజల అవసరాలను, అభిరుచులను బట్టి వస్తూ ఉంటాయి.
ఈ మధ్యకాలంలో అనేక ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు నగరాలకు కాస్త దూరంగా వచ్చాయి. అవి ప్రారంభం కాగానే, వాటి గేటు ముందు టీ దుకాణం, జిరాక్స్ దుకాణం, పుస్తకాల దుకాణం, ఇలా ఒక్కొక్కటి అవసరాన్ని బట్టి వచ్చేస్తూ ఉంటాయి. కాలక్రమేణా అదో చిన్న గ్రామం అవుతుంది. కాలేజీ ఏర్పాటు చేయడం వరకే ఒక వ్యక్తి చేయగలుగుతారు. మిగతావన్నీ అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ప్రజలు ఏర్పాటు చేసుకుంటారు. వాటితో ఆ ప్రాంతం చిన్న గ్రామం అవుతుంది. అంతే కానీ కాలేజీ ఏర్పాటుచేసిన వ్యక్తే గేటు బయట టీ దుకాణం, జిరాక్స్ దుకాణం ఏర్పాటు చేయాలనుకోడు. ఒకవేళ కాలేజిలోపలే క్యాంటీన్ ఏర్పాటు చేసినా ఖచ్చితంగా గేటు బయట మరో టీ దుకాణం ఏర్పాటు అవుతుంది.
ఓ యాభై అంతస్తుల ఐటీ టవర్ నిర్మించి ప్రపంచ స్థాయి ఐటీ కార్యాలయాలు ప్రారంభించినా, ఆ భవనంలోనే ప్రతి అంతస్తుకు ఒక క్యాంటీన్ ఏర్పాటు చేసినా, వీధి చివర ఒక బడ్డీకొట్టు, టీ దుకాణం వెలుస్తాయి. కొబ్బరి బొండాల బండి వస్తుంది. అరటిపళ్ళు, యాపిల్ పళ్ళు గంపకెత్తుకొని ఓ ముసలమ్మ వచ్చేస్తుంది. ఆ ఐటీ భవనంలో మహిళలు ఉన్నారు, వారు పూలు పెట్టుకుంటారు అని తెలిస్తే నెత్తిన పూల గంపతో ఓ అమ్మాయి వస్తుంది. వ్యాపారం బాగుంటే అక్కడే రోడ్డుపక్కన ఓ గుడిసె వేసుకుంటుంది. వీటన్నితో ఆ ప్రాంతం ఓ చిన్న నివాస ప్రాంతం అవుతుంది.
మన భారత దేశంలో గ్రామాలూ, పట్టణాలూ, నగరాలూ నిర్మాణం అయ్యేది ఇలాగే. ఏలూరులో “ఆశ్రం” కాలేజీ, మంగళగిరిలో NRI కాలేజీ, అంతెందుకు 1950 దశకంలో విజయవాడలో ఆంధ్రా లొయొలా కాలేజీ ఇలా ప్రారంభం అయినవే. ఇప్పుడు వాటి చుట్టూ వచ్చిన నివాస, వాణిజ్య ప్రాంతాలను ఆయా కాలేజీలను ఏర్పాటు చేసిన వారు అభివృద్ధి చేయలేదు. ప్రాంతాలు ఇలానే అభివృద్ధి చెందుతాయి. అది ఏ నగరం అయినా అభివృద్ధి ఇలాగే జరుగుతుంది.
విజయనగర సామ్రాజ్యానికి ప్రతినిధులుగా కన్నడ ప్రాంతంలో కెంపేగౌడ బెంగుళూరును, దక్షిణాంధ్ర ప్రాంతంలో దామర్ల ముదిరాస చెన్నప్ప నాయకుడు (మద్రాసు) ఇప్పటి చెన్నయ్ నగరాన్ని 1530 దశకంలో ప్రారంభించారు. అలాగే 1590 దశకంలో ఖులీ కుతుబ్ షా హైదరాబాద్ నగర నిర్మాణం మొదలు పెట్టారు. అంటే ఆయా పాలకులు అప్పటి అవసరాలకు అనుకూలంగా తమ అధికార, నివాస భవనాలు, తమ సిబ్బంది, సైనికుల అధికార, నివాస భవనాలు నిర్మించుకున్నారు. తమ అధికార దర్పానికి తగ్గట్టు పెద్ద కోటలు నిర్మించుకున్నారు. జరిగింది అంతవరకే. మిగిలిన ప్రాంతమంతా ప్రజలు కాలక్రమేణా నిర్మించుకున్నదే. ఏ పాలకుడూ పూర్తి నగరాన్ని నిర్మించలేదు. నిర్మించాలని కూడా అనుకోడు.
కానీ దురదృష్టవశాత్తు “అమరావతి” ఈ వాస్తవాలకు భిన్నంగా మొదలయ్యింది. రాజధానికి కావలసిన సచివాలయం, శాసన సభ, రాజ్ భవన్, హై కోర్టు, ముఖ్యమంత్రి, మంత్రులు, న్యాయాధిపతులు, అధికారులు, అన్ని తరగతుల ఉద్యోగుల నివాసాలు మాత్రమే ప్రభుత్వం ఆలోచన చేసి, ప్రణాళికలు సిద్ధం చేసి ఉంటే 2014 నుండి రెండు మూడేళ్ళలోనే ఆ పని పూర్తయ్యుండేది. కానీ హోటల్ ప్రణాళిక, ఆస్పత్రి ప్రణాళిక, యూనివర్సిటీ ప్రణాళిక, అన్నీ పాలకుడే సిద్ధం చేయాలనుకోవడంతోనే మొత్తం కలగా పులగం అయ్యింది.
ఏలూరులో “ఆశ్రం” కాలేజీ, ఆస్పత్రి నిర్మించాలని మాత్రమే ఆ యాజమాన్యం ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ పని పూర్తి చేసింది. మంగళగిరిలో కాలేజీ, ఆస్పత్రి నిర్మించాలని మాత్రమే NRI అకాడెమీ యాజమాన్యం ఆలోచన చేసింది. ఆ పని పూర్తి చేసింది. అలా కాకుండా కొబ్బరిబోండాల దుకాణం, బడ్డీ కొట్టు, టీ కొట్టు లాంటివి కూడా తామే పెట్టాలని చూసుంటే ఆ సంస్థలు ఇప్పటికీ వెలుగుచూసేవి కావు. పాలకుడు చేయాల్సిన పని తన పాలనకు అవసరమైన భవంతులు, నివాసాలు నిర్మించడం, ఆ ప్రాంతంలో మౌళిక వసతులు కల్పించడం. ఇంకా విజనరీ అయితే ఆ పరిసర ప్రాంతాల్లో నిర్మాణాలు ఎలా ఉండాలో ప్రణాళిక మాత్రమే రూపొందిస్తారు. ఆ పద్దతి అమరావతిలో జరగలేదు. రాజ్ భవన్, హై కోర్టు, అసెంబ్లీ భవనాలతో పాటు స్టార్ హోటళ్ళ ప్రణాళిక, అవి ఎవరు ఎక్కడ కట్టాలో వంటి ఆలోచనలు కూడా చేయడం, లక్ష కోట్ల అప్పు, 16వేల కోట్ల లోటు ఉన్నవాస్తవాన్ని మరచి ఆకాశహర్మ్యాలు, అంతర్జాతీయ స్థాయి భవంతులు నిర్మించాలని తలచారు. దీన్నే నేలవిడిచి సాము అంటారు.
Also Read : పాలకులు – నగర నిర్మాణం#2
Also Read: పాలకులు – నగర నిర్మాణం#3