Idream media
Idream media
న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ బుధవారం నుండి ప్రారంభం కాబోతున్న సమయంలో టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కివీస్ పర్యటన నుంచి కాలి పిక్క గాయంతో జట్టు నుండి వైదొలిగాడు. ఆదివారం కివీస్ తో జరిగిన చివరి టీ20లో 60 పరుగులు చేసిన రోహిత్ బ్యాటింగ్ చేస్తూ కాలి కండరాలు పట్టేయడంతో నొప్పి భరించలేక రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగాడు. అనంతరం అతడు న్యూజిలాండ్ బ్యాటింగ్ సమయంలో మైదానంలోకి అడుగుపెట్టలేదు. ఈ మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోగా వైస్ కెప్టెన్ రోహిత్‌శర్మ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు.
రోహిత్ ఆడిన మూడో,ఐదో టీ20ల్లోనూ అర్థ సెంచరీలు సాధించి సూపర్ ఫామ్ లో ఉన్నాడు. మూడో టీ20 సూపర్ ఓవర్‌లో చివరి రెండు బంతులకు సిక్సులు కొట్టి ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించాడు.కివీస్ తో జరిగిన చివరి టీ20లోను తాత్కాలిక సారథిగా వ్యవహరించిన రోహిత్ 41 బంతుల్లో 3 ఫోర్లు,3 సిక్సర్లుతో 60 పరుగులతో (రిటైర్డ్ హర్ట్) టాప్ స్కోరర్‌గా నిలిచి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆడాడు. రోహిత్ శర్మ గాయంతో న్యూజిలాండ్ పర్యటన నుంచి వైదొలగా అతడి స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రోహిత్ గాయం తీవ్రత ఎక్కువే:
రోహిత్ గాయం తీవ్రత గురించి తెలుసుకునేందుకు టీమ్ ఫిజియో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి.కాలి పిక్క కండరంలో చీలిక ఏర్పడిందని,అతనికి విశ్రాంతి అవసరమని భావిస్తున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. త్వరలోనే గాయం తీవ్రతపై స్పష్టత వస్తుందని అయితే కివీస్ పర్యటనలోని 3 వన్డే మరియు 2 టెస్టు సిరీస్‌లలో రోహిత్ ఆడాడని బీసీసీఐ అధికారి సోమవారం వెల్లడించారు. మూడు ఫార్మాట్లలోనూ అద్భుతంగా రాణిస్తున్న రోహిత్ దూరమవడం భారత జట్టుకు ఎదురుదెబ్బ.
మయాంక్ అగర్వాల్ కు ఓపెనర్ గా ఛాన్స్:
రోహిత్ స్థానంలో మయాంక్ అగర్వాల్ భారత జట్టులోకి ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో మయాంక్‌ను స్టాండ్ బై ఓపెనర్‌గా జట్టులో కొనసాగిన సంగతి విదితమే. మయాంక్ తో పాటు యువ ఓపెనర్లు పృథ్వీ షా,శుభ్‌మాన్ గిల్ కూడా జట్టులో ఓపెనర్ స్థానం కోసం పోటీపడుతున్నారు. బోర్డు కార్యదర్శి జై షా ప్రస్తుతం న్యూజిలాండ్‌కు దేరాడని,కెప్టెన్ ను సంప్రదించి త్వరలోనే సెలెక్టర్లు మరో ప్రత్యామ్నాయ ఆటగాడిని ప్రకటించనున్నారు.