iDreamPost
iDreamPost
“అమరావతికి వెళ్ళి అక్కడి రైతులను కలవటానికి ఇష్టపడకుండా కేవలం జగన్మోహన్ రెడ్డిని మాత్రమే కలిసి కోర్కెల చిట్టా ఇవ్వటాన్ని సినీపెద్దలు ఎలా సమర్ధించుకుంటారు’’? తాజాగా సినీ ప్రముఖలను ఉద్దేశించి ఎల్లోమీడియాలో రాసిన కొత్తపలుకు’ లో ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ వేసిన ప్రశ్న. నెలల తరబడి ఉద్యమం చేస్తున్న రైతులను కలవకుండా కేవలం సిఎంను మాత్రమే కలిసి తమ సమస్యలపై చర్చించి వచ్చేయటం ఏమిటంటూ రాధాకృష్ణ నిలదీయటం ఏ జర్నలిజమో ఆయనే చెప్పాలి. ఈమధ్యనే హైదరాబాద్ నుండి మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కొందరు అమరావతికి వెళ్ళి జగన్ తో భేటి అయిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.
కరోనా వైరస్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులకు పర్మిషన్లు కోరటంతో పాటు అనేక సమస్యల పరిష్కారం కోరేందుకు వీళ్ళంతా సిఎంను కలిశారు. తమ సమస్యలను ప్రస్తావించిన సమయంలోనే పనిలో పనిగా వైజాగ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. అదే సందర్భంలో స్టూడియోల నిర్మాణానికి స్ధలాలు కేటాయించాలని కూడా అడిగారు. తమ భేటి అయిపోగానే అక్కడే మీడియాతో మాట్లాడిన చిరంజీవి బృందం తిరిగి హైదరాబాద్ కు వచ్చేసింది. ఈ విషయంలోనే రాధాకృష్ణ వాళ్ళపై మండిపోతున్నారు.
నిజానికి సినీ ప్రముఖులు అమరావతి రైతులను ఎందుకు కలవాలో ? కలిసి ఏమి చేయాలో ? రాధాకృష్ణ చెప్పలేదు. ఎందుకంటే అమరావతి రైతుల డిమాండ్ పరిష్కారంలో సినీ ప్రముఖులు ఏమి చేయగలరు ? రాజధానిని అమరావతి నుండి తరలించ కూడదని అనుకుంటున్న రైతలు ప్రభుత్వంతో ఎందుకు చర్చలు జరపటం లేదు ? ఆమధ్య మంత్రి కొడాలి నాని అమరావతి ప్రాంతంలోని రైతులను చర్చలకు ఆహ్వానించిన విషయం గుర్తుండే ఉంటుంది. మంత్రితో చర్చలు జరపాలని కొందరు రైతులు అనుకున్నా మొత్తం మీద దాన్ని ముందుకు పడనీయకుండా చేసిందెవరు ?
అమరావతే మన రాజధాని అనే భావన రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల వారికీ మొదటి నుండి లేదు. తెరవెనుక కారణాలతోనే చంద్రబాబునాయుడు అమరావతిని రాజధానిగా ఎంపిక చేశాడని మెజారిటి ప్రజలకందరికీ తెలుసు. దానికితోడు మిగితా జిల్లాలను ఎండగట్టి ప్రతిది అమరావతి ప్రాంతానికి చంద్రబాబు అగ్రస్ధానం ఇవ్వటంతో ఇటు ఉత్తరాంధ్రతో పాటు అటు రాయలసీమలో కూడా నిరసనలు మొదలైన విషయాన్ని కొత్తపలుకు మరచిపోయింది. పైగా చంద్రబాబు కలలుగన్న భ్రమరావతి నిర్మాణం సాధ్యంకాని పని అన్న విషయం అందరికీ తెలిసిందే.
పైగా అమరావతి నిర్మాణం పేరుతో చంద్రబాబు పాల్పడిన అవినీతి కూడా జనాలందరికీ అర్ధమయ్యింది. పర్యవసానంగానే మొన్నటి ఎన్నికల్లో రాజధాని పరిధిలోని తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో టిడిపి ఓడిపోయింది. మంగళగిరిలో స్వయంగా నారా లోకేష్ పోటి చేసినా జనాలు ఎందుకు ఓట్లేయలేదో ఓసారి టిడిపి, ఎల్లోమీడియా విశ్లేషించుకుంటే మంచిది.ఇదే సమయంలో రాధాకృష్ణ మరో విచిత్రమై ప్రశ్న కూడా వేశాడు. అదేమిటయ్యా అంటే వైజాగ్ లో భూములు కేటాయిస్తే హైదరాబాద్ ను వదిలేసి వైజాగ్ లో ఇళ్ళు కట్టుకుని స్ధిరపడతామని చెప్పగలరా ? అని.
తెలుగు సినీపరిశ్రమ అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయాన్ని రాధాకృష్ణ ఎలా మరిచిపోయాడు ? వైజాగ్ లో భూములిస్తే అక్కడ స్టూడియోలు నిర్మించుకుంటారు. అలాగే ఇళ్ళు కూడా నిర్మించుకోవచ్చు. రెండు రాష్ట్రాల్లోను షూటింగ్ లు చేసుకుంటారు కాబట్టి రెండు చోట్లా ఉండొచ్చు. వైజాగ్ లో సినీపరిశ్రమ అభివృద్ధికి చంద్రబాబు హయాంలో కూడా సమావేశాలు జరిగిన విషయాన్ని రాధాకృష్ణ మరచిపోయినట్లున్నాడు. చంద్రబాబు కూడా వైజాగ్ లో స్టూడియోల నిర్మాణానికి భూములు కేటాయిస్తామని అప్పట్లో హామీ ఇచ్చాడు. భూముల విషయంలో ఇపుడు అడిగిన ప్రశ్నే సినీ పెద్దలను రాధాకృష్ణ అప్పుడు ఎందుకు అడగలేదు ?
సినీప్రముఖులు హైదరాబాద్ ను వదిలేసి వైజాగ్ లో ఇళ్ళు కట్టుకుంటారా ? అని అడుగుతున్న ఎల్లోమీడియా అమరావతిలో ఎందుకు ఇల్లు కట్టుకోలేదో చంద్రబాబును ఎప్పుడైనా అడిగిందా ? 2014లో ఏపికి సిఎం అయిన తర్వాతే చంద్రబాబు హైదరాబాద్ లో ఇంటి నిర్మాణం మొదలుపెట్టిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పటికీ చంద్రబాబు ఉంటున్నది కరకట్టమీద అక్రమనిర్మాణంలోనే అన్న విషయం ఎల్లోమీడియా మరచిపోయినట్లుంది.
ఇక మద్రాసు నుండి హైదరాబాద్ కు సినీ పరిశ్రమ ఒక్క రోజులు షిఫ్టు కాలేదన్న విషయం బహుశా రాధాకృష్ణకు తెలీదేమో. స్టూడియోలు కట్టుకుని షూటింగులు మొదలైతే అభివృద్ధి అదే జరుగుతుంది. అవసరమైన వాళ్ళు స్తోమతున్న వాళ్ళు వైజాగ్ లో కూడా ఇళ్ళు కట్టుకుని రెండు రాష్ట్రాల మధ్య తిరుగుతుంటారన్న విషయం అందరికీ తెలిసిందే.
ఇన్ని మాటలు చెబుతున్న రాధాకృష్ణ గతంలో ముఖ్యమంత్రులను మీడియాకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం కలిశారా ? లేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలిశారా? మా భూములు ఇవ్వము అని రాజధాని ప్రాంతం రైతులు ఫ్లెక్షీలు కట్టిన రోజు రాత్రే వారి పంటలు తగలబెడితే.. నాటి అధికార పక్షంతో కలిపి వైసీపీ నేతలే పంటలు తగలపెట్టారు అంటూ వార్తలు రాశారు. కానీ “అయ్యా ఏ రైతు తన బిడ్డలాంటి పంటను తగలపెట్టుకోడు”,”అధికారులో లేక అధికార పక్ష నేతలో దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారని మీరు వారిని నిలువరించండి” అని ఎప్పుడన్నా చంద్రబాబుకు చెప్పాడా? ప్రజాధనాన్ని సబ్సిడీల పేరుతొ పొందుతున్న ఆంధ్రజ్యోతి ఏనాడన్నా ప్రజా సమస్యల మీద ముఖ్యమంత్రులను కలిసిందా? ఇప్పుడు సినిమా పెద్దలు వారి రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి కలిస్తే రాధాకృష్ణకు ఎందుకు ఈ కడుపుమంట?
మొత్తం మీద జగన్ ను సినీప్రముఖులు కలవటాన్ని రాధాకృష్ణ జీర్ణించుకోలేకపోతున్నట్లు అర్ధమైపోతోంది. అందులోను చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణతో సంబంధం లేకుండానే భేటి జరిగింది. చంద్రబాబు హయాంలో బాగా యాక్టివ్ గా ఉన్న సినీ ప్రముఖుల్లో చాలామంది ఇపుడు కనీసం అడ్రస్ కూడా కనబడటం లేదు. దీంతో సినీప్రముఖులు జగన్ కు మద్దతుగా నిలబడుతున్నారనే మంట రాధాకృష్ణలో మొదలైనట్లుంది. అందుకనే కొత్తపలుకు పేరుతో విషం చిమ్ముతున్నాడు.