iDreamPost
android-app
ios-app

కాంతార 2 రంగం సిద్ధం

  • Published Jan 23, 2023 | 5:47 PM Updated Updated Jan 23, 2023 | 5:47 PM
కాంతార 2 రంగం సిద్ధం

చాలా ఏళ్ళ పాటు ఫిలిం మేకర్స్ ఒక కేస్ స్టడీగా చదవాల్సిన సినిమా కాంతార. ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా, కేవలం ఒక ప్రాంతానికే పరిమితమైన సంస్కృతిని తీసుకుని ఢిల్లీ నుంచి హైదరాబాద్ గల్లీ దాకా అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించేలా తీయడం హీరో కం దర్శకుడు రిషబ్ శెట్టి ప్రతిభకు నిదర్శనం. కేవలం పదహారు కోట్లతో హోంబాలే ఫిలింస్ నిర్మించిన ఈ విలేజ్ వండర్ ఫైనల్ రన్ అయ్యేలోపు నాలుగు వందల కోట్లకు పైగా వసూలు చేయడం పెద్ద రికార్డు. కర్ణాటకలో ఏకంగా కెజిఎఫ్ రన్, ఫుట్ ఫాల్స్ ని అధిగమించి నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించుకోవడం చిన్న విషయం కాదు. ఇప్పుడు దీని కొనసాగింపుకి రంగం సిద్ధం చేస్తున్నాడు రిషబ్

ఇక్కడే కొన్ని ట్విస్టులు ఉన్నాయి. ఇది కాంతరకు సీక్వెల్ కాదు ప్రీక్వెల్ గా రాబోతోంది. అంటే హీరో పాత్ర తండ్రి తాలూకు నేపథ్యం, అసలు ఈ సంప్రదాయం ఎలా పుట్టింది, దైవానుగ్రహం ఎలా దక్కిందనే దాని మీద ఎక్కువ చూపించబోతున్నారు. కర్ణాటకలోని పలు అడవుల్లో రిషబ్ బృందం రెండు నెలల పాటు పరిశోధనలు, లొకేషన్ల వేట చేయబోతోంది. నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలింస్ ఈసారి బడ్జెట్ పరంగా ఎలాతని పరిమితులు విధించడం లేదు. ఒకవేళ అవసరమైతే అటవీ నేపథ్యం కోసం ఆర్ట్ డైరెక్టర్ల సహాయంతో ఖరీదైన సెట్లు వేసేందుకు సైతం ప్లానింగ్ జరిగిందట. ఇంకో రెండు మూడు నెలలు ఆగితే పూర్తి వివరాలు తెలుస్తాయి.

కాంతార తాలూకు ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే ఆస్కార్ నామినేషన్ల చోటు కోసం ప్రయత్నించేదాకా. తెలుగులో పదిహేను రోజులు ఆలస్యంగా రిలీజైనా భారీ కలెక్షన్లు సొంతం చేసుకోవడం చాలా అరుదుగా జరిగే పరిణామం. కాంతార 2లో తండ్రి పాత్రను రిషబే పోషిస్తాడా లేక వేరే హీరోని తీసుకుంటారా అనేది వేచి చూడాలి. శాండల్ వుడ్ స్టాండర్డ్ ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లిన కాంతార లాంటి ప్రయత్నాలు తెలుగులోనూ రావాలి. రచయితలు దర్శకులు ఆ దిశగా ఆలోచించాలి. మాస్ సినిమాలు ఆపాలని కాదు కానీ వైవిధ్యం ఉన్న వాటిని మన ఆడియన్స్ ఆదరించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆ కోణంలో రాసుకుంటే అద్భుతాలు చేయొచ్చు