Idream media
Idream media
తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా ఉంటున్నాయి. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధమే కాదు.. అంతకు మించే హోరాహోరీ నడుస్తోంది. రాజకీయంగానే కాదు.. ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు ఇతర మార్గాలను కూడా ఎంచుకుంటున్నారు. ఈ మధ్యనే జీహెచ్ఎంసీ పరిధిలో కోకాపేటలో ప్రభుత్వం వేసిన వేలంపాటలో భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సీబీఐకి ఫిర్యాదు చేశారు. సుమారు వెయ్యి కోట్ల రూపాయల స్కాంపై వెంటనే విచారణ జరిపి దోషులను పట్టుకోవాలంటు రేవంత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకవైపు తాము అధికారంలోకి వస్తే కేసీయార్ అవినీతిపై విచారణ జరిపి శిక్షలు పడేట్లు చేస్తామని బీజేపీ చీఫ్ బండి సంజయ్ పదే పదే చెబుతున్నారు.
Also Read:హుజురాబాద్ లో కొండా సురేఖ సేఫ్ గేమ్.. కర్ర విరగద్దు, పాము చావద్దు
నిజంగానే కేసీయార్ అవినీతికి పాల్పడ్డారని అనిపిస్తే వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయవచ్చు. కానీ బీజేపీ అలా చేయడం లేదు. కానీ కాంగ్రెస్ ఎంపీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం చడీ చప్పుడు చేయకుండా సీబీఐకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. కోకాపేట భూముల వేలంపాటలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించిన రేవంత్ అందుకు తన దగ్గరున్న కొన్ని ఆధారాలు ఇఛ్చినట్లు సమాచారం. ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా వెబ్ సైట్లో టెండర్లు పిలిచే అవకాశం ఉన్నా అలా పిలవలేదన్నారు. వేలంపాటలో పాల్గొన్న వారి వివరాలను కానీ వారు కోట్ చేసిన ధరలను కానీ ప్రభుత్వం ఎక్కడా ప్రకటించలేదన్నారు. మొత్తం వేలంపాటలో తాను భూములు ఇవ్వాలని అనుకునన్న వారికే దక్కేట్లు కేసీయార్ వ్యవహరించినట్లు చెప్పారు. కేసీయార్ కు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ సహకరించినట్లు ఆరోపించారు.
Also Read:బాపు, వేటూరిలు జీవించి ఉంటే రాధా కృష్ణ పోలికల రాతలకు ఏమయ్యేవారో..?
వేలంపాటలో ఎక్కడా పారదర్శకత పాటించలేదని వేలంపాటలో పాల్గొన్న సంస్థలు అవి దక్కించుకున్న విధానం లాంటి వివరాలను ప్రభుత్వం ప్రకటించలేదన్నారు. మొత్తం భూములను కేసీయార్ కు బినామీలుగా ప్రచారంలో ఉన్న మై హోం గ్రూప్ రాజ పుష్ప గ్రూపులే దక్కించుకోవడమే తన ఆరోపణలకు ఆధారాలుగా రేవంత్ ఫిర్యాదులో చెప్పారు. మరి రేవంత్ ఫిర్యాదుపై సీబీఐ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే. అలాగే దీనికి కౌంటర్ గా టీఆర్ఎస్ ఏం చేస్తుందనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది. గతంలో భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో రేవంత్ జైలుకెళ్లి బెయిలుపై వచ్చారు. ఇప్పుడు రేవంత్ కేసీఆర్ పై సీబీఐకి ఫిర్యాదు చేయడంతో ఏం జరగనుందనేది ఆసక్తిగా మారింది.