హుజురాబాద్ లో కొండా సురేఖ సేఫ్ గేమ్.. కర్ర విరగద్దు, పాము చావద్దు

By Kalyan.S Sep. 09, 2021, 09:30 pm IST
హుజురాబాద్ లో కొండా సురేఖ సేఫ్ గేమ్.. కర్ర విరగద్దు, పాము చావద్దు

తెలంగాణ రాజకీయాల్లో గత కొద్దికాలంగా హుజురాబాద్ ఉప ఎన్నికల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అంతకు ముందు వరకు తెలంగాణ మంత్రివర్గంలో పనిచేసిన ఈటల రాజేందర్ ను భూ కబ్జా ఆరోపణలతో ప్రభుత్వం మంత్రివర్గం నుంచి తొలగించగా ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుని ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన లేదా ఆయన భార్య బీజేపీ తరఫున పోటీ లో దిగుతున్నారని ప్రచారం జరుగుతుండగా టీఆర్ఎస్ కూడా గెల్లు శ్రీనివాస్ యాదవ్ అనే ఒక ఓయూతో సంబంధం ఉన్న నేతని రంగంలోకి దింపింది. ఎలా అయినా గెలిచి తీరాలని కేసీఆర్ ఆదేశించడంతో కొన్నాళ్లపాటు కీలక నేతలు అందరూ ఆ నియోజకవర్గంలో వరుస పర్యటనలు కూడా చేశారు. మరోపక్క అసలు తెలంగాణలో టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి మాత్రం ఇప్పటికి కూడా ఖరారు కాలేదు.

ఆ పార్టీ నుంచి బరిలోకి దిగుతారని భావించిన పాడి కౌశిక్ రెడ్డి ఊహించని విధంగా కార్ ఎక్కడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల కరువయ్యారు. అయితే అనేక సామాజిక సమీకరణాల అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఇక్కడి నుంచి కొండా సురేఖను బరిలోకి దింపాలని నిర్ణయానికి వచ్చారు. కొండా సురేఖతో పాటు చాలా మంది పేర్లు వినిపించినా ఎక్కువగా కొండా సురేఖ పేరు హైలెట్ అయింది. అయితే ఇప్పటివరకు ఈ విషయం మీద ఏమాత్రం స్పందించని ఆమె తాజాగా ఈ విషయం మీద నోరు విప్పినట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి విషయం మీద ఆమె క్లారిటీ గానే ఉన్నారని అంటున్నారు.

హుజురాబాద్ లో టిఆర్ఎస్, భారతీయ జనతా పార్టీలకు గట్టిపోటీ ఇవ్వడం కోసం తనను పోటీ చేయమని పార్టీ పెద్దలు కోరుతున్నారని, అయితే అలా పోటీ చేయడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి తాను తన సొంత నియోజకవర్గానికి వస్తానని అని చెబుతున్నట్లు సమాచారం.. ఎలాగో అక్కడ గెలిచే అవకాశాలు తక్కువే కాబట్టి తనకు తన నియోజకవర్గం వదిలేయాలని, మళ్ళీ ఎన్నికల నాటికి తిరిగి వరంగల్ నుంచే తాను బరిలోకి దిగుతానని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది. అలా అయితే పార్టీకి విధేయురాలు అని పేరు తెచ్చుకోవచ్చు, ఓడితే ఓడాననే సింపతీ కూడా ఉంటుందని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే దీటైన అభ్యర్థి కోసం వెతుకులాటలో పడిన రేవంత్ అండ్ టీం కొండా సురేఖ కోరిన హామీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు మరో ధీటైన అభ్యర్థిని వెతకడం కంటే ఆమె కోరినట్లుగానే నిర్ణయం తీసుకుని ఆమెను బరిలోకి దించడం మేలని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి చూడాలి ఏం జరగబోతుంది అనేది.

Also Read : గ్రేట‌ర్ పై గులాబీ పార్టీ మ‌ల్ల‌గుల్లాలు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp