iDreamPost
android-app
ios-app

వారికి గుడ్ న్యూస్.. రూ. 2 లక్షలు ఇవ్వనున్న రిలయన్స్!

వారికి గుడ్ న్యూస్.. రూ. 2 లక్షలు ఇవ్వనున్న రిలయన్స్!

అత్యధిక జనాభా ఉన్నటువంటి మనదేశంలో పేద, మధ్య తరగతి ప్రజలే ఎక్కువ. ఇంకా దేశంలో కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ పొందలేని స్థితిలో ఎంతో మంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వారి పిల్లలను చదివించడం కత్తి మీద సాము వంటిదే. మరీ ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న ఖర్చులు ఓ వైపు, మరో వైపు పిల్లల చదువులకు అయ్యే ఖర్చులు పెరుగుతుండడంతో పేద కుటుంబాలు సతమతమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో రిలయన్స్ ఫౌండేషన్ శుభవార్తను అందించింది. విద్యార్థుల చదువు కోసం ఏకంగా రూ. 2 లక్షలు అందించేందుకు నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల చదువు డబ్బు లేని కారణంగా ఆగిపోకూడదని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మరి ఈ సాయం పొందడానికి కావాల్సిన అర్హతలు ఏంటీ? ఆ వివరాలు మీ కోసం..

2022లో ధీరూభాయ్ అంబానీ 90వ జన్మదినోత్సవం సందర్భంగా, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగానే రిలయన్స్ ఫౌండేషన్ 2023-24 విద్యాసంవత్సరానికి గాను అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్ షిప్ లకోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 5వేల మందికి స్కాలర్ షిప్ లను అందించనుంది. ఆసక్తి ఉన్న వారు 2023 అక్టోబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. అభ్యర్థులు ఆప్టిట్యూడ్ పరీక్షలో చూపిన ప్రతిభ, 12వ తరగతిలో వారి గ్రేడ్‌లు, కుటుంబ వార్షిక ఆదాయం వంటి వాటిని ప్రామాణికంగా తీసుకుని స్కాలర్ షిప్ లకు ఎంపిక చేస్తారు. ఇక ఈ స్కాలర్ షిప్ లకు ఎంపికైన వారికి రూ. 2 లక్షలు అందించనున్నారు.

ఇక ఈ అంశంపై రిలయన్స్ ఫౌండేషన్ సీఈఓ జగన్నాథ కుమార్ మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువజనులను కలిగిన దేశం. దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే సామార్థ్యం దేశ యువత చేతుల్లోనే ఉంది. రిలయన్స్ ఫౌండేషన్‌లో నాణ్యమైన విద్యకు అవకాశం అందించడానికి మేము పని చేస్తామని ఆయన తెలిపారు. కాగా రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2022-23 విద్యాసంవత్సరంలో అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్ షిప్ కు దాదాపు లక్ష మంది నమదు చేసుకోగా, అర్హత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా 51 శాతం మహిళలు, 97 మంది వికలాంగులకు ఈ స్కాలర్ షిప్ లను అందించారు. పూర్తి వివరాలకు రిలయన్స్ ఫౌండేషన్ అధికారిక వెబ్ సైట్ https://www.scholarships.reliancefoundation.org/ ను సంప్రదించాలని కోరింది.