ఒక ప్రకటన – 38ఏళ్ళ రాజకీయ చరిత్రను మార్చింది.

హఠాత్తుగా నెలల వ్యవదిలో రాష్ట్ర రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయి ఒక సరికొత్త అధ్యాయానికి బీజం పడి సరిగ్గా నేటికి 38 ఏళ్లు. రామారావు పార్టీ పేరుని ప్రకటించడం నాటి రాష్ట్ర రాజకీయల్లో పెను సంచలనం. ఎంత వేగంగా రాజకీయల్లోకి అడుగుపెట్టారో , అంతే వేగంగా ఆటుపొట్లతో వెన్నుపోట్లతో రాష్ట్ర రాజకీయల్లో కనుమరుగయిపోయిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు మాత్రమే అని చెప్పవచ్చు.

సినీ ఫీల్డ్ లో ఒక వెలుగు వెలిగిన ఎన్.టి. రామారావుకు మొదటి నుండి రాజకియాలపై ఆసక్తి ఉండేది, సినిమా రంగంలో తన మిత్రుడైన యం.జి రాంచంద్రన్ పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రానికి తన కరిష్మా తో ముఖ్యమంత్రి పీఠం ఎక్కి కూర్చోవడం. ఆ పై పి.ఏలు పి.యస్ లు, సెక్యురిటీలు, ఎక్కడికి వెళ్ళినా అధికార దర్పం ఆ వైభవాని ప్రత్యక్షంగా చూసిన రామారావు పై ముఖ్యమంత్రి పీఠం తీవ్ర ప్రభావమే చూపింది. దీంతో రాజకీయ రంగ ప్రవేశం పై విలేఖరులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు దాటవేయడం , ముక్తసరిగా సమాధానాలు చెప్పడం మొదలు పెట్టారు, రామారావు కదలికలని పసిగట్టిన కాంగ్రెస్ అధిష్టానం పావులు కదపడం మొదలు పెట్టింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు డిల్లీ లోనే తయారవుతారు అనే విధంగా ముఖ్యమంత్రులను మారుస్తు వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి రామారావుని శాంతింపజేయడానికి ఆయన చిన్ననాటి స్నేహితుడైన భవనం వెంకట్రామిరెడ్డిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చో పెట్టింది. 1978 ఎన్నికల తరువాత ఈయన రాష్ట్రానికి 3వ ముఖ్యమంత్రి . అప్పటికి భవనం వెంకట్రామిరెడ్డి శాసనసభ సభ్యుడు కాకుండా , శాసన మండలి సభ్యుడు అవ్వడం గమనార్హం.

ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన భవనం 1982 ఫిబ్రవరి 24న జరిగిన మంత్రి వర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి రామారావుని ఆహ్వానించడం. అందుకు రామారావు సమ్మతించి మద్రాసు నుండి రావడం నాటి రాజకీయల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజభవన్ లో తొలిసారి అడుగుపెట్టిన రామారావుకి ఆనాటి వేడుకలు , వైభవం మనస్సులో బలమైన ముద్రవేశాయి. రాజకీయ రంగ ప్రవేశానికి మరింత పురికొల్పాయి. దీంతో ఈ కార్యక్రమం అయిన నెల రోజులకే రామారావు రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

1982 మార్చ్ 21 న రామక్రిష్ణా స్టుడియోలో విలేఖరుల సమావేశం పెట్టి నాకు మే 28తో 59 సంవత్సరాలు నిండి 60 లోకి వస్తాను ఇహ ప్రజా జీవితంలోకి వస్తాను అని ఎన్.టి.ఆర్ ప్రకటించారు. ఆ రోజు జరిగిన సమావేశంలో రామారావు ఇంకా ఇలా అన్నారు… పోయిన సంవత్సరం ఊటీలో జరిగిన ఒక పత్రికా సమావేశంలో మీరు ఎం.జి.ఆర్ లాగా రాజకీయాలలో ప్రవేశిస్తారా అని నన్ను అడిగారు, అప్పటి నుండి ఆ విషయం నా మనస్సులో మెదులుతున్నది రాష్ట్ర వ్యాప్తంగా నాకు 900 పైగా అభిమాన సంఘాలు ఉన్నాయి . వారు టెలిగ్రాముల ద్వారా నామీద వత్తిడి అధికం చేసారు అని చెప్పారు . ఆ వెంటనే తదుపరి రోజు మార్చ్ 22- 1982 న చంద్రబాబు తాను పార్టీ మారబోను అని ప్రకటించటమే కాకుండా , రామారావు ఈ రోజు రాజకీయాలలోకి వస్తా అంటున్నారు నేను ఎప్పటినుండో కాంగ్రెస్లో ఉన్నాను . నేను ఉన్న చోటనే ఉంటా అని ప్రకటించారు చంద్రబాబు .( ఈ విషయంగా రామారావు రాజకీయ ప్రవేశం తన సొంత అల్లుడునే మెప్పించలేక పోయింది అని ప్రత్యర్ధి వర్గం నుండి కొంత అవహేళన ఎదుర్కొన్నారు )

సంజయ్ గాంధి విమాన ప్రమాధంతో పూర్తిగా డిల్లీ లో బ్రేకులు పడిన నాదెండ్ల భాస్కర రావు ముఖ్యమంత్రి పీఠం తనకి దక్కలేదని ఆ సమయంలో పూర్తి అసహనంతో ఉన్నారు . దీంతో రామారావు ప్రకటన రాగానే కాంగ్రెస్ పార్టీకి నాదెండ్ల భాస్కర్ రావు రాజీనామా చేశారు . ఆయనతో పాటు ఆదయ్య , రత్తయ్య , నారాయణ వారి పార్టీకి రాజీనామా చేశారు. ఊటీలో సినిమా షూటింగ్ ముగించుకుని 1982 మార్చ్ 29 న హైద్రాబాద్ వచ్చి నేరుగా నాదెండ్ల భాస్కర్ రావు దగ్గరకు వెళ్ళిన రామారావు అక్కడనుండి నేరుగా న్యూ ఎం.ఎల్.ఏ క్వార్టర్స్ కి వెళ్ళి పార్టీ పేరు తెలుగుదేశం అని ప్రకటించారు. రామక్రిష్ణా స్టుడియోస్ లో రామారావు తెలుగుదేశం చిత్రాన్ని ఒక పేపర్ మీద గీసి చక్రం , నాగలి, గుడిసె అక్కడికి వచ్చిన ప్రముఖులకి చూపించి అభిప్రాయం అడిగారు, ఆ ప్రముఖులు బెజవాడ పాపిరెడ్డి గారు , తూర్లపాటి సత్యనారాయణ గారు, యలమంచలి శివాజి, నాదెండ్ల , రతయ్య, ఆదయ్య, నారాయణ , దగ్గుబాటి చెంచురామయ్య ఉన్నారు. 9 ఏప్రిల్ 1982 న పత్రికలకి గీసిన ఈ తెలుగుదేశం జెండా ని విడుదల చేసారు.

1982 ఏప్రిల్ 11 న హైద్రాబాద్ నిజాం గ్రౌండ్స్ లో జరిగిన మొదటి భారీ బహిరంగ సభ తెలుగుదేశానికి ఒకరకంగా ఊపిరి అనే చెప్పాలి, ఈ సభతో ఎన్.టి.ఆర్ ఆనాడు బల ప్రదర్శనకు దిగారు. జనం బొబ్బిలి పులి, సర్ధార్ పాపారాయుడు అంటు నినాదాల మద్య రామారావు ప్రసంగించారు . తెలుగు సినీ పరిశ్రమ ఇంకా హైదరాబాద్ లో శైసవ దశలోనే ఉండటం , హిందీ సినిమాల ప్రభావం అధికంగా హైద్రాబాద్ లో ఉండటంతో రామారావు సభకు ఏమి జనం వస్తారులే అని అనుకున్న వారి ఆలోచనలు పటాపంచలు చేస్తూ కనీవినీ ఎరుగని రీతిలో వచ్చిన జనంతో , ఎన్.టి.ఆర్ మనోధైర్యం రెట్టింపు అయ్యింది .

దీంతో 1982 మే 27, 28 న – రామారావు జన్మదినం సందర్భంగా తిరుపతిలో సభ ఏర్పాటు చేసి దానికి మహానాడు అని పేరు పెట్టారు. జనం తండోప తండాలుగా తిరుపతికి చేరుకున్నారు. తిరుపతి సభ విజయవంతం అయింది. రామారవు పెట్టిన రెండు సభలు విజయవంతం అవ్వడంతో రామారావు జనంలో పడ్డారు . పాత చెవర్లెట్ వ్యాన్ ని మరమత్తులు చేయించి. దానికి చైతన్య రధం అని పేరు పెట్టి పల్లెలలో పట్టనాల్లో తిరగడం మొదలుపెట్టారు. శకరంబాడి సుందరాచారి రాసిన తెలుగుతల్లి, వేములపల్లి శ్రీకృష్ణ ఎప్పుడో రాసిన చేయెత్తి జైకొట్టు తెలుగోడా పాటలను రామారావు తన ప్రచార పాటలుగా ఎంచుకున్నరు. 1983 జనవరి 3న ఎన్నికలు ముగిసే నాటికి సుమారు ఆయన 40వేల కిలోమీటర్లు ఈ రధం పై రాష్ట్రమంతా ప్రచారం చేశారని చెబుతారు.

రూపాయకే బియ్యం అనే నినాదంతో 1967లోనే తమిళనాట అన్నాదురై విజయ ధుందుభి మోగించడంతో తన మ్యానిఫెస్టోలో రామరావు దీనిని ప్రధమంగా చేర్చారు. దీంతోపాటు మధ్యాహ్న భోజన పధకం , పేదవారికి కూడూ గుడ్డ నీడ నినాదాలతో ప్రజలను ఆకర్షించారు . సినీ ప్రభావంతో వచ్చిన వాఖ్చాతుర్యం , హావభావాలను ప్రదర్శించి ప్రజలను మెప్పించారు . యువతని ఆకర్షించి విద్యావంతులకి రాజకీయ బిక్షపెట్టి శాసన సభ్యులుగా పోటీ చేసే అవకాశం కల్పించారు. తిరుపతి సభతో ప్రారంభించిన ఎన్నికల ప్రచారం తిరిగి తిరుపతి సభతోనే ముగించారు . 35ఏళ్ళ దాస్యం నుండి రాష్ట్రాన్ని విముక్తి చేయవల్సిందిగా ప్రజలను రామారావు చివరిసారిగా ఈ సభ ద్వారా కోరారు. మొదటినుండి రామారావుకి విశేష ప్రాధాన్యత ఇచ్చి పూర్తిగా రామారావు పక్షాన వార్తలు రాసిన ఈనాడు రామోజీరావు ఎన్నికల రోజు తెలుగుదేశానికే ఓటు వెయ్యండి అని మొదటిపేజీలో అచ్చు వేసాడు .

Read Also:- టీడీపీ ఆవిర్భావ దినం: మూడున్న‌ర ద‌శాబ్దాల పార్టీకి మ‌నుగ‌డ ముప్పు!

రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 5న పోలింగ్ జరగగా , రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల 13 లక్షల పైచిలుకు ఓటర్లకు గాను, రెండు కోట్ల 15 లక్షల మంది తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. తెలుగుదేశానికి అఖండ విజయం సాదించి పెట్టారు, ఎన్నికల ప్రచారంలో రామారావు ప్రకటించిన పధకాలు ప్రజల్లోకి బాగా చొచ్చుకుని వెళ్లాయి, రామారావు ప్రచారనికి ఏ ప్రాంతానికి వెలితే ఆ ప్రాంత సమస్యలు ఈనాడు రిపోర్టర్స్ రామారావుకి అందించడం అవి రామారావు తన ప్రసంగంలో ప్రజలకు వివరించడం ప్రజలని మరింత ఆకట్టుకున్నాయి. దీంతో ప్రజలు రామారావుకి 203 స్థానాలు కట్టబెట్టారు, కాంగ్రెస్ పార్టీ 60 స్థానాల్తో సరిపెట్టుకున్నది . అప్పటివరకూ తెలుగు చరిత్రలో కనీవినీ ఎరగని విజయం రామారావు సొంతం అయ్యింది . అప్పటివరకు ఉన్న రాష్ట్ర రాజకీయ చరిత్రకు ముగింపు పలికి ప్రాంతీయ పార్టీ అనే సరికోత్త  అధ్యాయం ప్రారంభం అయింది.

Show comments