iDreamPost
iDreamPost
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మొత్తబడ్డారు. టీడీపీ అధినేత బుజ్జగింపులతో దారికొచ్చినట్టే కనిపిస్తోంది. సుమారు రెండేళ్ల తర్వాత ఆయన మళ్లీ టీడీపీ సమావేశానికి పూనుకున్నారు. పార్టీ నిర్మాణానికి సంబంధించి క్యాడర్ తో సమావేశమయ్యి కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాంతో కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న గంటా శ్రీనివాసరావు హఠాత్తుగా పునర్ధర్శనం విశేషంగా మారుతోంది.
వాస్తవానికి గంటా శ్రీనివాసరావు మరోసారి పార్టీ ఫిరాయిస్తున్నారనే ప్రచారం చాలాకాలంగా. ఆయన ప్రయత్నాలు ఆ రీతిలో సాగాయి. నేరుగా బీజేపీ జాతీయ కార్యాలయానికి వెళ్లి ఆపార్టీ నేతలతో భేటీ అయ్యారు. వైఎస్సార్సీపీ నేతలతో అనేకమార్లు మంతనాలు జరిపారు. తనకు అవకాశం ఇస్తే వైఎస్సార్సీపీలో చేరాలని, లేదంటే బీజేపీ బాట పట్టాలన్న ఉద్దేశంతో ఉన్నట్టు సంకేతాలు ఇచ్చారు. పైగా తన సొంత సామాజికవర్గానికి చెందిన కొందరు మాజీలతో కలిసి బీజేపీ లోకి వెళ్లాలనే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు లీకులు ఇచ్చారు. ఇలాంటి అనేకనేకల ప్రయత్నాలు చేసినా ఆయనకు ఫలితం మాత్రం దక్కలేదు. బీజేపీలోకి వెళితే ఏమవుతుందో తెలియక, వైఎస్సార్సీపీలో తలుపులు తెరవక ఆయన తల్లడిల్లిపోయారు.
అదే సమయంలో వ్యక్తిగతంగా గంటాకి కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే ఆస్తుల వేలం వ్యవహారం ముందుకొచ్చింది. ప్రత్యూష కంపెనీ పేరుతో తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో ఇండియన్ బ్యాంక్ అధికారులు ఆన్ లైన్ వేలం ప్రయత్నాలు చేశారు. సుమారుగా రూ.250 కోట్లకు సంబంధించిన ఆస్తుల విషయంలో గంటాకి కూడా వ్యక్తిగతంగా ఈ వ్యవహారం చికాకుగా మారింది. అదే సమయంలో విశాఖలో భూఆక్రమణలో సిట్ నివేదిక సిద్ధమవుతోంది. భారీ స్థాయిలో విశాఖలో భూఆక్రమణల బాగోతంలో పలువురు పెద్దల పాత్ర ఉన్నట్టు నివేదిక తేటతెల్లం చేసే అవకాశం ఉందని సమాచారం. గతంలో గంటా మంత్రిగా ఉండగానే ఆయన తోటి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి అభిప్రాయం ప్రకారం విశాఖలో గంటా కనుసన్నల్లోనే భూదందా సాగింది. దాంతో అదే విషయం సిట్ నివేదికలో ప్రస్తావిస్తే గంటా కష్టాలు రెట్టింపవుతాయి.
ఇప్పటికే జగన్ ప్రభుత్వం దూకుడుగా ఉంది. విశాఖలో పలువురి ఆక్రమణలను తొలగించే ప్రయత్నంలో ముందుకు సాగుతోంది. అదే సమయంలో గంటా భూదందా వ్యవహారం కూడా నివేదికలో వస్తే, ఆతర్వాత ఎలాంటి చర్యలకయినా పూనుకునే అవకాశం ఉంటుందనే అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. దాంతో ఈ సమయంలో టీడీపీలో కొంత యాక్టివ్ పార్ట్ అత్యవసరమని ఆయన ఆలోచిస్తున్నట్టు ప్రచారం మొదలయ్యింది. చంద్రబాబు కూడా న్యాయపరంగా అవసరమైన అండదండలు అందించేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో ఆయన హామీతో గంటా మళ్లీ టీడీపీ దారికొచ్చినట్టు కొందరు భావిస్తున్నారు. ఏమయినా జగన్ ప్రభుత్వ వ్యవహారం తెలిసిన తర్వాత రాజకీయంగా టీడీపీ తప్ప బీజేపీ తనకు అండగా నిలవదనే అంచనాలో గంటా ఉన్నట్టు కొందరి వాదన. అదే సమయంలో బాబు చేదోడు లేకుండా రేపు ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాల తాకిడి నుంచి తప్పించుకోలేమని ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఆక్రమణల తొలగింపునకు కూడా కూడా న్యాయస్థానాల ద్వారా స్టే లు వచ్చిన నేపథ్యంలో గంటా కూడా అలాంటి రక్షణ చర్యలు తనకు ఉపకరిస్తాయని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఏమయినా గంటా తాజా అడుగులు ఆసక్తికరం. టీడీపీకి అది ఏమేరకు, ఆయన ఎంతవరకూ ఆపార్టీలో ఉంటారన్నది కూడా చర్చనీయాంశం.