Idream media
Idream media
లోక్‌సభ, అసెంబ్లీ, పంచాయతీ, మున్సిపల్.. ఇలా ఏ ఎన్నికలు అయినా.. ఎగ్జిట్ పోల్స్ తప్పక ఉంటాయి. ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది..? ఎవరికి ఎంత శాతం ఓట్లు వస్తాయి..? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది..? అనే గణాంకాలతో ప్రాంతీయ, జాతీయ మీడియా సంస్థలు, పలు సర్వే సంస్థలు పోలింగ్ ముగిసిన తర్వాత ప్రకటిస్తుంటాయి. పోలింగ్ రోజున క్షేత్రస్థాయిలో ఓటర్ల నాడిని పట్టేందుకు ఈ సంస్థలు శాయశక్తులా ప్రయత్నిస్తుంటాయి. ఇందులో పలు సంస్థల ఎగ్జిట్‌పోల్స్.. ఎగ్జాట్ పోల్స్‌కు దగ్గరగా ఉంటాయి. వాస్తవ ఫలితాలు ఎలా వచ్చినా.. ఈ ఎగ్జాట్ పోల్స్‌పై ప్రజలు, ఆయా రాజకీయ పార్టీల నేతల్లో ఆసక్తి ఉంటుంది.
అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముగిసిన రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వచ్చేందుకు ఆటంకాలు ఎదురయ్యాయి. ఉభయతెలుగు రాష్ట్రాలతోపాటు, జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన గ్రేటర్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కోసం ఈ నెల 3వ తేదీ సాయంత్రం వరకూ వేచి చూడాల్సిన పరిస్థితి అధికారుల తప్పిదాల వల్ల నెలకొంది. ఓల్ట్ మలక్‌పేట డివిజన్(26)లో రెండు పార్టీల గుర్తులు తారుమారవడంతో పోలింగ్‌ను నిలిపివేశారు. సీపీఐ, సీపీఎం గుర్తులు కంకి కొడవలి, సుత్తి కొడవలి గుర్తు తారుమారు కావడంతో.. ఈ నెల 3వ తేదీన ఇక్కడ రీ పోలింగ్ నిర్వహించనున్నారు.
రీపోలింగ్ పూర్తయ్యే వరకూ ఎగ్జిట్ పోల్స్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. గుర్తులు తారుమారుకావడంపై జీహెచ్‌ఎంసీని ఎన్నికల సంఘం వివరణ కోరింది. ఈ విషయంలో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 3వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ రీ పోలింగ్ పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాతనే మీడియా సంస్థలు, సర్వే టీంలు.. తమ ఎగ్జిట్ పోల్స్‌ను ప్రటించవచ్చు. ఆ మరుసటి రోజు అంటే 4వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ముందు రోజు రాత్రి ఎగ్జిట్ పోల్స్ రానుండగా.. ఉదయం ఎగ్జాట్ పోల్స్ ఫలితాలు వెల్లడికానున్నాయి.