iDreamPost
iDreamPost
నరేంద్రమోడి ప్రభుత్వం కేంద్రంలో పగ్గాలు చేపట్టిన దగ్గర నుండి పారిశ్రామిక దిగ్గజాలు తీసుకున్న వేల కోట్ల రూపాయల అప్పులను బ్యాంకులు రద్దు చేసేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని లక్షల రూపాయల రానిబాకీల పద్దుల్లో రద్దు చేయగా తాజగా ఆర్బిఐ కూడా రూ. 68,807 కోట్ల అప్పులను రద్దు చేయటం సంచలనంగా మారింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆర్బిఐ రద్దు చేసిన బకాయిలన్నీ ఇప్పటికే కేసులు ఎదుర్కొటున్న పారిశ్రామికవేత్తలవే కావటం.
బ్యాంకుల నుండి వందల నుండి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని ఎగొట్టిన చోక్సి, విజయామాల్య, ట్రాన్స్ ట్రాయ్, డెక్కన్ క్రానికల్ లాంటి అనేక సంస్ధలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. చోక్సీ, విజయామాల్య లాంటి పారిశ్రామికవేత్తలయితే ఏకంగా విదేశాలకే పారిపోయారు. వాళ్ళు తిరిగి దేశంలోకి రావాలంటే అప్పులు తిరిగి కట్టేయాలని, అప్పులు ఎగొట్టి పారిపోయినందుకు శిక్షలు అనుభవించాలనే విషయమై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి.
తమ అప్పులు తిరిగి చెల్లించేందుకు ఒకవైపు చోక్సీ, విజయామాల్య లాంటి పారిశ్రామికవేత్తలు ఒకవైపు బ్యాంకులతో ఒన్ టైం సెటిల్మెంట్ కు చర్చలు జరుపుతున్నారు. ఈ సమయంలో వాళ్ళ అప్పులను ఆర్డిఐ ఏకపక్షంగా మాఫీ చేసేయటం విచిత్రంగా ఉంది. గీతాంజలి జెమ్స్ సంస్ధకు రూ. 5492 కోట్లు, కింగ్ ఫిషర్ ఎయిర్ లెన్స్ కు రూ. 1942 కోట్ల అప్పు రద్దయిపోయింది. మొత్తం 50 మంది పారిశ్రామికవేత్తలు చెల్లించాల్సిన అప్పులను ఆర్బిఐ రద్దు చేసేసింది.
ఇదే విషయమై కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ బిజెపితో సన్నిహిత సంబంధాలున్న పారిశ్రామికవేత్తల అప్పులనే ఆర్బిఐ రద్దు చేసిందని మండిపోయారు. బ్యాంకుల్లో అప్పులు తీసుకుని ఎగొట్టిన వాళ్ళ 50 మంది జాబితాను బయటపెట్టమని లోక్ సభలో రాహూల్ గాంధి ఓ ప్రశ్నవేశాడు. అయితే ఆర్దికమంత్రి నిర్మల సీతారామాన్ బదులిస్తు గోప్యత కారణంగా ఇటువంటి విషయాలను బయటకు ప్రకటించలేమని చెప్పటం విచిత్రంగా ఉంది. బ్యాంకుల్లో అప్పులు తీసుకుని ఎగొట్టిన వాళ్ళ జాబితాను ప్రకటించలేమని కేంద్రమంత్రి ప్రకటించటంలో అర్ధమేంటి ?
ఎప్పుడైతే నిర్మల జాబితాను బయటపెట్టటానికి ఇష్టపడలేదో ఓ సమాచార హక్కు చట్టం కార్యకర్త ఆర్బిఐకి దరఖాస్తు చేసుకున్నాడు. దాంతో బ్యాంకుల్లో అప్పులు ఎగొట్టిన 50 మంది జాబితాను ఆర్బిఐ కార్యకర్తకు అందించింది. అంటే ఒకవైపు కేంద్ర మంత్రి జాబితా ప్రకటించం సాధ్యం కాదని చెప్పినా మరోవైపు ఆర్బిఐ మాత్రం జాబితాను ఇచ్చేసింది. బ్యాంకుల్లో తీసుకున్న వేల కోట్లరూపాయలు అప్పులను ఉద్దేశ్యపూర్వకంగా ఎగొట్టే వాళ్ళకే కేంద్రం కూడా వత్తాసు పలుకుతోంది. అదే నిండా అప్పుల్లో ముణిగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల అప్పులను మాత్రం రద్దు చేయటానికి కేంద్రానికి మనసు రావటం లేదు.