బిజెపి అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు నిరసనలు జరగుతున్న విషయం తెలిసిందే. రాంచీలోని కొన్ని ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక గొడవల్లో ఇద్దరు మరణించగా, మరో 20 మందికి పైగా గాయపడ్డారు. నిరసనకారులంతా నుపుర్ శర్మను అరెస్టు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు
రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో అబ్సర్ అనే యువకుడు చికిత్స పొందుతున్నాడు. అతను మార్కెట్ నుంచి వస్తుండగా జరిగిన గందరగోళంలో బుల్లెట్లు తగిలాయి. సదరు వ్యక్తి నిరసనలో పాల్గొనలేదని, ప్రజలు రాళ్ళు రువ్వినందుకు ప్రతిచర్యగా పోలీసులు కాల్పులు జరపడాన్ని చూశానని పేర్కొన్నాడు.
పోలీసుల కాల్పుల్లో యువకుడికి 6 బుల్లెట్లు తగలగా, 4 బుల్లెట్లు బయటకు తీశారు. ఇంకా 2 బుల్లెట్లు అతని శరీరంలోనే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇతనితో పాటు నిరసనలో పాల్గొనని మరో వ్యక్తి తబరక్ సైతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
గాయపడిన 22మందిలో 10మంది పోలీసులు, తక్కిన ఆందోళనకారులు ఉన్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మూకలో ఉన్న నిరసనకారులు రాళ్ళు విసిరిన తురవాత వారిని నియంత్రించేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి లాఠీఛార్జ్ చేశారు.