iDreamPost
iDreamPost
సినిమాల్లో ట్రిపుల్ రోల్ చాలా అరుదు. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ, అప్పుడెప్పుడో చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు, అంతకుముందు అన్న ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ లాంటివి తప్ప మరీ గుర్తుంచుకోదగ్గవి చాలా తక్కువ. సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లోనూ అలాంటి చెప్పుకోదగ్గ చిత్రం ఒకటుంది. ఆ ముచ్చట్లు చూద్దాం. 1969 తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా ‘దైవ మగన్’ వచ్చింది. ఏసి త్రిలోకచందర్ దర్శకులు. కమర్షియల్ గానూ ఈ మూవీ గొప్ప విజయం అందుకుంది. వంద రోజుల ప్రదర్శనతో పాటు ఆ సంవత్సరం ఆస్కార్ కు నామినేట్ చేయబడింది. మూడు పాత్రల్లో శివాజీగణేశన్ నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు.
దీన్ని తెలుగులో కోటీశ్వరుడు పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు కానీ ఒరిజినల్ వెర్షన్ అంత ఫలితం దక్కలేదు. కట్ చేస్తే 14 ఏళ్ళ తర్వాత కృష్ణతో ఇది రీమేక్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన రవికళామందిర్ బ్యానర్ అధినేతలకు కలిగింది. వెంటనే ఆ ప్రతిపాదన కృష్ణ దగ్గరకు తీసుకెళ్లారు. అప్పటికే ఇండస్ట్రీలో చిరంజీవి లాంటి కొత్త రక్తం పారుతోంది. మరింత ఛాలెంజింగ్ పాత్రల కోసం చూస్తున్న కృష్ణ ముందు చేయడానికి ఆలోచించారు కానీ తన డిస్ట్రిబ్యూటర్లు, మిత్రులు అందరూ బాగుంటుందని సలహా ఇవ్వడంతో ఓకే చెప్పేశారు. దర్శకత్వ బాధ్యతలు నిజజీవిత భాగస్వామి విజయనిర్మల తీసుకున్నారు. టైటిల్ గా రక్త సంబంధం ఫిక్స్ చేశారు.
జయంతి, రాధ ఆయనకు జోడిగా గిరిబాబు, సత్యనారాయణ, సుత్తివేలు, సుత్తి వీరభద్రరావు, అన్నపూర్ణ, రమాప్రభ తదితరులు ఇతర తారాగణంగా ఎంపికయ్యారు. చక్రవర్తి సంగీతం సమకూర్చగా విఎస్ఆర్ స్వామి ఛాయాగ్రహణం అందించారు. సత్యానంద్ కొన్ని కీలక మార్పులతో స్క్రిప్ట్ కి సంభాషణలు రాశారు. తన వికృత రూపమే కొడుక్కు వస్తే అతన్ని దూరం చేసుకుంటాడు కన్నతండ్రి. మరో బిడ్డ చక్కగా పుడతాడు. అయితే చనిపోయాడనుకున్న పెద్ద కొడుకు తిరిగి వచ్చి తన పరువుని, కుటుంబగౌరవాన్ని కాపాడి ప్రాణాలు వదలడంతో కథ ముగుస్తుంది. 1984 ఫిబ్రవరి 16 విడుదలైన రక్తసంబంధం గుర్తుండిపోయే గొప్ప విజయం కాదు కానీ కృష్ణ మరపురాని చిత్రాల్లో స్థానం సంపాదించుకుంది. మహేష్ బాబు ఆ మధ్య దీని ప్రస్తావనే కోటీశ్వరుడు ప్రోగ్రాంలో తీసుకొచ్చారు
Also Read : 1996 Sankranthi Tollywood Releases : పెద్ద హీరోల పోటీ మధ్య చిన్న ఆర్టిస్టు ఇండస్ట్రీ హిట్టు – Nostalgia