iDreamPost
iDreamPost
ఈ నెల 19వ తేదీన జరగబోయే రాజ్యసభ ఎన్నికలు చంద్రబాబునాయుడు నాయకత్వానికే అసలైన పరీక్షగా నిలవబోతున్నాయి. ఎప్పుడో జరగాల్సిన రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. నిజానికి ఏపిలో నాలుగు స్ధానాలకు ఖాళీలు ఏర్పడినపడు అవన్నీ అధికార వైసిపి ఖాతాలో ఏకగ్రీవంగా పడతాయన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే చంద్రబాబు చేసిన అతితెలివి వల్ల ఎన్నికలు అనివార్యమయ్యాయి.
ఏకగ్రీవంగా జరగాల్సిన ప్రక్రియను చంద్రబాబు చివరకు ఓటింగ్ దాకా తీసుకొచ్చాడు. ఏరకంగా చూసినా గెలుపు అవకాశమే లేదని తెలిసినా తెలుగుదేశంపార్టీ తరపున వర్ల రామయ్యను పోటిలోకి దింపాడు. దాంతో వైసిపి అభ్యర్ధులతో పాటు వర్ల కూడా నామినేషన్ వేశాడు. వైసిపి తరపున ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణ, పారిశ్రామికవేత్తలు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని నామినేషన్లు వేశారు.
ఒక్కో రాజ్యసభ ఎంపి గెలవాలంటే 35 ఎంఎల్ఏల ఓట్లు అవసరం. ఈ లెక్కన వైసిపి నలుగురు అభ్యర్ధులు గెలవటానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవన్న విషయం అందరికీ తెలిసిందే. మరి టిడిపి అభ్యర్ధి పరిస్ధితి ఏమిటి ? టిడిపి తరపున 23 మంది ఎంఎల్ఏలు గెలిచిన విషయం తెలిసిందే. అయితే వివిధ కారణాలతో ఇప్పటికే ముగ్గురు పార్టీకి దూరమయ్యారు. మిగిలిన 20 మంది ఎంఎల్ఏల్లో కూడా మరికొందరు పార్టీకి దూరమైపోవటం ఖాయమనే ప్రచారం అందరికీ తెలిసిందే.
పార్టీ తరపున ఏడుగురు ఎంఎల్ఏలు బయటకు వచ్చేస్తారనే ప్రచారం ఉన్నప్పటికీ అందులో నిజమెంతో ఇప్పటికిప్పుడు చెప్పేందుకు లేదు. కాకపోతే చంద్రబాబుపై కొందరు ఎంఎల్ఏల్లో అసంతృప్తి ఉన్న విషయం అయితే వాస్తవం. ఇటువంటి నేపధ్యంలో అనివార్యమయ్యే ఎన్నికల్లో పార్టీ పరువుపోగొట్టుకోవటం తప్పే జరిగేదేమీ ఉండదు. ఎందుకంటే పార్టీకి దూరమైన ముగ్గురు ఎంఎల్ఏలు వర్లకు ఓట్లు వేయరనే అనుకుందాం. మరి మిగిలిన 20 ఓట్లయినా వర్లకు పడాలి కదా, పడతాయా ?
ఇక్కడే చంద్రబాబుతో పాటు నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. పడతాయని అనుకుంటున్న 20 ఓట్లు కూడా పడకపోతే చంద్రబాబు పరువు సాంతం కృష్ణానదిలో కలిసిపోవటం ఖాయం. ఎన్నికల్లో మిస్సయ్యే ఓట్లే తర్వాత బాహాటంగా పార్టీకి దూరమయిపోతాయనే ప్రచారం ఊపందుకుంటోంది. దీంతో వర్లను పోటికి దింపటం ఎంత పెద్ద తప్పో అందరికీ అర్ధమవుతుంది. పార్టీ ఓట్లు అన్నీ వర్లకు పడకపోయినా చంద్రబాబు చేయగలిగేది ఏమీ ఉండదు. ఎందుకంటే పార్టీ తరపున జారీ చేసే విప్ రాజ్యసభ ఎన్నికల్లో చెల్లదని అధికారవర్గాలు చెబుతున్నాయి. కాబట్టి రాజ్యసభ ఎన్నికలు చంద్రబాబు నాయకత్వానికే అసలైన పరీక్షనటంలో సందేహమే లేదు.