iDreamPost
iDreamPost
రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. ఏపీ అసెంబ్లీకి చెందిన 175 మంది ఎమ్మెల్యేలకు గానూ 173 మంది తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు. జనసేన తరుపున గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా తన ఓటు వినియోగించుకున్నారు. ఆయన కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థులకు జై కొట్టారు. టీడీపీ తరుపున గెలిచిన 23 మందిలో 21 మంది ఓటు వేశారు. ఇద్దరు సభ్యులు ఓటింగ్ కి దూరంగా ఉన్నారు. వారిలో అచ్చెన్నాయుడు అవినీతి కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉండగా, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మాత్రం తాను హోం క్వారంటైన్ లో ఉన్నాననే పేరుతో పోలింగ్ కి దూరంగా ఉన్నారు. అయితే ఆయన ప్రకటన మీద పలు సందేహాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో టీడీపీని వ్యతిరేకించిన ముగ్గురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాం మాత్రం ఓటింగ్ గడువు ముగుస్తున్న కొద్ది క్షణాల ముందు వారు తమ ఓటు వినియోగించుకున్నారు.
అనగాని సత్యప్రసాద్ ప్రకటన మీద పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి కరోనా పాజిటివ్ గా తేలిన మధ్యప్రదేశ్ కి చెందిన కునాల్ చౌదరి అనే ఎమ్మెల్యే తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. భోపాల్ లో జరిగిన పోలింగ్ లో ఆయన నేరుగా ఆస్పత్రి నుంచి పీపీఈ కిట్ లో వచ్చి ఓటు వేశారు. ఆయన వస్తున్న సమయంలో సమాచారం ముందుకు అందించడంతో యంత్రాంగం తగిన జాగ్రత్తలు తీసుకుంది. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్ కేసుగా ఉన్న ఎమ్మెల్యే మధ్యప్రదేశ్ లో ఓట హక్కు వినియోగించుకుంటే, ఏపీలో మాత్రం అనగాని సత్యప్రసాద్ కేవలం తాను కాంటాక్ట్ గా ఉన్నానని చెప్పి, ఓటు వేయడానికి ముందుకు రాకపోవడం టీడీపీ నేతలను కూడా విస్మయానికి గురిచేస్తోంది
Also Read: చెల్లని ఓటుతో బాబు కి మరో ఝలక్ ఇచ్చిన ఆ ఎమ్మెల్యే ఎవరు?
ఇప్పటికే అనగాని పార్టీ మారుతున్నట్టు పలుమార్లు ప్రచారం సాగింది. మొదట్లో ఆయన బీజేపీ నేతలతో ఢిల్లీ వెళ్లి భేటీ అయ్యారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీకి టచ్ లోకి వెళ్లారు. కానీ ఇప్పటి వరకూ తుది నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపించడం లేదు. కానీ తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని అమలు చేయకుండా ఆయన మనసులో మాటను బయటపెట్టుకున్నట్టు కనిపిస్తోంది. త్వరలో టీడీపీకి ఆయన మరింత దూరమయ్యే అవకాశాలను ఇది రూఢీ చేస్తోంది. అనగాని చెప్పిన నాయకుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ జరిగి వారం రోజులయ్యింది. నిజంగా అనుమానం ఉంటే ఇప్పటికే పరీక్షలు చేయించుకుంటే అనగానికి రిపోర్ట్ వచ్చి ఉంటుంది. కాబట్టి ఆయన క్వారంటైన్ పేరు చెప్పడం కేవలం దూరంగా ఉండాలనే నిర్ణయానికి సాకుగా వాడుకున్నట్టు సందేహిస్తున్నారు. తద్వారా టీడీపీ ప్రయోజనం లేని , ఫలితం రాని పోటీకి దిగి పరువు కోల్పోవడానికి తన కంట్లో తానే పొడుచుకున్నట్టుగా మారిందని చెబుతున్నారు.
Also Read: ముగిసిన రాజ్యసభ పోలింగ్ : అందరి దృష్టి ఆ నలుగురిపైనే..!
వర్ల రామయ్యను బరిలో దింపి చేసిన ప్రయత్నం ఆపార్టీ పరువు తీసినట్టుగా కనిపిస్తోంది. 23 మంది ఎమ్మెల్యేలున్న పార్టీ అభ్యర్థికి కేవలం 17 మంది ఓట్లు మాత్రమే దక్కడానికి అవకాశం చూస్తుంటే ఆపార్టీ బలం కుచించుకుపోతున్నట్టు కనిపిస్తోంది. గెలవడానికి 36 ఓట్లు కనీసంగా కావాల్సిన సమయంలో సగం ఓట్లు కూడా లేకుండా పోటీ చేసి భంగపాటుకి గురయినట్టు కనిపిస్తోంది. దళిత కార్డ్ ప్రయోగించాలని చూసిన బాబు చరిత్ర దానికి భిన్నంగా ఉండడంతో అంతా చీదరించుకునే పరిస్థితి ఏర్పడింది. సొంత పార్టీ నేతలు కూడా విశ్వసించలేకపోవడంతో చివరకు రాజ్యసభ ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్ గా ఎవరూ కనిపించలేదని చెబుతున్నారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ బలం 151 నుంచి 155కి పెరిగడం ఖాయంగా ఉంది. దాంతో టీడీపీ వ్యూహం చేతులు కాల్చుకోవడానికే తప్ప కలిగిన ప్రయోజనం ఏమీ లేదని భావిస్తున్నారు.వాస్తవానికి ఇలాంటి సమయంలో ఎన్నికల వరకూ పరిస్థితిని తీసుకురావడం చంద్రబాబు తప్పిదం అని టీడీపీ నేతలే తలలు పట్టుకునే పరిస్థితి వస్తోంది.