వివాహం అనగానే దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం, కట్టుబాట్లు ఉంటాయి. వారి ప్రాంతానికి తగ్గట్లుగా ఎన్నో ఏళ్ళుగా అలా కొనసాగుతూనే ఉంటాయి. అయితే పరిస్థితుల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి. ఇప్పుడు అలాంటి కొత్త నిబంధనతో కూడిన సంప్రదాయాన్నే ప్రారంభించింది రాజస్థాన్ లోని ఒక పంచాయతీ.
రాజస్థాన్ లోని కుమావత్ వర్గం కొత్తగా పెళ్ళికాబోయే వరుడికి చిత్రమైన నియమం పెట్టింది. గడ్డంతో ఉన్న పెళ్ళకొడుకును వివాహానికి అనుమతించకూడదని తీర్మానం చేసింది. ఫ్యాషన్ గా ఉండటం బాగుంటుందని, కానీ ఆ పేరుతో గడ్డాలతో కనిపించడం సరికాదంటున్నారు. వివాహం ఒక సంస్కారంతో జరిగే ప్రక్రియ అని, అందులో వరుడు ఒక రాజులా కనిపించాలనే ఉద్దేశంతో క్లీన్ గా షేవ్ చేసుకొని ఉండాలని అంటున్నారు.
అలాగే, వివాహాలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో చేసే ఖర్చుల్ని కూడా అదుపులో ఉంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గుర్రంపై చేసే డీజే డ్యాన్సులను సైతం నిషేధించింది ఈ వర్గం. వీటితో పాటు వధువు ధరించే బంగారు, వెండి ఆభరణాలు.. వేడుకల్లో వడ్డించే ఆహార పదార్థాల సంఖ్యను సైతం పరిమితం చేయాలని కూడా తీర్మానించింది.
ఈ రోజుల్లో వివాహాలు విలాసవంతంగా మారడం వల్ల మధ్య, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారుతోందని, ఆ భారాన్ని తగ్గిస్తూ, తమ ఆచారాల ప్రకారం వివాహం జరిపించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. తమ సంఘానికి సంబంధించిన వారు ఈ దేశంలో 20వేల మంది వరకు ఉంటారని, వారంతా ఈ నియమాల్ని కచ్చితంగా పాటించాలని అన్నారు.