iDreamPost
iDreamPost
ఒకరితో చేయాలనుకున్న సినిమా వేరొకరితో తీయడం దర్శక నిర్మాతలకు చాలా సార్లు అనుభవమే. ఒకోసారి ఆది గొప్ప ఫలితాలను ఇస్తే మరోసారి తేడా కొట్టిస్తుంది. ముఖ్యంగా వేరే భాషలో హిట్ అయిన వాటిని స్టార్ హీరోలు మిస్ అవ్వడం దానిని మరొకరు అందుకుని చేయడం ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. 1988లో మలయాళంలో మమ్ముట్టి హీరోగా ‘ఒరు సిబిఐ డైరీ కురిప్పు’ అనే సినిమా వచ్చింది. బ్లాక్ బస్టర్ టాక్ తో కొత్త రికార్డులు నెలకొల్పింది ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ అల్లుకున్న కథకు దర్శకుడు మధు స్క్రీన్ ప్లే కట్టిపారేసే విధంగా ఉండటంతో ప్రేక్షకులు ఎగబడి చూశారు.
దీన్ని చూసిన రాజశేఖర్ తెలుగులో రీమేక్ చేయాలనీ ట్రై చేస్తే అప్పటికే ఆ హక్కులు అల్లు అరవింద్ కొనేసి చిరంజీవి కోసం రిజర్వ్ లో ఉంచుకున్నాడు. అయితే ఆ టైంలో నాలుగేళ్ల దాకా గ్యాప్ లేనంత బిజీగా చిరంజీవి డేట్లు బ్లాక్ అయిపోయాయి. అంత లేట్ చేస్తే సబ్జెక్టు డ్రై అవ్వొచ్చు లేదా ఎవరైనా కాపీ కొట్టి లేనిపోని తలనెప్పులు తేవొచ్చు. ఇలా ఆలోచిస్తూ ఉండగా చిరంజీవే అంత వెయిట్ చేయడం ఎందుకు ఇలాంటి కథకు రాజశేఖర్ బాగా సూట్ అవుతాడు కదా అని రికమండ్ చేశాడు.
అప్పటికే చిరుతో ఆరాధన సినిమాలో కలిసి నటించిన అనుభవం ఉంది రాజశేఖర్ కు. దీంతో ఈ ప్రతిపాదన హీరో దగ్గరకు వెళ్ళింది. ఇంకేముంది వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు మంచి సినిమా మిస్సయ్యిందే అని బాధ పడుతున్న రాజశేఖర్ ఇంకేమి ఆలోచించకుండా ఓకే చెప్పాడు. అప్పటికే రీమేక్స్ లో మంచి పేరు తెచ్చుకున్న రవిరాజా పినిశెట్టి దర్శకుడిగా హోమ్లీ బ్యూటీ సీత హీరోయిన్ గా సినిమా తీశారు. ‘న్యాయం కోసం’ టైటిల్ తో రూపొందిన ఈ మూవీ పేరైతే తెచ్చుకుంది కానీ రాజశేఖర్ కోరుకున్న స్థాయిలో మలయాళం రేంజ్ హిట్ కాలేదు. ఒకవేళ చిరంజీవి చేసుంటే ఏమయ్యేదో కానీ రాజశేఖర్ కోరిక మాత్రం అనుకోకుండా ఆ విధంగా తీరింది.