Idream media
Idream media
అక్కినేని నాగేశ్వరరావు హీరోగా 1962లో వచ్చిన సిరిసంపదలు సినిమాకి కె.రాఘవేంద్రరావు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. పి.పుల్లయ్య డైరెక్టర్. ఈ సినిమా క్లైమాక్స్‌లో ANR మారువేషం సీన్ ఉంటుంది. పిల్లిగడ్డం అతికించుకుని వస్తే హీరోయిస్ సావిత్రి గుర్తు పట్టదు. రాఘవేంద్రరావుకి అప్పటి నుంచే మారువేషాలపై ఇష్టం కలిగినట్టుంది. ఆయన సినిమాల్లో కూడా ఈ మారువేషాల క్లైమాక్స్‌లుంటాయి. (అడవి రాముడు, వేటగాడు)
సిరిసంపదలు సినిమాకి అత్తారింటికి దారేదికి చిన్నపోలికలు ఉంటాయి. నాగయ్యకు ఒక కొడుకు, కూతురు. ఒక సందర్భంలో అల్లుడు (ఏవీ సుబ్బారావు జూనియర్) మామతో మనస్పర్థ వచ్చి భార్యను తీసుకుని వెళ్లిపోతుంటే మామ నాగయ్య అడ్డుపడతాడు. అల్లుడు తోసేస్తాడు. ఆయన కిందపడి చనిపోతాడు. దాంతో తండ్రి చావుకి కారణమైన చెల్లెలు భర్తని గుమ్మడి ద్వేషిస్తాడు.
అత్తారింటికి దారేదిలో బొమన్ ఇరానీ సీన్ గుర్తుందా? ఆశ్చర్యంగా నాగేశ్వరరావుకి ముగ్గురు మరదళ్లు. పవన్‌కల్యాణ్‌కి ముగ్గురు మరదళ్లు. ద్వేషిస్తున్న మామ గారి కుటుంబాన్ని హీరో చక్కదిద్దుతాడు. పవన్ అదే పనిలో ఉంటాడు. క్లైమాక్స్‌లో ANR , పవన్ ఇద్దరూ మారువేషాలు వేస్తారు.
సిరిసంపదలు స్లోగా నడిచినా మాస్టర్ వేణు 2 హిట్ సాంగ్స్ ఇచ్చాడు. ఎందుకో సిగ్గెందుకో (శ్రీశ్రీ), ఈ పగలూ రేయిగా (ఆత్రేయ).
పి.పుల్లయ్య భార్య శాంతకుమారి, హీరో తల్లిగా నటించారు. చలం, రేలంగి, రమణారెడ్డి, రాజనాల ఉన్నప్పటికీ కామెడీ, విలనీ రెండూ ఉండవు. ఫ్యామిలీ డ్రామాగా నడిచిపోతూ ఉంటుంది. ANR, సావిత్రిలకి నటించే అవకాశం ఉన్నా బలమైన సీన్స్ ఉండవు.
విడిపోయిన కుటుంబాలని కలపడం ఎప్పుడూ హిట్ జానరే. జీవితంలో చాలా చిన్న కారణాలు ఒక్కోసారి మనుషుల్ని శాశ్వతంగా విడదీస్తాయి. కలిసిపోవాలని ఉన్నా ఏదో ఇగోలు అడ్డొస్తాయి. ఈ నాటకీయత కరెక్ట్‌గా వర్కవుట్ అయితే ఈ లైన్ Safe.
ఆ కాలంలో ఒక చిన్న Thin line తీసుకుని దానిమీద 3 గంటలు తీసేవాళ్లు. పెద్దగా సంఘర్షణలు లేని ఈ సినిమా ఇప్పుడు బోరు కొడుతుంది గానీ, Forword చేసుకుంటూ చూస్తే అక్కడక్కడ మంచిసీన్స్ తగుల్లాయి.
డబ్బు సంపాదించడంలో తెలివి తేటలున్న రాజనాల, తన ఆత్మ రూపంలో ANR గడ్డం పెట్టుకుని వస్తే కనుక్కోలేడు. అంతటి విలన్ కూడా తనకి ఆత్మ ఉందని నమ్మడమే విశేషం.