iDreamPost
iDreamPost
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి ఏకంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద గురిపెట్టింది. గత కొంతకాలంగా ప్రభుత్వానికి, ఎస్ ఈ సీకి మధ్య తగాదా అందరికీ తెలిసిందే. ముఖ్యంగా స్థానిక ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్న ఎస్ ఈ సీ నిమ్మగడ్డ వ్యవహారంపై అప్పట్లో సీఎం భగ్గుమన్నారు. ఆ తర్వాత సుప్రీంకోర్ట్ కి కూడా వెళ్లినప్పటికీ ప్రభుత్వం ఆశించిన ఫలితం రాలేదు. అయినప్పటికీ ఈలోగా కరోనా వ్యాపించడంతో ఈ వ్యవహారం చల్లబడినట్టేనని అంతా భావించారు. కథ ముగిసినట్టేనని భావిస్తున్న తరుణంలో హఠాత్తుగా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది.
అనూహ్యంగా జగన్ ఈ విషయాన్ని మరోసారి తెరమీదకు తీసుకురావడం చర్చనీయాంశంగా మారుతోంది. ఎన్నికల కమిషనర్‌గా రమేష్‌కుమార్ తొలగింపు నకు రంగం సిద్ధం చేయడం విశేషం. దానికి అనుగుణంగా ఆర్డినెన్స్ సిద్ధం అయినట్టు తెలుస్తోంది. రెండు రహస్య జీవోలను విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్ ఆమోదం కూడా తీసుకున్నట్టు సమాచారం. దాంతో ఎస్ ఈ సీ నియామకాల్లో మార్పులతో 1994 నాటి చట్టానికి సవరణ తీసుకొస్తున్నట్టు కనిపిస్తోంది. అదే జరిగితే ఇప్పటి వరకూ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారికి ఎస్ ఈ సీగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉండగా, ఇకపై కేవలం హైకోర్ట్ జడ్జీల స్థాయి వారికి మాత్రం అలాంటి అర్హత ఉంటుందని చెబుతున్నారు.
వాస్తవానికి ఎన్నికల వాయిదా, అనంతరం సీఎం వ్యాఖ్యలు, సుప్రీంతీర్పుతో కథ ముగిసినప్పటికీ ఆ తర్వాత కూడా నిమ్మగడ్డ చేసిన ప్రయత్నాలే ప్రభుత్వానికి ఆగ్రహం రప్పించింది. ముఖ్యంగా ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని కేంద్రం హోం శాఖకు లేఖ రాయడం, తనకు రక్షణ కల్పించడం అనే అంశంతో సరిపెట్టకుండా రాజకీయంగా కూడా విమర్శలు చేసిన వైనమే ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలకు మూలంగా కనిపిస్తోంది. ఏపీ ఎన్నికల కమిషనర్ నియామక అర్హత నిబంధనలను మారుస్తూ… ప్రభుత్వ ఆర్డినెన్స్ ఫైల్‌కు గవర్నర్ ఆమోదం కూడా తెలపడంతో ఇక రమేష్ కుమార్ కథ ముగిసినట్టేనని చెప్పకతప్పదు. గవర్నర్ ఆమోదంతో విడుదలయిన ఈ జీవోను ప్రభుత్వం ప్రస్తుతానికి రహస్యంగా పెట్టింది.నిబంధనలు మారిన నేపథ్యంలో రమేష్ కుమార్ ని తొలగించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. దాంతో ఆయన్ని తొలగిస్తూ మరో జీవో కూడా విడుదల చేసినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం రెండు జీవోలు రహస్యంగా ఉండడంతో పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి.
రాజ్యాంగంలోని 243 (కె) నిబంధన ప్రకారం ఎలక్షన్ కమిషనర్ తొలగింపు అంత సులభం కాదని నిమ్మగడ్డ వర్గం భావిస్తోంది. ఒకసారి బాధ్యతలు చేపట్టాక పూర్తి కాలం పదవిలో ఉంటారని, మధ్యలో తొలగించాలంటే విస్పష్టమైన కారణం ఉండాలని, ఇందుకు సంబంధించి 243 (కె) నిబంధనలున్నట్టు చెబుతున్నారు. టీడీపీ, సీపీఐ నేతలు కూడా ఇప్పటికే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రమేష్ కుమార్ కి తలుపులు మూసుకుపోయినట్టేననే వాదన వినిపిస్తోంది.
విచక్షణాధికారం పేరుతో ఎస్ ఈ సీ వ్యవహారానికి ప్రతిగా విచక్షణాధికారం వినియోగించిన జగన్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడంతో నిమ్మగడ్డ కథ కంచికి చేరినట్టేనని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. చట్టంలో మార్పులు వస్తున్న నేపథ్యంలో త్వరలో రాష్ట్ర ఎన్నికల సంఘంలో పెను మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. జగన్ వేసిన బౌన్సర్ తో ఇప్పటికే మండలి రద్దు వ్యవహారం టీడీపీకి మింగుడుపడలేదు. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం రూపంలో చేసిన ప్రయత్నాలకు కూడా విరుగుడు మంత్రం పఠించడంతో రాజకీయంగా పెద్ద చర్చకు ఆస్కారం ఏర్పడుతోంది.