iDreamPost
android-app
ios-app

చంద్రబాబు టీడీపీ రంగప్రవేశం.. ఆ ఎమ్మెల్యే నిష్క్రమణ ..అంతా 100 రోజుల్లోనే !!!

  • Published Apr 07, 2020 | 3:30 PM Updated Updated Apr 07, 2020 | 3:30 PM
చంద్రబాబు టీడీపీ రంగప్రవేశం.. ఆ ఎమ్మెల్యే నిష్క్రమణ ..అంతా 100 రోజుల్లోనే !!!

పుంగనూరు- పెద్దగా రాజకీయ ప్రాధాన్యత లేని నియోజకవర్గం. 2009 నియోజకవర్గాల పునఃవిభజనతో మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి పీలేరు నుంచి పుంగనూరుకు మారారు. ఇప్పుడు మీడియాలో పుంగనూరు పేరు వచ్చిందటే ఎక్కువ శాతం పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి కి సంబంధించిన వార్తే అయ్యుంటుంది.

ఇలాంటి పుంగనూరు నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది… 1983లో అఖండ విజయం సాధించిన 100 రోజుల్లోనే ఎన్టీఆర్ కు తలబొప్పి కట్టించింది ఈ నియోజకవర్గమే! ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ఓడిపోయిన చంద్రబాబు ఎన్నికల తరువాత టీడీపీలో చేరిన ఆయన మీద తొలి ఆరోపణలు వచ్చింది కూడా ఈ నియోజకవర్గం నుంచే !

ఆ చరిత్రలోకి వెళ్లే ముందు మొన్న శనివారం చనిపోయిన మాజీ జమిందార్, మాజీ ఎమ్మెల్యే సుందరమ్మణి గురించి కొంచం తెలుసుకోవాలి.

పుంగనూరు జమీన్ ఆంధ్రా ,కర్ణాటక ప్రాంతాలలో విస్తరించి ఉంది. ప్రసిద్ధి చెందిన సుగుటూరు జాతర జరిపేది ఈ పుంగనూరు జమిందారులే. 1955 ఎన్నికల్లో జమిందార్ రాజా వీర బసవ చిక్కరాయల్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాడు. ఆయన 1965లో చనిపోయారు.

1967 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గెలిచిన వారణాసి రామస్వామిరెడ్డి చిత్తూర్ జిల్లా జడ్పీ చైర్మన్ గా ఎన్నిక అయ్యారు. అప్పట్లో జడ్పీ చైర్మన్ కు క్యాబినెట్ ర్యాంక్ ఉండటం వలన ఆ పదవికి పోటీ ఎక్కువ. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో చిక్క రాయల్ సతీమణి సుందరమ్మణి గెలిచారు. 1972లో కూడా ఆవిడ ఎమ్మెల్యేగా గెలిచారు. 1978లో జలగం వెంగళరావు వర్గంలో కొనసాగి జాతీయ కాంగ్రెస్ (రెడ్డి కాంగ్రెస్ అని మీడియా పిలిచే) తరుపున పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయంగా క్రియాశీలకంగా లేరు.

నిన్న పత్రికల్లో వారణాసి రామస్వామిరెడ్డి కూడా సుందరమ్మణి కుటుంబానికి చెందిన వారే అని రాశారు కానీ అది నిజం కాదు. పుంగనూరు బంగళా జమిందార్ కుటుంబం ప్రైవైట్ ఆస్తిగా ఉంది.

ఇంక టీడీపీ చరిత్రలోకి వస్తే…1983లో టీడీపీ అభ్యర్థుల్లో ఎక్కువ మంది తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన వారే! వాడా,ఆ పుల్లయ్య కొడుకు, వీడా ఎల్లయ్య కొడుకు.. వీల్లెప్పుడు గెలవాలని అనుకునేవారు… లాంటి వారే గెలిచి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు..

1983 ఎన్నికల్లో టీడీపీ తరుపున బగ్గిడి గోపాల్ అనే బస్సు కండక్టర్ కు టికెట్ వొచ్చింది..పుంగనూరు నుంచి ఒక మాజీ ఎమ్మెల్యే ను పోటీ చేయమని అడగ్గా ఆయన మరో నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు.. చివరికి బగ్గిడి గోపాల్ కు టీడీపీ బీ ఫారం దక్కింది.

బగ్గిడి గోపాల్ విద్యార్థి నాయకుడిగా మదనపల్లిలో జై ఆంద్ర ఉద్యమానికి నాయకత్వం వహించాడు. అనేక కేసులు కూడా నమోదయ్యాయి. గోపాల్ ఎన్టీఆర్ అభిమాని, మంచి కళాకారుడు కూడా. ఎన్టీఆర్ సినిమా డైలాగ్స్ బాగా చెప్తాడు. ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన యువకుడు కావటంతో రాజకీయాల్లో దూకుడుగా ఉండేవారు.

ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ఓడిపోయిన చంద్రబాబు నెలలోపే టీడీపీలో చేరారు. అప్పటి నుంచి చిత్తూర్ జిల్లా రాజకీయాల్లో చంద్రబాబు కలగచేసుకోవటం ఎక్కువైంది.ఒక ఎమ్మెల్యే తో రాజీనామా చేపించి తానూ ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలని చంద్రబాబు ప్రయత్నం చేశారని నాడు పత్రికల్లో వార్తలు వచ్చాయి. పుంగనూరు నుంచి గెలిచిన బగ్గిడి గోపాల్ ను రాజీనామా చేయ్యమని చంద్రబాబు ఒత్తిడి తెచ్చినట్లు, ప్రలోభపెట్టినట్లు బగ్గిడి గోపాల్ 1983 మార్చ్ నెలలో ఆరోపించారు. ఈ ఆరోపణలు కొనసాగి 1983 ఏప్రిల్ 12 నాటికి పాకాన పడ్డాయి.

చంద్రబాబు కోరిక మేరకు ఎవరైనా ఎమ్మెల్యే రాజీనామా చేసినా దాన్ని ఎన్టీఆర్ అంగీకరించేవారా ?అవుననే కాదనో చెప్పలేము కానీ 1984లో మార్టూరు శాసనసభ్యుడిగా ఉన్న గొట్టిపాటి హనుమంతారావ్ ను ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ గా పంపి ఉప ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వర రావ్ ఎమ్మెల్యే గా గెలవటం గమనార్హం.

1983 ఉగాది సందర్భంగా ఏప్రిల్ 12న చిత్తూర్ జిల్లాలో కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్నీ ప్రారంభించటానికి వచ్చిన ఎన్టీఆర్ జిల్లా పర్యటనలో ముందుగా పుంగనూరు ఉండగా చివరి నిముషంలో ఎన్టీఆర్ పర్యటన నుంచి పుంగనూరును తప్పించటంతో బగ్గిడి గోపాల్ ఎన్టీఆర్ ముందు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి,బతిమిలాడి పుంగనూరు పర్యటనకు తీసుకెళ్లారు.పుంగనూరు ఎన్టీఆర్ సభలో విద్యార్థులు డిగ్రీ కాలేజ్ కోసం చేసిన నినాదాలు అదుపుతప్పి రాళ్ళూ రువ్వటం వరకు వెళ్ళింది. ఎన్టీఆర్ సభ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు.. విద్యార్థుల ఒత్తిడితో రాజీనామా చేసైనా డిగ్రీ కాలేజ్ సాధిస్తానని బగ్గిడి గోపాల్ ప్రకటించారు.. కట్ చేస్తే మరుసటి రోజు ఈనాడులో “గోడ దూకిన గోపాల్” అన్న వార్త…

ఆ గొడవ ముదిరి చివరికి టీడీపీ విప్ గోపాల్ ను సంజాయిషీ నోటీస్ ఇవ్వటంతో సంజాయిషీ కాదు రాజీనామా చేస్తున్నాను అని గోపాల్ ప్రకటించారు…

ఆగస్టు, సెప్టెంబర్ లలో జరిగిన శాసనసభలో గోపాల్ ను శాసనసభకు రాజీనామా చేయమని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. గోపాల్ ఎన్టీఆర్ స్టయిల్లో కాషాయ వస్త్రాలు కట్టుకొని ఆయన మాదిరే డైలాగ్స్ చెప్తూ హంగామా చేశారు.ఒక దశలో కాషాయ చొక్కాను విప్పి స్పీకర్ టేబుల్ మీద వేశారు. రెండు మూడురోజుల పాటు కొనసాగిన ఘర్షణ వాతవరణం చివరికి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో గోపాల్ మీద దాడి జరిగే వరకు వెళ్ళింది. మరో వైపు బగ్గిడి గోపాల్ చంద్రబాబు లక్ష్యంగా ఆరోపణలు చేయటం కొనసాగించారు.స్పీకర్ వ్యవస్థ కొంత స్వతంత్రంగా వ్యవహరించటంతో గోపాల్ మీద స్పీకర్ తాగి సత్య నారాయణ చర్యలు తీసుకోలేదు.

తన డైలాగ్స్ తో ప్రజలను ఆకట్టుకుంటున్న గోపాల్ వ్యవహారం తేల్చాలని 1983 మే లో టీడీపీ ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర నేతృత్వంలో టీడీపీ శ్రేణులు పుంగనూరు ముట్టడికి వెళ్లాయి. గోపాల తనకు ప్రాణ భయం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఆయనకు రక్షణ కలిపించారు…

ఈ మొత్తం చరిత్రలో విషాదం ,ఒకరాత్రి గోపాల్ అనుకోని ఆయన తమ్ముడిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గోపాల్ ఇంటి నుంచి కిడ్నప్ చేశారు. ఇప్పటికి కూడా ఆ యువకుడు ఏమయ్యాడో తేలలేదు. టీడీపీ నేతలే తన తమ్ముడిని హత్య చేయించారని గోపాల్ ఆరోపించారు.

టీడీపీ మీద రగిలిపోతున్న గోపాల్ కు నాదెండ్ల రూపంలో రాజకీయ ప్రతీకారాన్ని తీర్చుకొనే అవకాశం దొరికింది. నాదెండ్ల వర్గానికి సేనానిగా గోపాల్ వ్యవహరించారు. నాదెండ్ల ఎపిసోడ్ తరువాత రాజకుమారి మరి కొందరు నేతలను తీసుకొని గోపాల్ కాంగ్రెసులో చేరారు.

కాంగ్రెస్ లో చేరిన తరువాత గోపాల్, రాజకుమారి కుప్పం నుంచి మొదలు పెట్టి మూడు నెలల పాటు చంద్రబాబు, టీడీపీలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ రాష్ట్ర యాత్ర చేశారు. ఈ మధ్య వరకు కాంగ్రెస్ లో కొనసాగిన గోపాల్ దాదాపు 25 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా పనిచేశారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారింది. నాదెండ్ల వర్గంలో పనిచేసిన వారిలో అనేక మంది తిరిగి టీడీపీ గూటికి చేరినా బగ్గిడి గోపాల్ అటు వెళ్లకపోవటానికి కారణం ఎవరు అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

బగ్గిడి గోపాల్ నిష్క్రమణతో పుంగనూరు రాజకీయాల్లో N.రామకృష్ణరెడ్డి రంగ ప్రవేశం చేశారు. ఆయన పుంగ నూర్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా,చిత్తూర్ నుంచి రెండుసార్లు ఎంపీ గా గెలిచారు. రామకృష్ణారెడ్డి ఓటమి ఎరుగని నేత. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఈ రామకృష్ణారెడ్డి కొడుకే.

ఆ విధంగా ఎన్టీఆర్ భక్తుడైన బగ్గిడి గోపాల్ టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఆ పార్టీకి దూరం అయ్యాడు… ఈమధ్య తన పేరు మీద ఒక సినిమా కూడా తీశారు..

విజేతలకు దక్కిన ప్రాధాన్యత బగ్గిడి గోపాల్ లాంటి వారికి దక్కదు.. కానీ చరిత్ర చరిత్రే !