ఐరన్ లెగ్గు నుంచి గోల్డెన్ డక్కు దాకా

సినిమా పరిశ్రమ తీరే అంత. ఒక్క రోజులో జాతకాలు మారిపోతాయి. ఒక్క సినిమాతో జీవితాలు తలకిందులవుతాయి. కానీ ఏదీ ముందు ఊహించినట్టు జరగదు. దానికి ఉదాహరణగా హీరోయిన్ పూజా హెగ్డేనే తీసుకోవచ్చు. తను పరిశ్రమకు వచ్చి ఎనిమిదేళ్లు అయ్యింది. మొదటి సినిమా జీవా నటించిన ముగమూడి. తెలుగులో మాస్క్ పేరుతో డబ్ చేస్తే రెండు చోట్లా డిజాస్టర్. చాలా మందికి ఇది వచ్చిన సంగతి కూడా తెలియదు. తర్వాత నాగ చైతన్యతో ఒక లైలా కోసం చేస్తే దాని ఫలితం కూడా అంతంత మాత్రమే. 

ఇక వరుణ్ తేజ్ ముకుందా కూడా ఉపయోగపడలేదు. మెగా హీరో డెబ్యూ, శ్రీకాంత్ అడ్డాల లాంటి ఫామిలీ డైరెక్టర్ ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏవి  పని చేయలేదు. ఇలా లాభం లేదని బాలీవుడ్ లో హృతిక్ రోషన్ మొహేంజొదారో తో అక్కడ ఎంట్రీ ఇస్తే దారుణమైన డిజాస్టర్ మిగిలింది. ఇక ఐరన్ లెగ్ అనే స్టాంప్ పూజా హెగ్డేకు ఫిక్స్ అవుతుందేమో అనుకున్నారు అందరూ. కట్ చేస్తే అల్లు అర్జున్ డీజే మొత్తాన్ని మార్చేసింది. ఆ సినిమా చరిత్ర తిరగేసిన హిట్టేమీ కాదు. కానీ అందులో పూజా హెగ్డే అందాల ప్రదర్శనకు ప్రేక్షకులే కాదు ఇండస్ట్రీ జనం కూడా అయస్కాంతం లాగా ఆకర్శించబడ్డారు. 
ఆ తర్వాత సాక్ష్యం దెబ్బేసినా ఆ తర్వాత అరవింద సమేత వీర రాఘవ. మహర్షి, గద్దలకొండ గణేష్ ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టేసి హిందీలో కూడా హౌస్ ఫుల్ 4 రూపంలో తొలి హిట్ అందుకుంది. ఇక అల వైకుంఠపురములో గురించి చెప్పాల్సిన పని లేదు. నెక్స్ట్ క్యూలో ప్రభాస్ తో చేస్తున్న సినిమా ఉంది. కొన్నేళ్ల క్రితం ఐరన్ లెగ్ అనిపించుకున్న హీరోయిన్ వెంట ఇప్పుడు అగ్ర హీరోలు దర్శకులు వెంటపడుతున్నారంటే సక్సెస్ లో ఉండే కిక్ అది. అందుకే పెద్దలంటారు విజయలక్ష్మి వరించాలంటే ఓపిక ఉండాలని. 
Show comments