దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ రెండోసారి మరో 19 రోజులపాటు లాక్‌డౌన్ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ లాక్‌డౌన్‌పై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒకవేళ లాక్‌డౌన్ సత్ఫలితాలు ఇవ్వకపోతే ప్రభుత్వం వద్ద ప్రత్యేక ప్రణాళిక ఉందా అంటూ ప్రశ్నించారు.
ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్లో ఏమన్నారంటే, లాక్‌డౌన్‌పై చర్చ ఇప్పట్లో ముగిసేది కాదు. అయితే వాస్తవం ఏమిటంటే ఒకవేళ లాక్‌డౌన్ వల్ల ఆశించిన ఫలితం రానట్లయితే మే 3 తర్వాత ఏం జరగబోతోంది. ఆ తప్పిదాన్ని సరిచేయడానికి మన దగ్గర ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈ ట్వీట్ పై కొందరు నెటిజన్లు స్పందిస్తూ మీ దగ్గర ఏమైన సలహాలు ఉన్నాయా అంటూ కామెంట్ చేశారు. లాక్‌డౌన్‌పై సలహాలను మోడీకి చెప్పమని మరికొందరు సలహా ఇచ్చారు.
గతంలో మొదటిసారి లాక్‌డౌన్ విధించినప్పుడు కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశాంత్ కిషోర్ స్వాగతించారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించడం సరైనదేనని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా భారత్ లో 10000 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అయిన నేపథ్యంలో లాక్డౌన్ ను మే 3 వరకూ పొడిగిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు.