iDreamPost
android-app
ios-app

పడి లేచిన కోడి

పడి లేచిన కోడి

విపత్కర కాలంలో ఓ అపోహ ఎంతటికైనా దారితీస్తుందని చెప్పేందుకు పెద్ద ఉదహరణగా పౌల్ట్రి రంగాన్ని చూపించవచ్చు. కరోనా వైరస్‌ భారత దేశంలో ప్రారంభదశలో ఉన్నప్పుడు చికెన్‌ తింటే కరోనా వైరస్‌ వస్తుందనే ప్రచారం విస్తృతంగా జరిగింది. ప్రజల్లో నెలకొన్న అపోహలు తీవ్ర రూపం దాల్చాయి. ఫలితంగా పౌల్ట్రి రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. కరోనా వైరస్‌ వల్ల మొదట ప్రభావితమైన రంగం పౌల్ట్రినే. నష్టపోయిన రంగం కూడా ఇదే.

మార్చి మొదటి వారంలో కరోనా వైరస్‌ భయాందోళనలు భారత్‌లో ప్రారంభమయ్యాయి. రోజులు గడిచే కొద్దీ అవితీవ్ర రూపం దాల్చియి. మార్చి రెండో వారం నుంచి నెలాఖరు వరకూ చికెన్‌ దుకాణాలు వెలవెలబోయాయి. 170, 180 రూపాయలున్న కిలో స్కిన్‌ లెస్‌ చికెన్‌ 20, 30 రూపాయలకు పడిపోయింది. అయినా కొనే వారే కరువయ్యారు. పౌల్ట్రి రంగం అధికంగా ఉన్న తెలంగాణలోని వ్యాపారులు కోట్ల రూపాయల నష్టపోయామని వాపోయారు. ఫారాల్లోనే కోళ్లను ఉచితంగా ఇచ్చేసే పరిస్థితి కరోనా వైరస్‌ వల్ల సంభవించింది.

రోజులు గడిచే కొద్దీ ప్రజల్లో అపోహలు తొలగిపోయాయి. రాజకీయ నేతలు, డాక్టర్లు.. చికెన్‌ తింటే కరోనా రాదని పదే పదే చెప్పారు. ప్రస్తుత సమయంలో ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకోవాలని సూచించారు. అది చికెన్‌లో లభిస్తుందని చెప్పసాగారు. మీడియా కూడా ఈ అంశంపై విస్తృతంగా ప్రచారం చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పౌల్ట్రి వ్యాపారులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి రాజకీయ నేతలను ఆహ్వానించారు. ప్రజా ప్రతినిధులు బహిరంగంగా చికెన్‌ తిని ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగించే ప్రయత్నం చేశారు.

దాదాపు మూడు వారాల తర్వాత పడిన కోడి లేచింది. మునుపటిలా కూస్తోంది. చికెన్‌ దుకాణాల ముందు ప్రజలు బారులుతీరారు. గత ఆదివారం నుంచి చికెన్‌ మార్కెట్‌ కలకలలాడుతోంది. ధరలు పూర్వ స్థితికి వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్‌లో లైవ్‌ కిలో 100 రూపాయలు, స్కిన్‌లెస్‌ కిలో 170 నుంచి 180 రూపాయలు చొప్పున అమ్ముతున్నారు. ప్రస్తుత సమయంలో నిత్యవసర సరుకులు, కూరగాయలు, చికెన్‌ దుకాణాలను, మందుల షాపులను అధికారులు అనుమతిస్తున్నారు. ఈ వ్యాపారాల్లోకెల్లా ప్రస్తుతం చికెన్‌ వ్యాపారమే లాభసాటి మారింది.